
సాక్షి, న్యూఢిల్లీ: నగదు లావాదేవీలకోసం గూగుల్ పే యాప్‌వాడుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అధికారిక ధృవీకరణ లేకుండానే గూగుల్ పే యాప్ కార్యకలాపాలను సాగిస్తోందట. కేంద్ర బ్యాంకు అనుమతి లేకుండా యధేచ్చగా అక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందా? తాజా పరిణామం ఈ సందేహాలనే రేకెత్తిస్తోంది. గూగుల్ పే పై దాఖలైన పిటీషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, గూగుల్ సంస్థలకు నోటీసులు జారీచేసింది. ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకుండానే గూగుల్ యాప్ కార్యకలాపాలు ఎలా సాగిస్తోందని కోర్టు ప్రధానంగా ఆర్‌బీఐని ప్రశ్నించింది. దీనిపై తమ స్పందన తెలియజేయాలని ఆర్‌బీఐ, గూగుల్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్, జస్టిస్ ఎ.జె. భంభాని నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది.
డిమానిటైజేషన్ తరువాత డిజిటల్ లావాదేవీలకు పెరిగిన ప్రాధాన్యత నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ యాప్‌లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ కోవలోదే గూగుల్‌కు చెందిన మొబైల్ పే మెంట్ యాప్ గూగుల్ పే. అయితే గూగుల్ పే యాప్ పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్స్ చట్టాన్ని ఉల్లంఘించిందని, నగదు బదిలీకి సంబంధించి ఈ యాప్‌కు కేంద్ర బ్యాంకు నుంచి సరైన ధ్రువీకరణ లేదంటూ అభిజిత్ మిశ్రా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ ఏడాది మార్చి 20న ఆర్‌బీఐ విడుదల చేసిన అధికారిక పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ జాబితాలో గూగుల్ పే పేరు లేదని కూడా ఆయన పేర్కొన్నారు. మిశ్రా పిటిషన్‌పై దర్యాప్తు చేపట్టిన న్యాయస్థానం బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment