హిందూస్తాన్ జింక్ లాభం 5 శాతం అప్
న్యూఢిల్లీ: హిందూస్తాన్ జింక్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.2,285 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ నికర లాభం(రూ.2,184 కోట్లు)తో పోల్చితే 5 శాతం వృద్ధి సాధించామని హిందూస్తాన్ జింక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,802 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.4,033 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అమ్మకాల వృద్ధి, నిర్వహణ సామర్థ్యం, వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా మంచి ఫలితాలను సాధించామని హిందూస్తాన్ జింక్ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ పేర్కొన్నారు.
జింక్ ధరలు తగ్గినప్పటికీ, అమ్మకాలు పెరగడం, రూపాయి క్షీణత వంటి కారణాల వల్ల ఆదాయం పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి నగదు, నగదు సమాన నిల్వలు రూ.34,568 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. వీట్లి మ్యూచువల్ పండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.25,310 కోట్లని, రూ.5,530 కోట్లు బాండ్లలో, రూ.3,505 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉన్నాయని వివరించింది.
ఈ కంపెనీలో భారత ప్రభుత్వానికి 29.5 శాతం వాటా ఉండగా, మిగిలింది సెసా స్టెరిలైట్‌కు ఉంది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్ 3 శాతం లాభంతో రూ.158 వద్ద ముగిసింది.