
ప్రపంచ టాప్-50లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
అత్యంత విలువైన బ్యాంకుల జాబితాలో 45వ స్థానం
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత విలువైన బ్యాంకుల జాబితా(2014 ఏడాదికి)లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చోటు దక్కించుకుంది. మార్కెట్ విలువ ఆధారంగా రెల్‌బ్యాంక్స్ ఈ టాప్-50 జాబితాను రూపొందించింది. 40.58 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో హెచ్‌డీఎఫ్‌సీ 45వ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా టాప్-50లోని ఏకైక భారతీయ బ్యాంక్ ఇదే కావడం గమనార్హం.
ఇక అమెరికాకు చెందిన వెల్స్‌ఫార్గో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును చేజిక్కించుకుంది. 7 కోట్ల మందికిపైగా కస్టమర్లు, 9,000కు పైగా శాఖలు... 284 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఈ బ్యాంక్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత ర్యాంకుల్లో ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా(మార్కెట్ విలువ 270 బిలియన్ డాలర్లు), జేపీ మెర్గాన్ చేజ్(234 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. టాప్-10 బ్యాంకుల్లో అమెరికా, చైనాలకు చెందినవి చెరో నాలుగు బ్యాంకులు కాగా, బ్రిటన్, ఆస్ట్రేలియా నుంచి ఒక్కో బ్యాంక్ స్థానం పొందాయి.
ఇక భారత్ నుంచి ఎస్‌బీఐ(36 బిలియన్ డాలర్లు) 51వ స్థానం, ఐసీఐసీఐ బ్యాంక్ 55వ ర్యాంకు(33 బిలియన్ డాలర్లు)ల్లో నిలిచాయి. కాగా, 2014 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికరలాభం 20% వృద్ధి తో 2,381.5 కోట్లకు చేరింది. వరుసగా 37 క్వార్టర్లలో 30%పైగా లాభాల్ని పెంచుకున్న ఈ బ్యాంక్ గత 5 క్వార్టర్లలో 30%లోపు వృద్ధిని నమోదు చేసింది.