
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఐడీబీఐ బ్యాంకు నష్టాలు జూన్ త్రైమాసికంలో మరింత పెరిగాయి. ఏకంగా రూ.2,410 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. మొండి బకాయిలకు అధిక కేటాయింపులే నష్టాలు పెరగడానికి ప్రధాన కారణమని బ్యాంకు తెలియజేసింది. మొత్తం ఆదాయం రూ.6,402 కోట్లకు పరిమితమయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ.6,730 కోట్లుగా ఉంటే, దానిపై రూ.853 కోట్ల నష్టం వచ్చింది. మొండి బకాయిలకు (ఎన్‌పీఏలు) జూన్ త్రైమాసికంలో రూ.4,602 కోట్లను కేటాయించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.1,873 కోట్లు. తీవ్ర నష్టాల్లో ఉన్న బ్యాంకులో 51 శాతం వాటాను ఎల్‌ఐసీ కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే.
పెరిగిన ఎన్‌పీఏలు
బ్యాంకు మొత్తం ఎన్‌పీఏలు రుణాల్లో 30.78 శాతానికి ఎగబాకి రూ.57,806 కోట్లకు చేరుకున్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 24.11%తో రూ.50,173 కోట్లుగా ఉండడం గమనార్హం. ఇక నికర ఎన్‌పీఏలు సైతం 15.8 శాతం నుంచి 18.76 శాతానికి చేరాయి.
ఐడీబీఐ బ్యాంక్ వడ్డీరేటు పెంపు
రుణ సమీకరణ వ్యయ ఆధారిత వడ్డీరేటును (ఎంసీఎల్‌ఆర్) వివిధ కాలపరిమితులకు సంబంధించి 0.10% వరకూ పెంచింది. ఆగస్టు 12 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment