ముంబై: ప్రైవేటు రంగంలోని సాధారణ బీమా కంపెనీ ఐసీఐసీఐ లాంబార్డ్ మార్కెట్ల బలహీనతలోనూ లిస్టింగ్ లాభాల్ని పంచింది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో రూ.651 వద్ద లిస్ట్ అయింది. ఇది ఇష్యూ ధర అయిన రూ.661 కంటే ఒకటిన్నర శాతం తక్కువ. తర్వాతma అమ్మకాల ఒత్తిడికి 3% వరకు పడిపోయి రూ.638.65కి చేరింది. అక్కడ కొనుగోళ్ల మద్దతుతో రూ.694 వరకు పెరిగింది. చివరికి ఆఫర్ ధరతో పోలిస్తే 4.45% లాభంతో రూ.680.10 వద్ద ముగిసింది.
రూ.5,700 కోట్ల ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీవో ఈ నెల 19న ముగిసిన విషయం తెలిసిందే. 8,62,47,187 షేర్లను కంపెనీ ఆఫర్ చేసింది. ఇష్యూ 3 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ కాగా, లిస్టింగ్ లాభాలు ఎక్కువగా ఉండకపోవచ్చని విశ్లేషకులు ముందుగానే అంచనా వేశారు. కాగా, స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన తొలి సాధారణ బీమా కంపెనీ ఇదే. జూన్ చివరి నాటికి కంబైన్డ్ రేషియో (నష్టాలు, వ్యయాలను, వసూలైన ప్రీమియంతో భాగించగా వచ్చేది) 102 ఉండగా, దాన్ని సమీప భవిష్యత్తులో 100%కి తగ్గించడం ద్వారా తన కార్యకలాపాలను లాభాల బాట పట్టించడంపై దృష్టి పెట్టినట్టు కంపెనీ ఎండీ భార్గవ్ దాస్ గుప్తా తెలిపారు.