Cashless Economy
-
మోదీ బిగ్ ప్లాన్ ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ : అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ పెద్ద నోట్లను రద్దు చేసిన నరేంద్రమోదీ ప్రభుత్వం, భారత్‌ను నగదు రహిత దేశంగా మార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. నగదు వాడకం ఎక్కువగా ఉన్న మన దేశంలో, నగదు నుంచి విముక్తి కల్పించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే డిజిటల్ లావాదేవీలను విపరీతంగా ప్రోత్సహిస్తోంది. సైబర్ నేరాల సంగతి ఎలా ఉన్నా.. డిజిటల్ లావాదేవీలకే పెద్ద పీట వేస్తోంది. తాజాగా అన్ని ప్రభుత్వం డిపార్ట్మెంట్లు, ఏజెన్సీలకు డిజిటల్ పేమెంట్లను తప్పనిసరి చేయాలని మోదీ ప్రభుత్వం మార్గాలను అన్వేసిస్తోంది. రైల్వేలు, రోడ్డు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ వంటి సర్వీసులకు డిజిటల్ పేమెంట్లను ప్రభుత్వం తప్పనిసరి చేయబోతుందంటూ సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. భీమ్, భారత్ క్యూఆర్ కోడ్ వంటి అధికారిక పేమెంట్ మోడ్స్ ద్వారా ప్రభుత్వ రంగ ఏజెన్సీలు ఈ ఆన్లైన్ పేమెంట్ గేట్‌వేకు తెరవాలని ప్లాన్ చేస్తుందని తెలిపారు. డిజిటల్ పేమెంట్లకు ప్రభుత్వం ప్రోత్సహకాలు కూడా ఇవ్వాలని చూస్తోంది. నగదు రహిత ఆర్థికవ్యవస్థను సాధించే లక్ష్యంతో ప్రభుత్వం గాంధీ జయంతి రోజున బిగ్-టిక్కెట్ క్యాంపెయిన్‌ను కూడా లాంచ్‌చేయబోతుందని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం వరకు ఈ క్యాంపెయిన్ నిర్వహించనున్నారట. మొత్తం లావాదేవీల్లో ప్రభుత్వం చెల్లింపులు ఎక్కువగా ఉంటున్నాయని, వీటిని డిజిటల్‌గా చేస్తే, ఈ-పేమెంట్ల వృద్ధి భారీగా ఉంటుందని అధికారి వివరించారు. అక్టోబర్ 2న ఈ క్యాంపెయిన్‌ను ఆవిష్కరించాలని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా అధికారులను ఆదేశించారు. గతవారంలోనే దీనికి సంబంధించి మంత్రి అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారని తెలిసింది. డిజిటల్ పేమెంట్లను స్వీకరించడానికి టిక్కెట్ కౌంటర్లను సిద్ధం చేయాలని తాము నిర్ణయించినట్టు రైల్వే బోర్డు అధికారులు పేర్కొన్నారు. కొత్త నిబంధనల కింద దేశవ్యాప్తంగా ఉన్న 14 లక్షల రిజర్వేషన్ కౌంటర్ల వద్ద భారత్ క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ఫ్రైట్ బుకింగ్స్‌లో కూడా ఇదే విధమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు, ఇప్పటికే 90శాతం ఫ్రైట్ పేమెంట్లు నగదు రహితంగా జరుగుతున్నాయన్నారు. భారత రైల్వే రూ.52వేల కోట్ల విలువైన ప్రయాణికుల టిక్కెట్లను విక్రయిస్తోంది. దీనిలో 60 శాతం ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ ద్వారా జరిగితే, మిగతావి రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ఎక్కువగా నగదు రూపంలో జరుగుతున్నాయి. ఇలా ఒక్క రైల్వేలోనే కాక, బస్సు, మెట్రో టిక్కెట్ కౌంటర్లు, పాస్‌పోర్టు ఆఫీసులు వంటి అన్ని ప్రభుత్వ-ప్రజా సంబంధిత ఆఫీసుల్లో భారత్ క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్లను స్వీకరించాలని ప్రభుత్వం చూస్తోంది. -
‘భారత్ క్యూఆర్’ ఆవిష్కరణ
• రిటైల్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ మరింత సరళం • అమలుకు 15 బ్యాంకులు సిద్ధం న్యూఢిల్లీ: క్యాస్‌లెస్ ఎకానమీ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రపంచపు తొలి ఇంటర్‌పోర్టబుల్ పేమెంట్ యాక్సప్టెన్సీ సొల్యూషన్ ‘భారత్‌క్యూఆర్ కోడ్’ను ఆవిష్కరించింది. దీంతో రిటైల్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ మరింత సులభతరం కానున్నాయి. ‘భారత్‌క్యూఆర్ కోడ్’ విధానంలో వ్యాపారుల ఐడీ, ఫోన్ నెంబర్ వంటివి అవసరం లేకుండానే లావాదేవీలు నిర్వహించవచ్చు. వ్యాపారులు కేవలం ఒక క్యూఆర్ కోడ్‌ను మాత్రమే కలిగి ఉంటారు. కస్టమర్లు ఆ కోడ్‌ను స్కాన్ చేసి అమౌంట్‌ను ఎంటర్ చేసి పేమెంట్ చేసేయొచ్చు. ఇక్కడ డబ్బులు డైరెక్ట్‌గా మర్చంట్ బ్యాంక్ ఖాతాకు చేరిపోతాయి. స్వైపింగ్ మెసీన్లతో పనిలేదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), మాస్టర్‌కార్డ్, వీసాలు భారత్‌క్యూఆర్ కోడ్‌ను అభివృద్ధి చేశాయి. దాదాపు 15 బ్యాంకులు భారత్‌క్యూఆర్ కోడ్ అమలుకు సిద్ధంగా ఉన్నాయి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ ఈ భారత్‌క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. క్యూఆర్ కోడ్ అంటే? క్యూఆర్ కోడ్‌నే క్విక్ రెస్పాన్స్ కోడ్ అని పిలుస్తారు. ఇది ఒక టు–డైమెన్షనల్ మెషీన్ రీడబుల్ కోడ్. ఇందులో నలుపు, తెలుపు గీతలు ఒక చతురస్రం లో నిక్షిప్తమై ఉంటాయి. ఇందులో యూఆర్ఎల్, ప్రొడక్ట్ వివరాలు పొందుపరుస్తారు. స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా వీటిని యాక్సెస్ చేయొచ్చు. దీన్ని ఎలా వాడాలి? భారత్‌క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించాలని భావించే వారు స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండాలి. వీరు సంబంధిత బ్యాంక్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. చాలా బ్యాంకులు లెక్కకు మించి యాప్స్‌ను కలిగి ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒకటి మాత్రమే క్యూఆర్ కోడ్‌ను సపోర్ట్ చేస్తుంది. దాన్నే డౌన్లోడ్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలోనే పనిచేస్తుంది. ‘కార్డు నెట్‌వర్క్స్‌లో రూపే బాగా విజయవంతమయ్యింది. ఇప్పుడు భారత్‌క్యూఆర్ కోడ్ కూడా ఆ దారిలోనే పయనిస్తుంది’ అని ఎన్పీసీఐ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఏపీ హోతా తెలిపారు. తాము ఇప్పటికే మాస్టర్పాస్ క్యూఆర్’ను అభివృద్ధి చేశామని, ఇకపై ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మాస్టర్‌కార్డ్ కంట్రీ కార్పొరేట్ ఆఫీసర్ (ఇండియా), డివిజన్ ప్రెసిడెంట్ (దక్షిణాసియా) పొరుష్ సింగ్ తెలిపారు. -
గ్రామీణ టెలికం యూజర్లకు ఫ్రీ డేటా!
ఉచితంగా అందించాలని కేంద్రానికి ట్రాయ్ ప్రతిపాదన న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వపు క్యాష్‌లెస్ ఎకానమీకి మద్దతుగా గ్రామీణ సబ్స్క్రైబర్లకు నెల ప్రాతిపదికన ఉచితంగా కొంత డేటాను అందించాలని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ ప్రతిపాదించింది. దీని కోసం ఒక పథకాన్నిఏర్పాటు చేసి, దీని అమలుకు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) నుంచి నిధులివ్వాలని ప్రభుత్వానికి సూచించింది. ‘ఉచిత డేటాను అందించాలనుకునే కంపెనీలు.. టెలికం శాఖ వద్ద రిజిస్ట్రేషన్చేసుకోవాలి. ఇవి ఇండియన్ కంపెనీస్ యాక్ట్, 1956 కింద రిజిస్టర్ అయ్యిండాలి. ఇక రిజిస్ట్రేషన్ వాలిడిటీ ఐదేళ్లు ఉంటుంది. ఒక కంపెనీ తన రిజిస్ట్రేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరేఇతర సంస్థలకు బదిలీ చేయకూడదు’ అని పేర్కొంది. డిజిటల్ చార్జీలు తగ్గించాలి: శర్మ డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహానికి ట్రాన్సాక్షన్ (లావాదేవీల) చార్జీలను తక్కువగా ఉండేలా చూడాలని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్. శర్మ సూచించారు. డిజిటల్ లావాదేవీలు విస్తృతం కావడానికి... వ్యయం, సౌకర్యం,నమ్మకం ఈ 3 అంశాలు ప్రధానమన్నారు. -
నగదు రహిత వ్యవస్ధ:మోదీ ముందున్న సవాళ్లు
అధిక విలువ కలిగిన నోట్ల రద్దు తర్వాత తన తర్వాతి అడుగును ఏంటనే విషయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెల 27వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని ఖుషీనగర్ ఎన్నికల ర్యాలీలో బయటపెట్టారు. అదే నగదు రహిత లావాదేవీల ఆర్ధిక వ్యవస్ధ. నగదు రహిత లావాదేవీలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ మిగిలిన వారికి ఆ విషయాన్ని బోధించాలని కోరారు. అదే రోజున జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా డిజిటల్ ఆర్ధిక వ్యవస్ధ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని సూచించారు. మీ బ్యాంకు అకౌంట్లు, ఇంటర్ నెట్ బ్యాంకింగ్, బ్యాంకు యాప్ లను ఎలా వినియోగించాలో నేర్చుకోవాలన్నారు. నగదు రహిత వ్యాపారాలను ఎలా నడపాలో, కార్డుల ద్వారా, ఎలక్ట్రానిక్ పేమెంట్స్ ద్వారా ఎలా నగదు లావాదేవీలో జరపాలో తెలుసుకోవాలని కోరారు. షాపింగ్ మాల్స్ లో ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందో నిశితంగా గమనించాలని సూచించారు. మోదీ కేబినేట్ మంత్రులు కూడా నగదు రహిత లావాదేవీలపై విస్తృత అవగాహన ఏర్పరించేందుకు ప్రయత్నిస్తుండటం భారతదేశాన్ని నగదు రహిత ఆర్ధిక వ్యవస్ధగా తీర్చిదిద్దటానికి మోదీ నడుబిగించినట్లు అర్ధమవుతుంది. అంతర్జాల వినియోగంలో భారతీయులు అమెరికాను దాటేసినా.. స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ ను వినియోగించే సామర్ధ్యం చాలా తక్కువ మందికే తెలుసు. దీంతో డెబిట్, క్రెడిట్ కార్డులు, కార్డు స్వైప్ మిషన్లు, డిజిటల్ వాలెట్ల వినియోగం లాంటి వాటిపై సగటు దేశపౌరుడికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దేశంలో 68శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్నాయని బిజినెస్ స్టాండర్డ్ చేసిన ఓ సర్వేలో తేలింది. కాగా, మిగిలిన సర్వేలన్నీ 90 శాతం లావాదేవీలు నగదు రూపంలో జరుగుతున్నాయని చెప్పాయి. ఇన్ని ప్రతికూలతల నడుమ మోదీ కలలుగంటున్న నగదు రహిత ఆర్ధిక వ్యవస్ధ సాధ్యం అవుతుందా?. భారత ఆర్ధిక వ్యవస్ధను నగదు రహితంగా మార్చడానికి ఆయన పెనుసవాళ్లును ఓ సారి చూద్దాం. మోదీ ముందున్న ఐదు సవాళ్లు: 1. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఇంటర్నెట్ వినియోగంలో భారత్ అమెరికాను దాటేసినట్లు టెలికాం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) పేర్కొంది. ప్రపంచం మొత్తంలో 342మిలియన్ల అంతర్జాల వినియోగదారుల్లో 27శాతం మంది భారతీయులే ఉన్నారని చెప్పింది. అయితే, కేవలం అతికొద్ది మంది దేశజనాభా మాత్రమే ఇంటర్నెట్ వినియోగిస్తుండటం మోదీ ఆలోచనకు ఎదురొచ్చే తొలి అడ్డంకి. భారత పట్టణాల్లో కూడా 58శాతం మందే ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారు. దేశ జనాభాలో 73 శాతం మందికి ఇంటర్నెట్ సదుపాయం లేదు. ఈ విషయంలో నైజీరియా, కెన్యా, ఘనా, ఇండోనేసియా దేశాలు భారత్ కంటే ముందున్నాయి. 2. స్మార్ట్ ఫోన్: మోదీ కలలుగంటున్న డిజిటల్ బ్యాంకింగ్ విజయం సాధించాలంటే స్మార్ట్ ఫోన్ల వినియోగం గణనీయంగా పెరగాలి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం అంచెలంచెలుగా ఎదుగుతున్నా.. భారత్ లో సగటున కేవలం 17 శాతం మంది యువత మాత్రమే స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారని ప్యూ అనే పరిశోధనా సంస్ధ చేసిన సర్వేలో వెల్లడైంది. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల్లో కేవలం 7 శాతం మంది యువత మాత్రమే స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తుండగా, 22 శాతం మంది సంపన్న కుటుంబాలకు చెందిన యువత స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. 3. దేశంలో 1.02 బిలియన్ల వైర్ లెస్ ఇంటర్నెట్ వినియోగదారులు, కేవలం 15శాతం(154మిలియన్లు) బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు ఉన్నట్లు 2016లో ట్రాయ్ ఓ రిపోర్టులో పేర్కొంది. 4. వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయంలో కూడా భారత్ వెనకంజలో ఉంది. సగటున ఓ మొబైల్ ఫోన్ పేజీ లోడ్ కావడానికి భారత్ లో 5.5సెకన్ల సమయం పడుతోంది. ఇదే చైనాలో 2.6 సెకన్లు, శ్రీలంకలో 4.5 సెకన్లు, బంగ్లాదేశ్ లో 4.9 సెకన్లు, పాకిస్తాన్ లో 5.8 సెకన్లుగా ఉందని గ్లోబల్ కంటెంట్ డెలివరీ నెట్ వర్క్ సర్వీసెస్ ప్రొవైడర్ పేర్కొంది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన పేజ్ లోడ్ ఇజ్రాయెల్ లో ఉంది. అక్కడి ఇంటర్నెట్ వినియోగదారుడికి ఒక పేజి 1.3సెకన్లలో లోడ్ అవుతోంది. మొబైళ్లలో ఇంటర్నెట్ పేజీలు వేగంగా లోడ్ కాకపోతే ఆన్ లైన్ లావాదేవీలు జరపడం కష్టతరమౌతుంది. ఇప్పటికే దేశంలో 68శాతం మంది ఇంటర్నెట్ వేగంపై పెదవి విరుస్తున్నారు. 5. పది లక్షల మంది పౌరులకు కేవలం 856 పీఎస్ వో(కార్డు స్వైపింగ్) మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఆగష్టుకు 14లక్షల 60వేల పీఎస్ వో మిషన్లు దేశం మొత్తం మీద ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. భారత జనాభా కంటే 84శాతం తక్కువ జనాభా కలిగిన బ్రెజిల్ తన జనాభాకు 39రెట్లు పీఎస్ వో మిషన్లు ఉన్నట్లు 2015లో చెప్పింది. అదే రష్యా, చైనాల్లో ప్రతి పదిలక్షల మంది పౌరులకు 4వేల పీఎస్ వో మిషన్లు ఉన్నాయి. భారత్ లో అందుబాటులో ఉన్న 70శాతం పీఎస్ వో మిషన్లు కూడా 15 పెద్ద నగరాలకే పరిమితం అయ్యాయి. నోట్ల రద్దు వల్ల ఈ నగరాల్లో పెద్దగా ఇబ్బందులు కూడా కనిపించలేదు. మెట్రో నగరాలకే కాకుండా పట్టణాలు, గ్రామాలకు కూడా పీఎస్ వోలను విస్తరించగలిగితేనే మోదీ కల సాధ్యమవుతుంది. ఇప్పటికే పీఎస్ వోల తయారీల కంపెనీలపై భారత ప్రభుత్వం 12 శాతం ఎక్సైజ్ సుంకాన్ని, 4 శాతం ప్రత్యేక ఎక్సైజ్ పన్నును రద్దు చేసింది. వచ్చే ఏడాది మార్చి కల్ల 10 లక్షల కొత్త పీఎస్ వో లు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. -
మోదీ ‘మిషన్’ కోసం 24 లక్షల మంది
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికే మద్దతు తెలిపిన విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఇప్పుడు నగదు రహిత మిషన్‌కు కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. అంతేకాదు స్వయంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను కూడా తలకెత్తుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం అద్భుత నిర్ణయాలు తీసుకుంటుందని, నగదు రహిత దేశం బాగుంటుందని, ఇందుకోసం తమ వంతుకు ప్రభుత్వానికి సహాయం చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించాయి. తమ సంస్థలకు మొత్తం 24లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, వీరందరిచే దేశమంతటా నగదు రహిత ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహన కల్పించే కార్యక్రమం చేపడతామన్నాయి. ‘నగదు రహిత ఉద్యమం కోసం బజరంగ్ దళ్ త్వరలో 24 లక్షల మందితో మిషన్ ప్రారంభిస్తుంది. ఒక్కొక్కరు పది మందిని కలిసి వారికి ఈ విషయంపై అవగాహన కల్పిస్తారు. దాని వల్ల పొందే ప్రతిఫలాలు కూడా వివరిస్తాయి’ అని విశ్వహిందు పరిషత్ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ చెప్పారు. ప్రజలంతా డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి భయపడుతున్నారని, అపోహలన్నీ తొలగించే బాధ్యతలు తీసుకుంటామన్నారు. గురుదక్షిణ కూడా డిజిటల్ రూపంలోనే ఇస్తున్నారని, దీనివల్ల ఎలాంటి నష్టం ఉంటుందని వారు ప్రశ్నించారు. ప్రతి ఒక్కరిలో ఓ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్, బ్యాంకు ఖాతా ఉంటే అంతా తేలికైపోతుందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దును విజయవంతం చేయడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజల బాధ్యత కూడా అని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.