
ముంబై: ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలతో పోలిస్తే ప్రైవేట్ బీమా సంస్థలు గణనీయ స్థాయిలో వృద్ధి సాధిస్తున్నాయి. 2017–18లో 22 శాతం వృద్ధి నమోదు చేశాయి. అదే సమయంలో ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) సాధారణ బీమా సంస్థలు 13 శాతమే వృద్ధి సాధించాయి.
రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం సాధారణ బీమా రంగం 17 శాతం మేర వృద్ధి చెందింది. ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల మార్కెట్ వాటా 53 శాతం నుంచి 55 శాతానికి పెరిగింది. హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంల ఊతంతో ప్రైవేట్ సంస్థలు రికవరీకి సారథ్యం వహిస్తున్నాయని ఇక్రా గ్రూప్ హెడ్ (ఫైనాన్షియల్ సెక్టార్ రేటింగ్స్ విభాగం) కార్తీక్ శ్రీనివాసన్ తెలిపారు.