న్యూఢిల్లీ: ప్రపంచమంతా మందగమనంలో కొట్టుమిట్టాడుతుంటే భారత్‌లోకి మాత్రం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను స్వాగతిస్తున్నామని, భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇది అత్యంత అనువైన సమయమని టెక్ దిగ్గజం అరవింద్ కృష్ణతో సోమవారం జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతర్జాతీయంగా పోటీపడేందుకు, సరఫరా వ్యవస్థల్లో సమస్యలు ఎదురైనా ఇబ్బందిపడే పరిస్థితి రాకుండా చూసుకునేందుకు భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశగా పురోగమిస్తోందని ఆయన పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ’వర్క్ ఫ్రం హోమ్’ విధానం ప్రాచుర్యంలోకి వస్తున్నందున అందుకు అవసరమైన ఇన్‌ఫ్రా, కనెక్టివిటీ, నియంత్రణ వ్యవస్థలపరంగా అనువైన పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఐబీఎం తమ సిబ్బందిలో 75% మంది ఇంటి నుంచే విధులు నిర్వర్తించేలా తీసుకున్న నిర్ణయం అమలు తీరుతెన్నులు, సవాళ్లు తదితర అంశాల గురించి చర్చించారు. మరోవైపు, భారత్‌లో తమ పెట్టుబడుల ప్రణాళికల గురించి అరవింద్ కృష్ణ వివరించారు. ప్రత్యేకంగా భారత్‌ను దృష్టిలో ఉంచుకుని వైద్య సంబంధ విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సాధనాలను కనుగొనే అవకాశాలపై దృష్టి పెట్టాలని కృష్ణను మోదీ కోరినట్లు ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment