స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఎంత ఇన్వెస్ట్‌ చేయాలి? | How much to invest in smallcap funds? | Sakshi
Sakshi News home page

స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఎంత ఇన్వెస్ట్‌ చేయాలి?

Published Sun, Aug 27 2017 11:46 PM | Last Updated on Sun, Sep 17 2017 6:01 PM

స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఎంత ఇన్వెస్ట్‌ చేయాలి?

స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఎంత ఇన్వెస్ట్‌ చేయాలి?

నేను మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. కనీసం ఐదు నుంచి ఏడేళ్లు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ధీమాటిక్‌ ఫండ్‌ను ఎంచుకోవాలా లేక స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోవాలా ? దేంట్లో రిస్క్‌ తక్కువగా ఉంటుంది?                
–జగదీశ్, విజయవాడ

థీమాటిక్, స్మాల్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ రెండూ వేర్వేరు. థీమాటిక్‌ ఫండ్స్‌ ఒక ప్రత్యేకమైన థీమ్‌కు సంబంధించినవి. అన్నీ అనుకున్నట్లుగా, సవ్యంగా జరిగితే ఈ థీమాటిక్‌ ఫండ్స్‌ మంచి రాబడులనిస్తాయి. కానీ ఇది జూదం లాంటిదే. అంచనాలు తప్పినా, లేకపోతే, సరైన సమయంలో థీమాటిక్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయకపోయినా మీకు భారీగా నష్టాలు వస్తాయి. సాధారణంగా ఇన్వెస్టర్లు ఇప్పటికే బాగా పెరిగిన రంగాల్లో ఇన్వెస్ట్‌ చేయడానికే ఇష్టపడతారు. భవిష్యత్తులో బాగా పెరిగే అవకాశాలున్న రంగాల్లో ఇన్వెస్ట్‌ చేసే అవకాశాలు సాధారణ ఇన్వెస్టర్లకు చాలా తక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో మంచి రాబడులనిచ్చే ధీమాటిక్‌ ఫండ్స్‌ను ఇప్పుడే గుర్తించడం చాలా కష్టం. స్మాల్‌క్యాప్‌ కంపెనీలు మూలధన పరంగా చిన్న సైజువి. కానీ లార్జ్‌క్యాప్‌కంపెనీల కంటే వేగంగా వృద్ధి చెందగల సత్తా వాటికి ఉంటుంది. అందుకని మీ పోర్ట్‌ఫోలియోలో 20–30% వరకూ ఖచ్చితంగా స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. సాధారణంగా స్మాల్‌క్యాప్‌ కంపెనీలు ఆర్థిక మందగమనం, ప్రభుత్వ విధానాలు, పోటీ, తదితర అంశాల పరంగా చూస్తే తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయి. అందుకని ఏ స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలి అనేది మీ ఫండ్‌మనేజర్‌కు వదిలేయండి. స్మాల్‌ క్యాప్‌కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్న డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మీరు మంచి రాబడులు పొందవచ్చు.

నేను 2012లో ఎల్‌ఐసీ జీవన్‌ మిత్ర పాలసీ తీసుకున్నాను. ఈ పాలసీ కాలపరిమితి 30 సంవత్సరాలు. వార్షిక ప్రీమియమ్‌ రూ.47,950. ఈ పాలసీని పెయిడప్‌–పాలసీగా మార్చుకోమంటారా ? లేక ఈ పాలసీలో కొనసాగమంటారా ?                
–రాజేశ్, విశాఖపట్టణం  

‘ఎల్‌ఐసీ జీవన్‌ మిత్ర’ ఎండోమెంట్‌ ప్లాన్‌. ఇది ఇన్సూరెన్స్‌–కమ్‌–ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌. ఇవి ఖరీదైనవి. పైగా తగిన తగిన బీమా కవరేజ్‌ను ఇవ్వలేవు. రాబడులూ అంతంత మాత్రమే. ఈ పాలసీని పెయిడప్‌ పాలసీగా మార్చుకుంటే, మీ పాలసీ కాలపరిమితి  పూర్తయ్యేవరకూ మీ సొమ్మును తీసుకోలేరు. దీనికి బదులు మీరు ఈ ప్లాన్‌ను సరెండర్‌ చేయండి. దీనివల్ల మీకు నష్టాలు వస్తాయి. కానీ మంచి రాబడులు రాని ఇన్వెస్ట్‌మెంట్‌ నుంచి మీరు బైటపడినట్లవుతుంది. ఈ ప్లాన్‌ను సరెండర్‌ చేస్తే, మీకు కొంత మొత్తం  గ్యారంటీడ్‌ సరెండర్‌ వేల్యూగా లభిస్తుంది. ఎల్‌ఐసీ స్పెషల్‌ సరెండర్‌ వేల్యూను చెల్లించవచ్చు. ఇది గ్యారంటీడ్‌ సరెండర్‌ వేల్యూతో సమానంగా లేదంటే, దానికంటే అధికంగానే ఉండొచ్చు. ఇక ఈ పాలసీని పెయిడప్‌ పాలసీగా మార్చుకుంటే పెయిడప్‌ వేల్యూ ఎంత వస్తుందనేది మీరు ఎల్‌ఐసీ కార్యాలయంలో సంప్రదించి తెలుసుకోగలరు. పాలసీ కాలపరిమితి తీరిన తర్వాతనే మీకు పెయిడప్‌ వేల్యూ లభిస్తుంది. బీమా, ఇన్వెస్ట్‌మెంట్‌ కలగలసిన ఈ తరహా ప్లాన్‌ల్లో ఎప్పుడూ ఇన్వెస్ట్‌ చేయకూడదు. బీమా కవరేజ్‌ కోసం ప్యూర్‌ టర్మ్‌ పాలసీ తీసుకోవాలి. ఈ టర్మ్‌ పాలసీల్లో బీమా కవరేజ్‌ అధికంగానూ, చెల్లించాల్సిన ప్రీమియమ్‌లు తక్కువగానూ ఉంటాయి. ఇక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఏదైనా బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ లేదా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి. ఇలా చేస్తే ద్రవ్యోల్బణాన్ని తట్టుకోగలిగే రాబడులు మీకు వస్తాయి.  

నా వయస్సు 53. నేను 65  ఏళ్ల వరకూ పనిచేయగలను. పెన్షన్‌ నిధిగా రూ.50 లక్షల వరకూ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. నెలకు రూ.40,000–50,000 వరకూ సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేయగలను. తగిన ఇన్వెస్ట్‌మెంట్‌ విధానాన్ని సూచించండి.   
–జాఫర్, హైదరాబాద్‌  

మీ అత్యవసర ఖర్చులకు అవసరమైన మొత్తాన్ని మాత్రమే స్థిరాదాయ సాధానాల్లో ఉంచుకోవాలి. స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌పై వచ్చే వడ్డీలపై పూర్తిగా పన్ను భారం(టీడీఎస్‌) ఉంటుంది. అందుకని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్‌లోకి మార్చుకోండి. ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల కొన్ని పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. మీరు మరో 12 ఏళ్ల పాటు పనిచేయగలుగుతారు. అంటే మీరు దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయవచ్చని అర్థం. మీ అత్యవసర ఖర్చులకు కొంత మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ లేదా బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఉన్న మొత్తాన్ని ఈ బ్యాలన్స్‌డ్‌లేదా ఈక్విటీ ఫండ్స్‌లోకి రెండేళ్లలో బదిలీ చేయండి. రెండేళ్లపాటు ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్, ఈక్విటీ ఫండ్స్‌ల నుంచి వచ్చే రాబడులు స్వల్పంగా ఉండొచ్చు. కానీ దీర్ఘకాలంలో ఈక్విటీ ఫండ్స్‌తో వచ్చే రాబడులు అధికంగా ఉంటాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement