Bangalore International Airport
-
ఎయిర్‌పోర్టుల్లో ‘బిచ్చగాడు’.. ఓ యువకుడి నకిలీ యాచన!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు కూడళ్లు, ప్రార్థనా స్థలాలు, ఫంక్షన్ హాళ్లు తదితర చోట్ల యాచకులను చూస్తూనే ఉంటాం. వృద్ధాప్యం వల్లో లేదా శారీరక వైకల్యం వల్లో యాచించే వారు కొందరైతే దీన్నే దందాగా మార్చుకొని జీవించే వారు ఇంకొందరు కనిపిస్తుంటారు. కానీ ఇలా రోజంతా అడుక్కున్నా ఎవరికైనా లభించేది చిల్లరే... అందుకే సులువుగా నోట్ల కట్టలు సంపాదించేందుకు ఓ యువకుడు ఏకంగా ఎయిర్‌పోర్టులనే లక్ష్యంగా చేసుకొని ‘బిచ్చగాడి’అవతారం ఎత్తాడు! శంషాబాద్ ఎయిర్పోర్ట్ సహా ఎనిమిది విమానాశ్రయాల్లో నాలుగేళ్లుగా ‘యాచిస్తూ’విదేశీయులు, ప్రవాస భారతీయులు సహా అనేక మంది నుంచి భారీగా నగదు వసూలు చేశాడు. చివరకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. అక్కడి సీఐఎస్ఎఫ్ అధికారుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. పర్సు పోవడంతో ఎదురైన అనుభవంతో.. చెన్నైకు చెందిన విఘ్నేష్ బీటెక్ పూర్తి చేసి కొన్నాళ్లు బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉగ్యోగం చేశాడు. అప్పట్లో అతనికి నాలుగంకెల జీతం కూడా వచ్చేది. ఓసారి బెంగళూరు నుంచి చెన్నై రావడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని విమానాశ్రయానికి వస్తుండగా విఘ్నేష్ పర్సు పోగొట్టుకున్నాడు. విమాన టికెట్ తన ఫోన్లోనే ఉన్నప్పటికీ చెన్నైలో దిగాక ఇంటికి వెళ్లేందుకు రూపాయి కూడా లేని పరిస్థితిని బెంగళూరు విమానాశ్రయం లాంజ్‌లో ఓ విదేశీయుడితో పంచుకున్నాడు. అతనిపై జాలిపడ్డ విదేశీయుడు రూ. 10 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగం కోల్పోవడంతో రోడ్డునపడ్డ విఘ్నేష్... బెంగళూరు ఎయిర్‌పోర్టు అనుభవంతో ఈజీ మనీపై దృష్టిపెట్టాడు. ముందస్తు షెడ్యూల్‌తో ముష్టి కోసం.. విమానాశ్రయాలనే టార్గెట్‌గా చేసుకొని ప్రయాణికులకు వివిధ పేర్లతో టోకరా వేసి డబ్బు దండుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం విఘ్నేష్ నిర్ణీత సమయానికి ముందే తక్కువ ధరకు వచ్చేలా డొమెస్టిక్ విమాన టికెట్లు బుక్ చేసుకొనేవాడు. ఖరీదైన క్యాజువల్స్ ధరించి, చేతిలో లగేజ్ బ్యాగ్‌తో ఎవరికీ అనుమానం రాకుండా ఫ్లైట్ షెడ్యూల్ టైమ్‌కు దాదాపు 4–5 గంటల ముందే ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించేవాడు. ఒంటరిగా ప్రయాణిస్తున్న ప్యాసింజర్‌ను ఎంచుకుని మాటలు కలిపేవాడు. ఆపై ఫోన్ (సైలెంట్ మోడ్‌లో ఉంచి) మాట్లాడినట్లు నటించేవాడు. తన తండ్రి తీవ్ర అనారోగ్యంపాలైనట్లు ఫోన్లో కుటుంబ సభ్యులు చెప్పారని... వెంటనే శస్త్రచికిత్స చేయించేందుకు తన వద్ద డబ్బు లేదని ప్యాసింజర్‌కు చెప్పి సాయం కోరేవాడు. దీంతో ఆ ప్యాసింజర్ జాలిపడి వీలైనంత సొమ్ము ఇచ్చేవాడు. ఆ తర్వాత విమానం ఎక్కి మరో నగరంలో దిగి అక్కడ కూడా ఇదే పంథాలో దండుకొనేవాడు. ఇలా విఘ్నేష్ ఒక్కోరోజు రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదించేవాడు. నిర్ణీత మొత్తం సంపాదించాకే చెన్నైలోని ఇంటికి తిరిగెళ్లేవాడు. ఆ డబ్బు ఖర్చయ్యే వరకు జల్సాలు చేసేవాడు. ఇప్పటివరకు ఫిర్యాదులులేకపోవడంతో.. ఈ పంథాలో విఘ్నేష్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ సహా ఎనిమిది నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తన జేబు నింపుకున్నాడు. విఘ్నేష్ మోసగించిన వారిలో అత్యధికులు విదేశీయులే కావడంతో వారికి ఇది మోసమని తెలిసే అవకాశం లేదు. ఈ కారణంగానే 2021 నుంచి విఘ్నేష్ దందా నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ నెల 11న బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇద్దరికి టోకరా వేసి మూడో వ్యక్తి దగ్గరకు విఘ్నేష్ వెళ్లడాన్ని గమనించిన ఓ సీఐఎస్ఎఫ్ అధికారి అతనిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు బండారం బయటపడింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు విఘ్నే‹Ùను పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో విఘ్నేష్ హైదరాబాద్‌లో సాగించిన ‘భిక్షాటన’గురించి నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. -
ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయంలో వేగంగా చెకిన్..
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఆధారిత ‘డిజి యాత్రా’ బీటా వెర్షన్ మొబైల్ అప్లికేషన్ బెంగళూరు, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద సోమవారం నుంచి పనిచేయడం ప్రారంభమైంది. ఈ యాప్ సాయంతో ప్రయాణికులు విమానాశ్రయంలోకి వేగంగా చెకిన్ కావచ్చని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది.ఈ సదుపాయం ప్రారంభించిన తర్వాత 20వేల మంది ప్రయాణికులు మొదటి రోజు అవాంతరాల్లేని, సురక్షిత ప్రయాణ అనుభవాన్ని చూసినట్టు తెలిపింది. బయోమెట్రిక్, ఇతర కీలక వివరాలను ప్రయాణికులు మూడో నంబర్ టెర్మినల్ వద్ద సమర్పించిట్టు ప్రకటన విడుదలైంది. ఈ యాప్‌నకు బోర్డింగ్ పాస్‌ను లింక్ చేయడం ద్వారా ఎయిర్‌పోర్ట్‌లోని పలు తనిఖీలను మానవ ప్రమేయం లేకుండా, డీజిటల్‌గా పూర్తి చేసుకోవడం సాధ్యపడుతుంది. డిజి యాత్రా బీటా వెర్షన్‌ను పరీక్షించేందుకు బెంగళూరు, ఢిల్లీ విమానాశ్రయాలనే ఎంపిక చేశారు. విస్తృత పరిశీలన తర్వాత అన్ని విమానాశ్రయాల్లో దీన్ని ప్రవేశపెడతారు. -
బెంగళూరు విమానాశ్రయంలో ఫెయిర్‌ఫ్యాక్స్ పాగా
కంపెనీ చేతికి జ్యూరిక్ ఎయిర్పోర్ట్ వాటా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో (బీఐఏఎల్) ఫెయిర్‌ఫ్యాక్స్ వాటా పెంచుకుంటోంది. బీఐఏఎల్‌లో మైనారిటీ షేర్ హోల్డర్‌గా ఉన్న జ్యూరిక్ ఎయిర్పోర్ట్ తనకున్న 5 శాతం వాటాను ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంది. డీల్ విలువ (పన్నులకు ముందు) రూ.318 కోట్లు. దీంతో ఫెయిర్‌ఫ్యాక్స్ వాటా 38 శాతానికి చేరుకోనుంది. తద్వారా మెజారిటీ వాటాదారుగా నిలువనుంది. ఇటీవలే విమానాశ్రయంలో 33% వాటాను రూ.2,149 కోట్లకు ఫెయిర్‌ఫ్యాక్స్‌కు అమ్ముతున్నట్టు జీవీకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డీల్‌తో జీవీకే వాటా 10 శాతానికి పరిమితం అవుతోంది. కాగా, 2009లో జ్యూరిక్ ఎయిర్పోర్ట్ బీఐఏఎల్‌లో 12 శాతం వాటాను జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు విక్రయించింది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్ర యాన్ని బీఐఏఎల్ నిర్వహిస్తోంది. విమానాశ్రయంలో ప్రస్తుతం సీమెన్స్ ప్రాజెక్ట్ వెంచర్స్‌కు 26 శాతం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 13%, కర్ణాటక స్టేట్ ఇండస్ట్రియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు 13 శాతం వాటా ఉంది. కెనడాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌ను భారత్‌లో పుట్టిన ప్రేమ్ వత్స స్థాపించారు. -
బెంగళూరు విమానాశ్రయంలో జీవీకే వాటా విక్రయం
♦ ఫెయిర్‌ఫ్యాక్స్‌కు 33 శాతం వాటా అమ్మకం ♦ డీల్ విలువ రూ. 2,149 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అతిపెద్ద డీల్‌కు తెరలేపింది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (బీఐఏఎల్) 33 శాతం వాటాను ఫెయిర్‌ఫ్యాక్స్ గ్రూప్‌నకు రూ.2,149 కోట్లకు విక్రయిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ డీల్ ద్వారా జీవీకే రూ.2,000 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకోనుంది. అలాగే ఏటా రూ.300 కోట్ల వడ్డీ ఆదా చేసుకోనుంది. జూన్-జూలైకల్లా లావాదేవీ పూర్తి అయ్యే అవకాశం ఉంది. రుణ భారం నుంచి బయట పడేందుకు విమానాశ్రయ వ్యాపారంలో వాటా విక్రయానికి సిద్ధంగా ఉన్నట్టు జీవీకే 2014లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు అతిపెద్ద సంస్థతో చేతులు కలిపింది. ఫెయిర్‌ఫ్యాక్స్ భాగస్వామ్యంతో విమానాశ్రయంలో కొత్త టెర్మినల్తోపాటు రన్‌వేను ప్రపంచ స్థాయిలో విస్తరిస్తామని జీవీకే గ్రూప్ ఫౌండర్ చైర్మన్, ఎండీ జీవీకే రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. వాటాదారులు వీరే.. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జీవీకేకు 43 శాతం వాటా ఉంది. అలాగే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, కర్ణాటక ప్రభుత్వం, జ్యూరిచ్ ఎయిర్పోర్ట్, సీమెన్స్ ప్రాజెక్ట్ వెంచర్ ఇతర వాటాదారులుగా ఉన్నాయి. బీఐఏఎల్‌లో జీవీకే 2009లో 12 శాతం వాటాను రూ.485 కోట్లకు తీసుకుంది. అదే ఏడాది రూ.686 కోట్లు చెల్లించి 17 శాతం వాటా పొందింది. 2011లో 14 శాతం వాటాను రూ.614 కోట్లతో దక్కించుకుంది. మొత్తంగా 43 శాతం వాటా కోసం జీవీకే రూ.1,785 కోట్లు వ్యయం చేసింది. బీఐఏఎల్ ఎండీగా జీవీ సంజయ్‌రెడ్డి, సహ చైర్మన్‌గా జీవీకే రెడ్డి కొనసాగుతారని ఫెయిర్‌ఫ్యాక్స్ చైర్మన్ ప్రేమ్ వత్స వెల్లడించారు. భారత సంతతికి చెందిన.. కెనడాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అయిన ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌ను భారత్‌లో పుట్టిన ప్రేమ్ వత్స స్థాపించారు. మారిషస్‌లో ఉన్న అనుబంధ కంపెనీల ద్వారా బీఐఏఎల్‌లో వాటాను ఫెయిర్‌ఫ్యాక్స్ ఇండియా హోల్డింగ్స్ కార్పొరేషన్ కైవసం చేసుకోనుంది. బీఐఏఎల్‌లో వాటా కొనుగోలు చేయడం భారత్‌లో ఫెయిర్‌ఫ్యాక్స్‌కు అతిపెద్ద డీల్. ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్, నేషనల్ కొలాటెరల్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఫెయిర్‌ఫ్యాక్స్‌కు వాటా ఉంది. అలాగే అనుబంధ కంపెనీలైన థామస్ కుక్, క్వెస్ కార్ప్ ద్వారా భారత్‌లోని ఇతర కంపెనీల్లోనూ వాటా పొందింది.