హ్యుందాయ్ క్రెటాకు 10 వేల ముందస్తు బుకింగ్‌లు
- వచ్చే వారమే మార్కెట్లోకి...
న్యూఢిల్లీ: హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీకి 10 వేలకు పైగా ముందస్తు బుకింగ్‌లు వచ్చాయి. వచ్చే వారంలో(బహుశా జూలై 21) ఈ మాస్ మార్కెట్ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్‌ను మార్కెట్లోకి తేవాలని హ్యుందాయ్ మోటార్ ఇండియా యోచిస్తోంది. విడుదలకు ముందే 28,500కు పైగా ఎంక్వైరీలు వచ్చాయని, 10,000 బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్-మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు.
ఐదు సీట్ల ఈ ఎస్‌యూవీ అభివృద్ధి కోసం రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెట్టామని పేర్కొన్నారు. ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్, నిస్సానో టెర్రానో, మహీంద్రా స్కార్పియో, ఎక్స్‌యూవీ500, టాటా సఫారి స్టార్మ్ ఎస్‌యూవీలకు గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాలంటున్నాయి. వీటి ధరలు రూ.6.75 లక్షల నుంచి రూ.15.99 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. కాగా క్రెటా ఎస్‌యూవీ ధర రూ.8-12 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.
భారత ఎస్‌యూవీ సెగ్మెంట్లో క్రెటా కొత్త ప్రమాణాలను సృష్టించబోతోందని శ్రీవాత్సవ చెప్పారు. క్రెటా ఎస్‌యూవీని కొరియాలోనే డిజైన్ చేసి డెవలప్ చేశారని, హ్యుందాయ్ ఇండియాకు చెందిన హైదరాబాద్, చెన్నై ఇంజినీర్లు ఇతోధికంగా తోడ్పడ్డారని వివరించారు.