రూ.కోటి ఫ్లాటైనా...రెడీ | if Rs.crore ...building ready | Sakshi
Sakshi News home page

రూ.కోటి ఫ్లాటైనా...రెడీ

Published Sat, May 17 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 7:26 AM

రూ.కోటి ఫ్లాటైనా...రెడీ

రూ.కోటి ఫ్లాటైనా...రెడీ

‘‘ఒకరికి మోదం- ఇంకొకరికి ఖేదం’’ అంటే ఇదేనేమో. రాజకీయ అనిశ్చితితో ఏడాది కాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న హైదరాబాద్ స్థిరాస్తి వ్యాపారంలో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు మాత్రం జోరుగానే ఉన్నాయి. కోటికి పైగా విలువ చేసే ఫ్లాట్లు, విల్లాలకు ఏమాత్రం ఆదరణ తగ్గ లేదని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి ఇతర మెట్రో నగరాల కంటే రాజధానిలో స్థిరాస్తి ధరలు తక్కువగా ఉండటం ఒక కారణమైతే, డాలర్ పెరుగుదల మరో కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భాగ్యనగరంలో జోరందుకున్న ప్రీమియం ఫ్లాట్లు, విల్లా ప్రాజెక్ట్ నిర్మాణాలపై ఈవారం ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనమిది..
 
 సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో కోటికి పైగా విలువ చేసే లగ్జరీ ఫ్లాట్లు, విల్లాలకు గిరాకీ పెరుగుతోంది. రెండు, మూడేళ్లుగా పది శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాయని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. రాజధానిలో ఏటా రూ.70 లక్షలకు పైగా విలువ చేసే ఫ్లాట్లు, విల్లాలు 2-3 వేల వరకు విక్రయిస్తున్నట్లు నిపుణుల అంచనా. మరీ ఎక్కువగా స్థిరాస్తి వ్యాపారం మందగించిన సమయంలో లగ్జరీ మార్కెట్ అమ్మకాలు 50 శాతంగా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. రాజకీయ అనిశ్చితి, స్థిరాస్తి ధరలు స్థిరంగా ఉండటం, డాలర్ విలువ పెరగటం వంటి అంశాలు ఐటీ, ఎన్నారైలకు కలిసొస్తున్నాయని పేర్కొన్నారు.

 బ్యాంకులు లగ్జరీ ఫ్లాట్లు, విల్లాల కొనుగోళ్లకు ఎక్కువ శాతం రుణాల్ని ఇస్తుండటమూ అమ్మకాలకు ఊపునిస్తోందంటున్నారు. విల్లాల భూమి ఖరీదు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని ఓ స్థిరాస్తి వ్యాపారి తెలిపారు. అయితే ఈ లగ్జరీ మార్కెట్ రాష్ట్రంలోని ఏ ఇతర నగరాల్లో పెద్దగా ఉండదు. ఎందుకంటే భాగ్యనగరంలో కోటికి పైగా జనాభా ఉంటుంది. ఇందులో సింహభాగం వ్యాపారులు, పెట్టుబడిదారులే ఉంటారు. వీరు మార్కెట్ బలహీనంగా ఉన్న సమయంలో పెట్టుబడి పెట్టి లాభాలని ఆర్జిస్తుంటారని విశ్లేషించారు. మెట్రో రైల్, ఔటర్  రింగ్‌రోడ్, ఐటీఐఆర్  వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు అదనపు అంశాలు.

 ఐటీ, ఎన్నారైలే టార్గెట్..
 లగ్జరీ ఫ్లాట్లు, విల్లాల అమ్మకాల్లో ఐటీ ఉద్యోగులు, ఎన్నారైలే అధికంగా ఉంటారని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు.  మా కంపెనీ నుంచి నెలకు 30-40 విల్లాలను విక్రయిస్తుంటే.. ఇందులో 90 శాతం అమ్మకాలు ఐటీ నిపుణులు చేస్తున్నారన్నారు.  రియల్ ఎస్టేట్‌లో ఎన్నారైల వాటా 12 శాతంగా ఉందని ప్రాపర్టీ అడ్వైజర్ జేఎల్‌ఎల్ రిపోర్ట్ చెబుతోంది. గతేడాది దేశంలో ఎన్నారైలు రూ.2 బిలియన్ డాలర ్ల పెట్టుబడులు పెట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఇవి ఈ ఏడాది రూ.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. నగరంలో ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి లక్షల్లోనే ఉద్యోగులున్నారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ వీరి వేతనాలు మెరుగ్గానే ఉన్నాయి. కొత్తగా వెబ్ డిజైనింగ్ ఉద్యోగులూ తోడయ్యారు. రెండేళ్ల క్రితం ఏడాదికి రూ. లక్ష ఆర్జించే వెబ్ డిజైనర్ ఆదాయం ఇప్పుడు దాదాపు పదిరెట్లు పెరిగింది. ఇది ఎంతో నైపుణ్యం గలిగినవారికే. వీరందరూ ఖరీదైన ఇళ్లవైపే మొగ్గుచూపుతున్నారు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 16 ఎకరాల్లో 58 ప్రీమియం విల్లాలను నిర్మిస్తోంది. ఒక్కో విల్లా ధర రూ.6 కోట్లకు పైగానే పలుకుతోందంటే వీటి గిరాకీని అర్థం చేసుకోవచ్చు.

 రూ.80 లక్షలకు పైనే..
 లగ్జరీ ఫ్లాట్లు, విల్లాల ధర సుమారుగా రూ.80 లక్షలకు పైగానే ఉంటాయి. నగరంలో రూ. నాలుగున్నర కోట్లుండే విల్లా.. శివార్లల్లో రూ.80 లక్షలకే లభిస్తోంది. అయితే వాటి విస్తీర్ణాలు, సదుపాయాల్లో వ్యత్యాసాలుంటాయి మరి. లగ్జరీ ఫ్లాటు విస్తీర్ణం తక్కువలో తక్కువగా 2 వేల చ.అ. ఉంటుంది. ఇరవై నాలుగు గంటలు విద్యుత్, నీటి సరఫరా ఉంటుంది. విశాలమైన విస్తీర్ణంలో చెట్లు, పచ్చిక బయళ్లుంటాయి. భద్రతకు ముప్పు ఉండదు. క్లబ్‌హౌస్, ఈతకొలను, వ్యాయామశాల, థియేటర్ వంటి ఆధునిక వసతులూ ఉంటాయి. అందమైన ఆకృతిలో భవంతులుంటాయి. అందులోని గృహోపకరణాలూ చాలా ఖరీదైనవి, విలాసవంతమైనవి కూడా.

అందుకే లగ్జరీ ప్రాజెక్ట్‌ల మూల్యమెక్కువగా ఉంటుంది. ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్, గచ్చిబౌలి, మియాపూర్, కొండాపూర్, బాచుపల్లి, నిజాంపేట, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లగ్జరీ ఫ్లాట్లు, విల్లాల నిర్మాణాలు సాగుతున్నాయి. వీటిలో కొన్ని పూర్తికావస్తే, మరికొన్ని రెండేళ్లలో పూర్తికానున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల సుమారుగా పది వేలకు పైగానే లగ్జరీ యూనిట్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నట్లు విశ్లేషకుల అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement