మోదీ బిగ్ ప్లాన్ ఇదే!
మోదీ బిగ్ ప్లాన్ ఇదే!
Published Fri, Sep 1 2017 10:03 AM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM
సాక్షి, న్యూఢిల్లీ : అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ పెద్ద నోట్లను రద్దు చేసిన నరేంద్రమోదీ ప్రభుత్వం, భారత్‌ను నగదు రహిత దేశంగా మార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. నగదు వాడకం ఎక్కువగా ఉన్న మన దేశంలో, నగదు నుంచి విముక్తి కల్పించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే డిజిటల్ లావాదేవీలను విపరీతంగా ప్రోత్సహిస్తోంది. సైబర్ నేరాల సంగతి ఎలా ఉన్నా.. డిజిటల్ లావాదేవీలకే పెద్ద పీట వేస్తోంది. తాజాగా అన్ని ప్రభుత్వం డిపార్ట్‌మెంట్లు, ఏజెన్సీలకు డిజిటల్ పేమెంట్లను తప్పనిసరి చేయాలని మోదీ ప్రభుత్వం మార్గాలను అన్వేసిస్తోంది. రైల్వేలు, రోడ్డు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ వంటి సర్వీసులకు డిజిటల్ పేమెంట్లను ప్రభుత్వం తప్పనిసరి చేయబోతుందంటూ సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.
భీమ్, భారత్ క్యూఆర్ కోడ్ వంటి అధికారిక పేమెంట్ మోడ్స్ ద్వారా ప్రభుత్వ రంగ ఏజెన్సీలు ఈ ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వేకు తెరవాలని ప్లాన్ చేస్తుందని తెలిపారు. డిజిటల్ పేమెంట్లకు ప్రభుత్వం ప్రోత్సహకాలు కూడా ఇవ్వాలని చూస్తోంది. నగదు రహిత ఆర్థికవ్యవస్థను సాధించే లక్ష్యంతో ప్రభుత్వం గాంధీ జయంతి రోజున బిగ్-టిక్కెట్ క్యాంపెయిన్‌ను కూడా లాంచ్‌చేయబోతుందని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం వరకు ఈ క్యాంపెయిన్ నిర్వహించనున్నారట.
మొత్తం లావాదేవీల్లో ప్రభుత్వం చెల్లింపులు ఎక్కువగా ఉంటున్నాయని, వీటిని డిజిటల్‌గా చేస్తే, ఈ-పేమెంట్ల వృద్ధి భారీగా ఉంటుందని అధికారి వివరించారు. అక్టోబర్ 2న ఈ క్యాంపెయిన్‌ను ఆవిష్కరించాలని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా అధికారులను ఆదేశించారు. గతవారంలోనే దీనికి సంబంధించి మంత్రి అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారని తెలిసింది. డిజిటల్ పేమెంట్లను స్వీకరించడానికి టిక్కెట్ కౌంటర్లను సిద్ధం చేయాలని తాము నిర్ణయించినట్టు రైల్వే బోర్డు అధికారులు పేర్కొన్నారు. కొత్త నిబంధనల కింద దేశవ్యాప్తంగా ఉన్న 14 లక్షల రిజర్వేషన్ కౌంటర్ల వద్ద భారత్ క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు.
ఫ్రైట్ బుకింగ్స్‌లో కూడా ఇదే విధమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు, ఇప్పటికే 90శాతం ఫ్రైట్ పేమెంట్లు నగదు రహితంగా జరుగుతున్నాయన్నారు. భారత రైల్వే రూ.52వేల కోట్ల విలువైన ప్రయాణికుల టిక్కెట్లను విక్రయిస్తోంది. దీనిలో 60 శాతం ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్ ద్వారా జరిగితే, మిగతావి రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ఎక్కువగా నగదు రూపంలో జరుగుతున్నాయి. ఇలా ఒక్క రైల్వేలోనే కాక, బస్సు, మెట్రో టిక్కెట్ కౌంటర్లు, పాస్‌పోర్టు ఆఫీసులు వంటి అన్ని ప్రభుత్వ-ప్రజా సంబంధిత ఆఫీసుల్లో భారత్ క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్లను స్వీకరించాలని ప్రభుత్వం చూస్తోంది.
Advertisement
Advertisement