బెంగళూరు విమానాశ్రయంలో జీవీకే వాటా విక్రయం
♦ ఫెయిర్‌ఫ్యాక్స్‌కు 33 శాతం వాటా అమ్మకం
♦ డీల్ విలువ రూ. 2,149 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీవీకే పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అతిపెద్ద డీల్‌కు తెరలేపింది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (బీఐఏఎల్) 33 శాతం వాటాను ఫెయిర్‌ఫ్యాక్స్ గ్రూప్‌నకు రూ.2,149 కోట్లకు విక్రయిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ డీల్ ద్వారా జీవీకే రూ.2,000 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకోనుంది. అలాగే ఏటా రూ.300 కోట్ల వడ్డీ ఆదా చేసుకోనుంది. జూన్-జూలైకల్లా లావాదేవీ పూర్తి అయ్యే అవకాశం ఉంది. రుణ భారం నుంచి బయట పడేందుకు విమానాశ్రయ వ్యాపారంలో వాటా విక్రయానికి సిద్ధంగా ఉన్నట్టు జీవీకే 2014లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు అతిపెద్ద సంస్థతో చేతులు కలిపింది. ఫెయిర్‌ఫ్యాక్స్ భాగస్వామ్యంతో విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌తోపాటు రన్‌వేను ప్రపంచ స్థాయిలో విస్తరిస్తామని జీవీకే గ్రూప్ ఫౌండర్ చైర్మన్, ఎండీ జీవీకే రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
వాటాదారులు వీరే..
బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జీవీకేకు 43 శాతం వాటా ఉంది. అలాగే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, కర్ణాటక ప్రభుత్వం, జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్, సీమెన్స్ ప్రాజెక్ట్ వెంచర్ ఇతర వాటాదారులుగా ఉన్నాయి. బీఐఏఎల్‌లో జీవీకే 2009లో 12 శాతం వాటాను రూ.485 కోట్లకు తీసుకుంది. అదే ఏడాది రూ.686 కోట్లు చెల్లించి 17 శాతం వాటా పొందింది. 2011లో 14 శాతం వాటాను రూ.614 కోట్లతో దక్కించుకుంది. మొత్తంగా 43 శాతం వాటా కోసం జీవీకే రూ.1,785 కోట్లు వ్యయం చేసింది. బీఐఏఎల్ ఎండీగా జీవీ సంజయ్‌రెడ్డి, సహ చైర్మన్‌గా జీవీకే రెడ్డి కొనసాగుతారని ఫెయిర్‌ఫ్యాక్స్ చైర్మన్ ప్రేమ్ వత్స వెల్లడించారు.
భారత సంతతికి చెందిన..
కెనడాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ అయిన ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌ను భారత్‌లో పుట్టిన ప్రేమ్ వత్స స్థాపించారు. మారిషస్‌లో ఉన్న అనుబంధ కంపెనీల ద్వారా బీఐఏఎల్‌లో వాటాను ఫెయిర్‌ఫ్యాక్స్ ఇండియా హోల్డింగ్స్ కార్పొరేషన్ కైవసం చేసుకోనుంది. బీఐఏఎల్‌లో వాటా కొనుగోలు చేయడం భారత్‌లో ఫెయిర్‌ఫ్యాక్స్‌కు అతిపెద్ద డీల్. ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్, నేషనల్ కొలాటెరల్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఫెయిర్‌ఫ్యాక్స్‌కు వాటా ఉంది. అలాగే అనుబంధ కంపెనీలైన థామస్ కుక్, క్వెస్ కార్ప్ ద్వారా భారత్‌లోని ఇతర కంపెనీల్లోనూ వాటా పొందింది.