గృహోపకరణాల మార్కెట్లోకి రాక్‌వెల్
♦ 2016లో మార్కెట్లోకి రిఫ్రిజిరేటర్
♦ రాక్‌వెల్ ఎండీ అశోక్ కుమార్ గుప్తా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వాణిజ్య అవసరాలకు కూలర్లు, ఫ్రీజర్లను తయారు చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన రాక్‌వెల్ ఇండస్ట్రీస్ గృహోపకరణాల వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఇళ్లలో వినియోగించే రిఫ్రిజిరేటర్ల తయారీలోకి అడుగుపెట్టాలని ఈ సంస్థ నిర్ణయించింది. 2016లో రిఫ్రిజిరేటర్‌ను మార్కెట్లోకి తీసుకు వస్తామని రాక్‌వెల్ ఎండీ అశోక్ కుమార్ గుప్తా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘శీతలీకరణ ఉపకరణాల తయారీలో దేశంలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాం. కోకకోలా, రిలయన్స్, అమూల్, మదర్ డెయిరీ, కేఎంఎఫ్, క్రీమ్‌బెల్, దిన్‌షాస్ వంటి ప్రముఖ సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయి. ఇప్పుడు ఇదే అనుభవంతో గృహ విభాగంలో విజయవంతం అవుతాం’ అని పేర్కొన్నారు. ఇప్పటికే కంపెనీ వాటర్ కూలర్లను సైతం తయారు చేస్తోంది. పాడి రైతుల కోసం తక్కువ ధరలో మిల్క్ చిల్లర్‌ను3 నెలల్లో ప్రవేశపెట్టనుంది.
2018 నాటికి తొలి స్థానం..
వాణిజ్య శీతలీకరణ ఉపకరణాల మార్కెట్లో 2018 నాటికి తొలి స్థానం లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. పరిశ్రమ పరిమాణం ప్రస్తుతం 25 శాతం వృద్ధితో ఏటా 5 లక్షల యూనిట్లుందని తెలిపారు. కంపెనీ ఏటా 60,000 యూనిట్లు విక్రయిస్తోందని అన్నారు.ఇక ఇప్పటికే పరిశోధన, అభివృద్ధికి రూ.3 కోట్లు వెచ్చించామని వివరించారు. సంస్థ విద్యుత్ ఖర్చులేని సోలార్‌తో (సౌర శక్తి) పనిచేసే కూలర్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే.