వాషింగ్టన్: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2018లో 7.3 శాతంగా నమోదవుతుందని ప్రపంచబ్యాంక్ అంచనా వేస్తోంది. అటుపై రెండేళ్లలో వృద్ధి 7.5 శాతంగా ఉంటుందనీ విశ్లేషిస్తోంది. ఇతర వర్ధమాన దేశాలతో పోల్చితే, భారత్‌కు మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న ప్రపంచబ్యాంక్ ఈ సందర్భంగా కేంద్రం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలను ప్రస్తావించింది. 2018 గ్లోబల్ ఎకనమిక్స్ ప్రాస్పెక్టస్ పేరుతో ప్రపంచబ్యాంక్ విడుదల చేసిన తాజా నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...
♦ 2017లో భారత్ వృద్ధి 6.7 శాతం అంచనా. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను అమలుకు తొలిదశలో ఏర్పడుతున్న ఇబ్బందులు దీనికి ప్రధాన కారణాలు.
♦ వృద్ధి మందగమనంలో ఉన్న చైనాతో పోల్చి చూస్తే, భారత్‌లో వృద్ధి వేగం క్రమంగా పుంజుకుంటోంది. 2017లో భారత్‌కన్నా (6.7 శాతం) కొంచెం ఎక్కువగా ఉన్న చైనా వృద్ధి రేటు (6.8 శాతం), 2018లో 6.4 శాతానికి తగ్గే వీలుంది. అటుపై వచ్చే రెండేళ్లలో వృద్ధి 6.3 శాతం, 6.2 శాతానికి తగ్గవచ్చు
♦ వచ్చే పదేళ్లలో భారత్ వృద్ధి సగటున 7 శాతం ఉండచ్చు. కొన్ని ఇబ్బందులు తలెత్తినా, మొత్తంగా ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉంటుంది.
♦ ఉత్పాదనాపరంగా సానుకూల స్థితిలో ఉన్న భారత్, బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య పరిష్కారానికి తగిన కృషి చేస్తోంది. ఈ సవాలునూ అధిగమించగలిగితే, దేశంలో వృద్ధి మరింత ఊపందుకుంటుంది. మొండిబకాయిలతోపాటు ఉద్యోగ కల్పన, ప్రైవేటు పెట్టుబడుల పెంపు వంటి అంశాలూ కీలకమైనవి.
♦ ఇక దేశంలో మహిళా కార్మిక శక్తి కూడా మరింత పటిష్టమవ్వాల్సి ఉంది. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినా భారత్ ఈ విషయంలో వెనుకబడి ఉంది. ఆర్థికాభివృద్ధిలో మహిళా కార్మిక శక్తి ప్రాధాన్యత ఎంతో ఉంటుంది.
2018–19లో వృద్ధి 7.3%: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
కాగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్– 2019 మార్చి మధ్య) భారత్ వృద్ధి 7.3 శాతం నమోదవువుతుందని దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అంచనావేసింది. గ్రామీణాభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు, పెరుగుతున్న వినియోగం దీనికి కారణాలుగా విశ్లేషించింది.
రీక్యాప్ బాండ్లతో బ్యాంకులకు భరోసా: ఫిచ్
ఇదిలావుండగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల పటిష్టతకు కేంద్ర రీ–క్యాపిటలైజేషన్ ప్రణాళిక మంచి ఫలితాలను అందిస్తుందని క్రెడిట్ రేటింగ్ సంస్థ– ఫిచ్ తన తాజా నివేదికలో పేర్కొంది. రుణ వృద్ధికీ ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంది.
ఆదాయ వృద్ధి ఐదేళ్ల గరిష్టానికి...: క్రిసిల్
ఇక భారత కంపెనీల ఆదాయ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ కాలానికి కంపెనీల ఆదాయాలు 9 శాతానికి పైగా పెరుగుతాయని పేర్కొంది. అయితే లాభాల క్షీణత మాత్రం కొనసాగుతుందని వివరించింది.
2018లో భారత్ వృద్ధి 7.3 %
Published Thu, Jan 11 2018 12:53 AM | Last Updated on Thu, Jan 11 2018 12:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment