ఐసీఐసీఐ బ్యాంక్ ట్రాన్స్‌పరెంట్ క్రెడిట్ కార్డ్
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ భారత్‌లోనే తొలి పారదర్శక డిజైన్‌తో కూడిన క్రెడిట్ కార్డ్‌ను అందిస్తోంది. జెమ్‌స్టోన్ కలక్షన్‌లో భాగంగా ఈ పారదర్శక క్రెడిట్ కార్డును అమెరికన్ ఎక్స్‌ప్రెస్ భాగస్వామ్యంతో అందుబాటులోకి తెస్తున్నామని ఐసీఐసీ బ్యాంక్ ఈడీ రాజీవ్ సభర్వాల్ చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్ పేరుతో అందిస్తున్న ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలపై బోనస్ రివార్డ్ పాయింట్లు పొందవచ్చని పేర్కొన్నారు.
అంతేకాకుండా పొడిగించబడిన క్రెడిట్ పీరియడ్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నామని వివరించారు. ప్రముఖ రెస్టారెంట్లలో బిల్లులపై కనీసం 15 శాతం డిస్కౌంట్ పొందవచ్చని, హెచ్‌పీసీఎల్ అవుట్‌లెట్లలో ఇంధన కొనుగోళ్లపై ఎలాంటి సర్‌చార్జీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సాధారణంగా ప్లాస్టిక్ క్రెడిట్ కార్డులు పారదర్శకంగా ఉండవు. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తున్న ఈ తాజా క్రెడిట్ కార్డ్‌పై వివరాలన్నీ ఉండటంతో పాటు పారదర్శకంగా కూడా ఉంటుంది.