బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు జీవీకే టాటా
♦ మిగిలిన 10 శాతం వాటాలు కూడా విక్రయం
♦ ఫెయిర్‌ఫ్యాక్స్‌కు విక్రయం; విలువ రూ.1,290 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బెంగళూరు విమానాశ్రయం ప్రాజెక్టు నుంచి పూర్తిగా వైదొలిగింది. ఇందులో మిగిలి ఉన్న 10 శాతం వాటాను కెనడాకి చెందిన ఎన్నారై వ్యాపారవేత్త ప్రేమ్‌వత్స సంస్థ ఫెయిర్‌ఫ్యాక్స్ ఇండియా హోల్డింగ్స్ కార్పొరేషన్‌కు రూ.1,290 కోట్లకు విక్రయించింది. దీంతో బెంగళూరు ఎయిర్‌పోర్టులో వత్స వాటాలు 48 శాతానికి పెరిగాయి. ఇంకా సీమెన్స్ ప్రాజెక్ట్ వెంచర్స్‌కి 26 శాతం, ఎయిర్‌పోర్ట్ అథారిటీ.. కర్ణాటక స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లకు చెరి 13 శాతం వాటాలున్నాయి.
ప్రస్తుతం రుణభారాన్ని తగ్గించుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, అందులో భాగంగానే బెంగళూరు విమానాశ్రయం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నామని జీవీకే గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ జీవీకే రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అయితే, విమానాశ్రయాల వ్యాపార విభాగం తమకు కీలకంగానే కొనసాగుతుందని ఆయన తెలియజేవారు. ముంబై విమానాశ్రయంతో పాటు ఇటీవలే బిడ్డింగ్‌లో దక్కించుకున్న నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌లపై దృష్టి సారించనున్నట్లు చెప్పారాయన. ముంబై ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం, రియల్ ఎస్టేట్ అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెడతామని పేర్కొన్నారు. దాదాపు రూ. 22,000 కోట్ల మేరకు పెరిగిపోయిన రుణభారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో జీవీకే గ్రూప్ పలు ఆస్తుల విక్రయానికి ప్రయత్నాలు చేస్తోంది.
రద్దీ విమానాశ్రయాల్లో మూడోది
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీవీకే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన నిర్మించింది. ప్రస్తుతం ఇది దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో మూడోది. గతేడాది మార్చిలో ఈ ఎయిర్‌పోర్ట్ విలువ రూ.6,500 కోట్లుగా లెక్కగట్టారు. 10% వాటా, యాజమాన్య నియంత్రణనను తన దగ్గరే అట్టి పెట్టుకుని, రూ.2,202 కోట్లకు ఫెయిర్‌ఫ్యాక్స్‌కు 33% వాటాను విక్రయించేట్లుగా జీవీకే విక్రయించింది. దీంతో పాటు ఫ్లూగాఫెన్ జ్యూరిక్ ఏజీ నుంచి మరో 5 శాతం వాటాలు కొనుగోలు చేయడం ద్వారా ప్రేమ్ వత్స బెంగళూరు విమానాశ్రయంలో తన వాటాలను 38 శాతానికి పెంచుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో తనకు మిగిలి ఉన్న 10 శాతం వాటాలను, యాజమాన్య నియంత్రణను కూడా ఫెయిర్‌ఫ్యాక్స్ ఇండియాకి విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు జీవీకే జూన్‌లో ప్రకటించింది.