
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు నుంచి పలు కంపెనీలకు రుణాల జారీ వెనుక బ్యాంకు చీఫ్ చందాకొచర్‌కు ఆర్థిక ప్రయోజనాలు చేకూరాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ రంగంలోకి దిగింది. ఈ వివాదంలో బ్యాంకుతో ఆర్థిక లావాదేవీలను కలిగిన పలు కంపెనీలకు సంబంధించి పరిశీలన మొదలు పెట్టినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ వివాదంలో పేర్లు బయటకు వచ్చిన కంపెనీలకు సంబంధించి మోసపూరిత, ప్రిఫరెన్షియల్ లేదా విలువ తక్కువ చేసి చూపించిన లావాదేవీల ఆరోపణలను పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, ఐసీఐసీఐ బ్యాంకు వ్యవహారాలను కార్పొరేట్ వ్యవహారాల శాఖ చూడడం లేదని, ఇది పూర్తిగా ఆర్‌బీఐ పరిధిలోని అంశమని ఆ అధికారి స్పష్టం చేశారు.
ఆయా కంపెనీల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. వీడియోకాన్ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంకు రుణం జారీ వెనుక ‘నీకది, నాకిది’ రూపంలో డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. వీడియోకాన్ గ్రూపు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణం పొందిన తర్వాత చందాకొచర్ భర్త దీపక్ కొచర్‌కు చెందిన నూపవర్ రెన్యువబుల్స్ కంపెనీలోకి నిధుల్ని మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంక్ చీఫ్ చందాకొచర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు గత నెలలోనే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment