
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మెగా ఐపీవో నేడే
దేశీయ బీమా రంగం నుంచి ఓ కంపెనీ తొలిసారిగా భారీ ఐపీవోకు వస్తోంది. ప్రైవేటు రంగ బీమా దిగ్గజం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్...
న్యూఢిల్లీ: దేశీయ బీమా రంగం నుంచి ఓ కంపెనీ తొలిసారిగా భారీ ఐపీవోకు వస్తోంది. ప్రైవేటు రంగ బీమా దిగ్గజం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఐపీవో సోమవారం ప్రారంభం కానుండగా, ఈ నెల 21న ముగియనుంది. ఈ ఇష్యూలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు తన వాటాల్లోంచి 12.65 శాతం వాటాకు సమానమైన 18,13,41,058 ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. తద్వారా రూ.6వేల కోట్లకు పైగా నిధులు సమీకరించనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.300 - 334. ఐపీవోకు ముందే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ 40 యాంకర్ ఇన్వెస్టర్లకు 4.89 కోట్ల షేర్లు ఒక్కోటీ రూ.334 ధరకు కేటాయించడం ద్వారా ‘అతిపెద్ద యాంకర్ ఇన్వెస్టర్ ప్లేస్‌మెంట్’గా రికార్డు సృష్టించింది.
ఇష్యూ సైజులో 10 శాతం షేర్లు అంటే 1,81,34,105 షేర్లను ఐసీఐసీఐ బ్యాంకు షేర్ హోల్డర్లకు రిజర్వ్ చేశారు. గరిష్టంగా 50 శాతం క్వాలిఫైడ్ ఇన్వెస్టర్లకు, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం రిజర్వ్ చేశారు. యాంకర్ ప్లేస్‌మెంట్ తర్వాత నికరంగా 13.2 కోట్ల షేర్లు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉండగా, అందులో రిటైల్ ఇన్వెస్టర్లకు 5.71 కోట్ల షేర్లు అందుబాటులో ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కార్యకలాపాలు 2001లో ప్రారంభం కాగా, మార్చి చివరి నాటికి సంస్థ నిర్వహణలో 1.4 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఐసీఐసీఐ బ్యాంకుకు 68 శాతం, యూకేకు చెందిన ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్‌కు 26 శాతం వాటా ఉంది. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు 4 శాతం, సింగపూర్‌కు చెందిన టెమాసెక్‌కు 2 శాతం చొప్పున వాటా ఉంది. గతేడాది నవంబర్‌లో వీరికి 6 శాతం వాటాలను విక్రయించడం ద్వారా ఐసీఐసీఐ బ్యాంకు రూ.1,950 కోట్లను సమీకరించింది. తాజా ఇష్యూ అనంతరం ఐసీఐసీఐ బ్యాంకు వాటా 55 శాతానికి పరిమితం కానుంది. కాగా, 2010లో ప్రభుత్వరంగ కోల్ ఇండియా సంస్థ ఐపీవో తర్వాత మరోసారి భారీ స్థాయి ఇష్యూ రావడం ఇదే. కోల్ ఇండియా అప్పట్లో రూ.15వేల కోట్ల నిధులను ఐపీవో ద్వారా సమీకరించింది.