ఉద్యోగాలు పెరుగుతున్నాయ్!
మార్చిలో 22% వృద్ధి: నౌకరీ.కామ్
న్యూఢిల్లీ: ఐటీ సాఫ్ట్‌వేర్, ఐటీఈఎస్, టెలికాం, బీమా రంగాల దన్నుతో ఈ మార్చిలో ఉద్యోగ నియామకాల్లో 22 శాతం వృద్ధి నమోదైనట్లు జాబ్ పోర్టల్ ‘నౌకరీ డాట్‌కామ్’ తెలియజేసింది. ఈ ధోరణి మున్ముందు కొనసాగుతుందని కూడా నౌకరీ పేర్కొంది. నౌకరీ జాబ్ స్పీక్ సూచీ... గతేడాదితో పోలిస్తే ఈ మార్చిలో 1968కి చేరి 22 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఫిబ్రవరిలో ఈ వృద్ధి 18 శాతంగా ఉంది. ఈ ఏడాది ఉద్యోగార్థులకు మంచిరోజులు వచ్చినట్లే కనిపిస్తోందని ఈ సందర్భంగా నౌకరీ ప్రధాన సేల్స్ అధికారి వి.సురేశ్ చెప్పారు.
గతేడాది మార్చితో పోలిస్తే ఈ మార్చిలో ఐటీ రంగంలో నిపుణులకు డిమాండ్ 25 శాతం పెరగ్గా... ఐటీఈఎస్‌లో ఇది 48 శాతంగా ఉందని, సేల్స్-బిజినెస్ డెవలప్‌మెంట్ నిపుణులకు కూడా డిమాండ్ బాగా పెరిగిందని ఆయన తెలియజేశారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే ఉద్యోగాల వృద్ధిలో 50 శాతంతో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవగా ముంబై(45 శాతం), చె న్నై(43) తరువాతి స్థానాల్లో నిలిచాయి.