అంచనాలను మించిన హిందాల్కో ఫలితాలు
ఐదు రెట్లు పెరిగిన నికర లాభం
న్యూఢిల్లీ: అల్యూమినియం తయారు చేసే హిందాల్కో కంపెనీ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం క్షీణించినా, అధిక పన్ను వ్యయాలు ఉన్నప్పటికీ, నికర లాభం(స్టాండోలోన్) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో ఐదు రెట్లు పెరిగింది. గత క్యూ1లో రూ. 61 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ. 294 కోట్లకు పెరిగిందని హిందాల్కో తెలిపింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ.8,667 కోట్ల నుంచి 11 శాతం తగ్గి రూ. 7,717 కోట్లకు పడిపోయిందని వివరించింది. మొత్తం వ్యయాలు రూ.7,993 కోట్ల నుంచి రూ.6,704 కోట్లకు తగ్గాయని తెలిపింది.
నిర్వహణ లాభం 35శాతం వృద్ధితో రూ. 1,232 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇంధనం ధరలు తగ్గడం కలసివచ్చిందని, నిర్వహణ పనితీరు వల్ల నికర లాభం పెరిగిందని, అయితే రియలైజేషన్లు భారీగా పడిపోవడంతో ఆదాయం తగ్గిందని వివరించింది. ముడి పదార్ధాల ధరలు ముఖ్యంగా ఇంధన ధరలు తగ్గడం ఈ క్యూ1లో ఊరటనిచ్చిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో బీఎస్‌ఈలో హిందాల్కో షేర్ 2.7 శాతం లాభపడి రూ.146.2 వద్ద ముగిసింది.