మోడీ సర్కారొస్తే రూపాయి, స్టాక్స్ రయ్
ముంబై: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడితే డాలరుతో రూపాయి మారకం విలువ 58కి పెరగడానికి దోహదపడుతుందని జపాన్ బ్రోకరేజి సంస్థ నోమురా తెలిపింది. అంతేకాదు, స్టాక్ మార్కెట్లో 10 శాతం ర్యాలీ ఏర్పడుతుందని పేర్కొంది. ‘భారత నిర్ణాయక సమయం’ పేరుతో విడుదల చేసిన నివేదికలో సంస్థ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘భారత్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఫైనాన్షియల్ మార్కెట్లకు అత్యంత ప్రాముఖ్యమైనవి.
పటిష్టమైన ఆర్థిక విధానం, సరఫరాకు సంబంధించిన సవరణలు కొరవడడంతో దేశ ఆర్థిక వ్యవస్థ స్టాగ్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం, నిరుద్యోగికత హెచ్చుస్థాయిలో ఉండి, డిమాండ్ మందగించడం) వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఓటర్ల తీర్పు విస్పష్టంగా ఉంటే ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగుపడి అధికోత్పత్తికి అవకాశాలు పెరుగుతాయి..’ అని నోమురా వివరించింది. నోమురా ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ సోనాల్ వర్మ, ఆమె బృందం సభ్యులు, నోమురా ప్రపంచ రాజకీయ విశ్లేషకులు అలస్టెయిర్ న్యూటన్, క్రెయిగ్ చాన్‌లు ఈ నివేదికను రూపొందించారు.