
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో అదనంగా ఏడు శాతం వాటాను కొనుగోలు చేయాలన్న ఎల్‌ఐసీ ప్రతిపాదనకు ఐడీబీఐ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఎల్‌ఐసీకి ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఈక్విటీ షేర్ల జారీకి వాటాదారుల ఆమోదాన్ని పోస్టల్ బ్యాలెట్ ద్వారా కోరతామని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది.
ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి 7.98 శాతం వాటా ఉంది. తాజాగా ఈ వాటాను మరో 7 శాతానికి పెంచుకుంటోంది. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలుకు ఇదొక మెట్టని నిపుణులు భావిస్తున్నారు. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను ఎల్‌ఐసీ కొనుగోలు చేయనున్నది.
ఈ ఏడాది రూ.60,000 కోట్ల ప్రీమియం
ఎల్‌ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ లక్ష్యం
జోనల్ మేనేజర్ సుశీల్ కుమార్ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.60,000 కోట్ల మొత్తం ప్రీమియం ఆదాయం సాధించాలని ఎల్‌ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ లక్ష్యం విధించుకుంది. ఇందులో కొత్త పాలసీల ప్రీమియం రూ.6,300 కోట్లుగా నిర్దేశించుకుంది. 2017–18లో రూ.50,000 కోట్ల మొత్తం ప్రీమియం ఆదాయాన్ని నమోదు చేసినట్లు సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ టి.సి.సుశీల్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కోటి పాలసీలను జారీ చేయాలని టార్గెట్ విధించుకున్నట్టు చెప్పారు.
‘గతేడాది 8 కొత్త ఉత్పత్తులను విడుదల చేశాం. కొత్తగా మూడు ఉత్పత్తులు ఐఆర్‌డీఏ అనుమతికి ఎదురు చూస్తున్నాయి. ఇక పాలసీలన్నీ డిజిటైజ్ చేశాం. కస్టమర్‌కు చెందిన పాలసీలను దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా పరిశీలించేందుకు సంస్థకు మార్గం సుగమం అయింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ‘మై ఎల్‌ఐసీ’ యాప్‌ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాం’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment