పెట్రోల్ ఉత్పత్తి ధరకన్నా పన్నులే ఎక్కువ! | Higher taxes on petrol product price! | Sakshi
Sakshi News home page

పెట్రోల్ ఉత్పత్తి ధరకన్నా పన్నులే ఎక్కువ!

Published Tue, Nov 10 2015 1:31 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

పెట్రోల్ ఉత్పత్తి ధరకన్నా పన్నులే ఎక్కువ! - Sakshi

పెట్రోల్ ఉత్పత్తి ధరకన్నా పన్నులే ఎక్కువ!

ఢిల్లీలో లీటరు ధర రూ.60.70   డీలర్‌కు పడేది రూ.27.24
 
 న్యూఢిల్లీ: పెట్రోలు ఉత్పత్తి వాస్తవ వ్యయంకన్నా... పన్నులు, సుంకాలే అధికంగా ఉండడం- వినియోగదారుకు ఈ కమోడిటీ ధర చుక్కలు చూపిస్తోంది.  ఏడాది కాలంలో ఐదుసార్లు పెట్రోలుపై ఎక్సైజ్ సుంకాలను కేంద్రం పెంచింది. దీని కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు కనిష్ట స్థాయిల్లో కదలాడుతున్నా... ఈ ప్రయోజనం సాధారణ ప్రజలకు అందకుండా పోతోంది.  ఒక ఉన్నత స్థాయి అధికారి తెలిపిన వివరాల ప్రకారం...
 
 ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.60.70.  వినియోగదారుడి నుంచి వసూలు చేస్తున్న రూ. 60.70లో రూ. 31.20 పన్నులు, సుంకాలే. అక్టోబర్ ద్వితీయార్థంలో సగటు ప్రాతిపదికన పెట్రోల్ లీటరుకు రిఫైనరీల్లో ఉత్పత్తి చేయడానికి రూ.24.75 ఖర్చయ్యింది. కంపెనీ లాభం, ఇతర వ్యయాలు కలుపుకుంటే... పెట్రోల్ పంప్ డీలర్‌కు లీటర్ ధర రూ.27.24 పడింది. ఈ ధరకు కేంద్రం వసూలు చేసిన ఎక్సైజ్ సుంకం రూ.19.06 దీనికి కలుపుకోవాల్సి ఉంటుంది. డీలర్ కమిషన్ రూ.2.26. వ్యాలూ యాడెడ్ ట్యాక్స్ లేదా అమ్మకం పన్ను వాటా రూ.12.14. వెరసి ఢిల్లీలో ధర లీటరుకు రూ.60.70కి చేరుతోంది. ఇక డీజిల్ విషయానికి వస్తే.. ఢిల్లీలో లీటరుకు రూ.45.93. అయితే రిఫైనరీలో ఉత్పత్తి వ్యయం రూ.24.86. లాభాల మార్జిన్లు, రిటైల్ పెట్రోల్ పంప్స్‌కు కంపెనీ రవాణా వ్యయాలను కలుపుకుంటే... ఈ వ్యయం రూ.27.05కు చేరుతోంది. అయితే ఎక్సైజ్ సుంకం రూ.10.66. డీలర్ కమిషన్ రూ.1.43. వ్యాట్ రూ.6.79. వెరసి వినియోగదారుని వరకూ వచ్చే సరికి విలువ రూ.45.93కు చేరుతోంది.
 
 ఇంకా పెరగాల్సిందే... కానీ

 నవంబర్ 7న ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 1.60 పెంచింది. డీజిల్‌కు సంబంధించి ఈ ధర 40 పైసలు పెరిగింది. అయితే ఆయిల్ కంపెనీలు ఈ పెంపును వినియోగదారులకు బదలాయించలేదు. కంపెనీల నిర్ణయం మరొకలాగా ఉంటే... వినియోగదారుపై మరింత భారం తప్పేది కాదు.


 8 వారాల కనిష్టానికి రూపాయి
 డాలర్‌తో పోలిస్తే 68 పైసలు డౌన్  66.44 వద్ద క్లోజింగ్
 ముంబై: బ్యాంకులు, దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు డిమాండ్ కొనసాగడంతో రూపాయి మారకం విలువ ఏకంగా 8 వారాల కనిష్టానికి పడిపోయింది. సోమవారం డాలర్‌తో పోలిస్తే 68 పైసలు క్షీణించి 66.44 వద్ద క్లోజయ్యింది. సెప్టెంబర్ 16నాటి 66.46 క్లోజింగ్ తర్వాత ఈ స్థాయికి రూపాయి క్షీణించడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం మూడు ట్రేడింగ్ రోజుల్లో దేశీ కరెన్సీ విలువ 95 పైసల మేర (దాదాపు 1.44%) పతనమైనట్లయింది. అమెరికాలో ఉద్యోగాల గణాంకాలు మెరుగుపడటం వల్ల అక్కడ వడ్డీ రేట్లు పెరగొచ్చన్న అంచనాల నడుమ డాలరు విలువ గణనీయంగా పెరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement