
హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతుండాలి?
ఫైనాన్షియల్ బేసిక్స్...
ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. మారుతున్న జీవనశైలి, పని వేళలు, కాలుష్యం తదితర అంశాల వల్ల కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. అనారోగ్యం సంభవించినప్పుడు దానికయ్యే ఖర్చుల నుంచి రక్షణ పొందటానికి ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా తీసుకోవడం తప్పనిసరి. అత్యవసర పరిస్థితుల్లో ఈ పాలసీలు మనకు ఆర్థికంగా బాసటగా నిలుస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటపుడు మన మదిలో మెదిలే తొలి ప్రశ్న.. ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి? దీనికి సమాధానం ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు. సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీని రూ.10 లక్షలకు తీసుకుంటే మంచిది.
వార్షిక ఆదాయానికి సమాన మొత్తంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు. కెరీర్ ప్రారంభమైన తొలినాళ్లలో వ్యక్తిగత పాలసీ తీసుకోండి. అటుపై పెళ్లైన తర్వాత ఇద్దరికీ గానూ ఫ్లోటర్ పాలసీని తీసుకోవడం మంచిది. ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల బీమా కంపెనీలు పలు రకాల ఆరోగ్య బీమా పాలసీలను అందిస్తున్నాయి. మీ అవసరాలకు అనువైన ఒక పాలసీని ఎంపిక చేసుకోండి. పాలసీ ఎంపికలో బీమా కంపెనీ పనితీరు, సేవలు, పాలసీ వివరాలు, ప్రీమియం వంటి తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవడం మరువద్దు.