గ్రీసు, రుతుపవనాల ఆధారంగా ట్రెండ్
న్యూఢిల్లీ : దేశంలో రుతుపవనాల గమనం, అంతర్జాతీయంగా గ్రీసు దేశపు రుణ సంక్షోభ సమస్యల ఆధారంగా ఈ వారం మార్కెట్ ట్రెండ్ వుంటుందని విశ్లేషకులు అంచనావేశారు. దేశీయంగా కీలకమైన అంశమేదీ లేనందున, రుతుపవనాల గమనం మార్కెట్లో స్వల్పకాలిక ట్రెండ్‌ను నిర్దేశిస్తుందని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ అన్నారు. ఇప్పటివరకూ దేశంలో వర్షాలు సగటుకంటే అధికంగానే కురిశాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో గతవారం దేశీయ మార్కెట్ పుంజుకుంది. జూలై, ఆగస్టు నెలల్లో రైతులు పంటలు వేయనున్నందున, ఇకముందు రుతుపవనాల కదలికలు ప్రధానమని ఆయన చెప్పారు.
ఇక అంతర్జాతీయపరంగా గ్రీసు రుణ సంక్షోభ పరిష్కారానికి జరుగుతున్న ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను ప్రభావితం చేస్తుందని ఆయన చెప్పారు. ఈ నెలాఖరుకల్లా గ్రీసు ఐఎంఎఫ్‌కు ఇవ్వాల్సిన మొత్తం చెల్లించకపోతే, ఆ దేశం దివాలా తీసినట్లవుతుంది. దాంతో స్టాక్, బాండ్ మార్కెట్లు అతలాకుతలమవుతాయని అంచనా. అయితే గ్రీసుకు అవసరమైన నిధులిచ్చే అంశమై యూరోపియన్ యూనియన్ ఈ సోమవారం జరపనున్న సమావేశం కీలకం కానుందని అగర్వాల్ వివరించారు. జూన్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ గురువారం ముగియనున్న నేపథ్యంలో మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని మరోవైపు నిపుణులు హెచ్చరించారు.
గతవారం మార్కెట్..
గతవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వంలో ర్యాలీ జరిగిన ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీలు 3-3.5 శాతం మధ్య పెరిగాయి. సెన్సెక్స్ 891 పాయింట్లు లాభపడి 27,316 పాయింట్ల వద్దకు చేరింది. నిఫ్టీ 242 పాయింట్ల లాభంతో 8,225 పాయింట్ల వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 12 శాతం పెరగ్గా, ఓఎన్‌జీసీ, మహీంద్రా, హిందుస్థాన్ యూనీలీవర్‌లు 5 శాతంపైగా ఎగిసాయి.