క్రెడిట్‌ రిపోర్ట్‌ కావాలంటే.. | How to get Credit Report | Sakshi
Sakshi News home page

క్రెడిట్‌ రిపోర్ట్‌ కావాలంటే..

Published Mon, May 8 2017 6:28 AM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM

క్రెడిట్‌ రిపోర్ట్‌ కావాలంటే..

క్రెడిట్‌ రిపోర్ట్‌ కావాలంటే..

► ఉచితంగానే అందిస్తున్న ఫిన్‌టెక్‌ కంపెనీలు 
► క్రెడిట్‌ బ్యూరోలిచ్చే రిపోర్టులకు ఇవి అదనం


ప్రస్తుతం ఏ రుణం తీసుకోవాలన్నా క్రెడిట్‌ స్కోరు కీలకపాత్ర పోషిస్తోంది. ఈ స్కోరు ఏమాత్రం తగ్గినా.. ఆ మేరకు రుణం మంజూరీ, వడ్డీ రేటు మొదలైన వాటన్నింటిపైనా ప్రభావం ఉంటోంది. అయితే, ఇప్పటిదాకా మన క్రెడిట్‌ స్కోరు వివరాలు అంత సులభంగా తెలిసేవి కావు. క్రెడిట్‌ బ్యూరోలకు డబ్బులు కడితేనో లేదా ఏదైనా రుణం కోసం అప్లై చేసుకున్నప్పుడు సదరు ఆర్థిక సంస్థ ద్వారానో స్కోరు తెలిసేది.

కానీ ఆర్‌బీఐ ఆదేశాలతో కొన్నాళ్ల క్రితం నుంచి సిబిల్‌ వంటి క్రెడిట్‌ బ్యూరోలు ఏటా ఒక్క రిపోర్టు ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టాయి. అయితే, నేరుగా వీటి దగ్గరకే వెళ్ల కుండా ఫైనాన్షియల్‌ టెక్నాలజీ (ఫిన్‌టెక్‌) సంస్థలు కూడా సందర్భాన్ని బట్టి క్రెడిట్‌ స్కోరు లేదా రిపోర్టు ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టాయి. క్రెడిట్‌ బ్యూరోల నుంచి తీసుకునే రిపోర్టుకు ఇది అదనం కావడం గమనార్హం.

సులభతరం...
బ్యూరోల వెబ్‌సైట్లతో పోలిస్తే ఫిన్‌టెక్‌ పోర్టల్స్‌ నుంచి రిపోర్టు పొందటం కొంత వరకూ సులభంగా ఉంటోంది. కొన్ని పోర్టల్స్‌ స్క్రీన్‌ మీదే స్కోరు లేదా రిపోర్టునిస్తుంటే.. మరికొన్ని ఈమెయిల్‌కి పంపిస్తున్నాయి. ఉదాహరణకు కొన్ని వివరాలు ఇస్తే బ్యాంక్‌బజార్‌ డాట్‌కామ్‌ .. క్రెడిట్‌ రిపోర్టును వెబ్‌సైట్‌లో చూపడంతో పాటు ఈమెయిల్‌ కూడా పంపిస్తోంది. ఇక పైసాబజార్‌.. నివేదికను వెబ్‌సైట్లోనే డిస్‌ప్లే చేస్తోంది. రెండు సైట్లు కూడా ఎక్స్‌పీరియన్‌ క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ అనే క్రెడిట్‌ బ్యూరో వివరాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి.

పైసాబజార్‌.. మీ నివేదికకు సంబంధించి ఇచితంగా నెలవారీ అప్‌డేట్‌ కూడా అందిస్తోంది. ఇక క్రెడిట్‌మంత్రి పోర్టల్‌.. స్కోరు ను వెబ్‌సైట్‌లో చూపిస్తుంది. కానీ పూర్తి నివేదిక కావా లంటే రూ. 199తో పాటు నిర్దేశిత పన్నులూ చెల్లిం చాలి. ఈ పోర్టల్‌ సంబంధిత వివరాలను ఈక్విఫ్యాక్స్‌ క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ నుంచి తీసుకుంటోంది. ఇండియాలెండ్స్‌ సంస్థ స్కోరును, సీఆర్‌ఐఎఫ్‌ హైమార్క్‌ను తమ వెబ్‌సైట్లో డిస్‌ప్లే చేస్తుంది. క్రెడిట్‌ బ్యూరోల్లో మన ఉచిత కోటాకు అదనంగానే ఫిన్‌టెక్‌ సంస్థలు ఇచ్చే ఉచిత రిపోర్టులు ఉంటాయి.

ఇంతకీ ఎందుకు ఉచితం...
సాధారణంగా క్రెడిట్‌ బ్యూరోలు తమ ఖాతాదారుల పరిమాణాన్ని పెంచుకునే క్రమంలో భాగంగా ఈ తరహా ఉచిత రిపోర్టులు ఇస్తున్నాయి. ఇలా ఫిన్‌టెక్‌ సంస్థలతో జట్టు కట్టడం వల్ల క్రెడిట్‌ రిపోర్టులపై అవగాహన పెంచడంతో పాటు మరింత మంది ఖాతాదారులకు చేరువ కావొచ్చన్నది వాటి వ్యూహం.

ఇక వినియోగదారుల దృష్టికోణం నుంచి కన్జూమర్స్‌కి తమ క్రెడిట్‌ నివేదికలు అందుబాటులోకి రావడంతో పాటు.. రుణం పొందడానికి మెరుగైన అవకాశాలను దక్కించుకునేందుకు ఏం చేయొచ్చన్నది తెలుసుకునేందుకు కూడా ఇది తోడ్పడగలదు. దరఖాస్తుదారు ఆర్థిక వివరాలు తెలియడం వల్ల వారికి అనువైన లోన్‌ అందేలా చూడటం ఫిన్‌టెక్‌ సంస్థలకు వీలవుతుంది. కస్టమర్‌కి లోన్‌ వస్తేనే వాటికీ ఆదాయం వస్తుంది కాబట్టి.. అవి ఆ దిశగా కసరత్తు చేస్తాయి.

క్రెడిట్‌ బ్యూరోలు నేరుగా కస్టమర్లతో కన్నా ఎక్కువగా వ్యాపార సంస్థలతోనే డీల్‌ చేస్తుంటాయి. వాటి క్లయింట్స్‌ బ్యాంకులు మొదలైన ఆర్థిక సంస్థలే ఉంటాయి. అందుకే వాటి నుంచి సాధారణ కస్టమర్‌ నివేదిక తీసుకోవాలంటే ప్రక్రియ కాస్త సంక్లిష్టంగా ఉంటుంది. అదే ఫిన్‌టెక్‌ సంస్థలైతే నిత్యం నేరుగా కస్టమర్లతోనే డీల్‌ చేస్తుంటాయి. కాబట్టి వారికి సర్వీసులను సులభతరంగా ఎలా అందించవచ్చన్న దానిపైనే దృష్టి పెడతాయి కనుక ఫిన్‌టెక్‌ సంస్థల నుంచి నివేదికలు పొందడం కొంత సులువుగా ఉంటుంది.

ఉచితంలో ఫ్రీ ఎంత...
ఉచితం అనేది పేరుకే కానీ.. ఏదీ పూర్తిగా ఉచితంగా ఉండదని తెలుసుకోవాలి. ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫాం విషయమే తీసుకుంటే.. మీకు సంబంధించిన కొన్ని వివరాలు ఇస్తేనే వాటì  నుంచి రిపోర్ట్‌ ఉచితంగా లభిస్తుంది. మీ పేరు, చిరునామా, పాన్‌ నంబరు వంటి సమాచారం అంతా ఇవ్వాలి. ఇక క్రెడిట్‌ బ్యూరోల ద్వారా అవి మీ క్రెడిట్‌ హిస్టరీని కూడా తెలుసుకుని.. మీకు అనువైన ఉత్పత్తులు.. పథకాలను విక్రయిం చేందుకు ఉపయోగించుకుంటూ ఉంటాయి. తద్వారా మీ వివరాలను అవి వ్యాపారప్రయోజనాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

కొంత అప్రమత్తత అవసరం...
ఆన్‌లైన్‌ సర్వీసులు కావొచ్చు.. ఇతరత్రా అప్లికేషన్స్‌ కావొచ్చు చాలా మంది షరతులు, నిబంధనలను పూర్తిగా చదవకుండానే వదిలేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదంటున్నారు నిపుణులు. ఏదో ఒకటి ఉచితంగా పొందేందుకు మీ ఆదాయాలు, పాన్‌ నంబరు మొదలైన కీలక వివరాలను థర్డ్‌ పార్టీలకు ఇచ్చేసి, మోసగాళ్ల బారిన పడకుండా కొంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే డేటా దుర్వినియోగం కాకుండా సురక్షితంగానే ఉంటుందనే భరోసా కలిగితే తప్ప థర్డ్‌ పార్టీలకు వివరాలు ఇచ్చేయొద్దని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement