luxury flats
-
అపార్ట్మెంట్లతో పోలిస్తే ఓపెన్ ప్లాట్లే ముద్దు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని హౌసింగ్.కామ్ తెలిపింది. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని రీసెర్చ్ హెడ్ అంకితా సూద్ పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13-21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2-6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. ఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని ఓపెన్ ప్లాట్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. (ప్రాపర్టీలకు డిమాండ్. రూ 2 కోట్లు అయినా ఓకే!) 2018-21 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్పల్లి, పటాన్చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్‌నగర్ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా.. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబుదూర్, తైయూర్ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్కబల్లాపూర్, హోస్కేట్, కొంబల్‌గోడు ప్రాంతాల్లోని నివాస ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది. 2018-21 మధ్య ఢిల్లీ-ఎన్సీఆర్లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. (ఉడాన్‌లో రెండో రౌండ్ కోతలు, భారీగా ఉద్యోగులపై వేటు) -
కుక్కల కోసం లగ్జరీ ఫ్లాట్.. పార్థ చటర్జీ ఈడీ విచారణలో షాకింగ్ విషయాలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర మంత్రి పార్థ చటర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణలో ఆయనకు సంబంధించిన మరిన్ని అక్రమాస్తులు బయటపడుతున్నాయి. కోల్‌కతాలో ఖరీదైన డైమండ్ సిటీలో మంత్రిగారికి మూడు ఫ్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో ఒకటి కేవలం కుక్కల కోసమే కేటాయించినట్లు తెలుస్తోంది. ఆ ఫ్లాట్‌కు ఏసీ కూడా ఉందట. పార్థ చటర్జీకి జంతుప్రేమికుడని గుర్తింపు ఉంది. అందుకే శునకాల కోసం ప్రత్యేకంగా ఫ్లాట్‌ను కొనుగోలు చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. పార్థ చటర్జీని ఈడీ అధికారులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ నివాసంలో రూ.21కోట్ల నగదు, రూ.కోటి కోటి విలువ చేసే బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అర్పితకు పార్థ చటర్జీ మూడు ఫ్లాట్స్‌ను కానుకగా ఇచ్చారని, వాటిలో ఒక నివాసంలోనే డబ్బు, బంగారం సీజ్ చేసినట్లు ఈడీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతేకాదు వీరిద్దరి పేరు మీద బోల్పుర్లోని శాంతినికేతన్లో ఓ అపార్ట్మెంట్ కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి. దీంతో శాంతినికేతన్‌లోని ఏడు ఇళ్లతో పాటు అపార్ట్మెంట్లపై అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. మమతకు ఫోన్ అరెస్టయిన రోజు మంత్రి పార్థ చటర్జీ సీఎం మమతా బెనర్జీకి నాలుగు సార్లు ఫోన్ కాల్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఉదయం 1:55 గంటలకు, 2:33 గంటలకు ఫోన్ చేస్తే మమత ఎత్తలేదని పేర్కొన్నాయి. ఆ తర్వాత తిరిగి 3:37 గంటలకు, 9:35 గంటలకు ఫోన్ చేసినా మమత నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పాయి. అరెస్టు విషయాన్ని కుటుంబసభ్యులు, బంధువులకు తెలియజేయమని అడిగినప్పుడు సీఎంకే ఆయన ఫోన్ చేసినట్లు వివరించాయి. అయితే టీఎంసీ మాత్రం దీన్ని ఖండించింది. సీఎం మమతకు పార్థ చటర్జీ ఫోన్ నుంచి ఎలాంటి కాల్స్ రాలేదని పేర్కొంది. చదవండి: రాజ్యసభ సీటు కావాలా? గవర్నర్ పదవి కావాలా? రూ.100 కోట్లివ్వు పని అయిపోద్ది..! -
షిప్లో ఇల్లు కావాలా? 24 ఏళ్ల వరకు అద్దెకు అపార్ట్మెంట్లు .. ప్రారంభ ధరెంతో తెలుసా?
నేల మీద ఉండీ ఉండీ బోర్ కొట్టిందా. కాస్త వెరైటీగా సముద్రంలో ఇల్లు కట్టుకొని ఉంటే భలే ఉంటుందని అనుకుంటున్నారా. అయితే మీ కోసం ఓ గుడ్ న్యూస్! సముద్రంలో ఉండటమే కాదు. బోర్ కొడితే నీళ్లలో అలా ఓ చుట్టు చుట్టేసి కూడా వచ్చేలా ఇళ్లు సిద్ధమవుతున్నాయి. అదెలా.. అనుకుంటున్నారా. ఓ లగ్జరీ క్రూయిజ్ షిప్లో ఫ్లాట్లను అమ్మకానికి పెట్టారు. – సాక్షి, సెంట్రల్‌డెస్క్ రూ. 2.7 కోట్ల నుంచి మొదలు ఫ్లోరిడాకు చెందిన స్టోరీ లైన్స్ కంపెనీ ‘ఎంవీ నరేటివ్’పేరుతో లగ్జరీ క్రూయిజ్ షిప్‌ను నిర్మిస్తోంది. 2024 కల్లా ఇది అందుబాటులోకి రానుంది. షిప్లో ఒకటి నుంచి నాలుగు బెడ్రూమ్ల అపార్ట్మెంట్లు, స్టూడియోలు కలిపి మొత్తం 547 నిర్మిస్తోంది. వీటినే తాజాగా అమ్మకానికి పెట్టింది. వీటి ధర రూ.2.7 కోట్ల నుంచి మొదలవుతుంది. ఇంటి పరిమాణం, ఇంట్లోని వస్తువులను బట్టి ధర పెరుగుతుంటుంది. ఇళ్లను 12, 24 ఏళ్లకు అద్దెకు కూడా ఇస్తారు. వీలైనంత తక్కువ ధరకు ప్రజలకు ఇళ్లను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామని కంపెనీ చెబుతోంది. (చదవండి: కేసులు పెరుగుతున్నా.. మరణాలు తక్కువే!) ఇంటికి కావాల్సినవన్నీ అందుబాటులో.. ప్రతి అపార్ట్మెంట్లో ఇంట్లో ఉండటానికి కావాల్సిన ఫర్నిచరంతా ఉంటుంది. ఇటాలియన్ ఇంటీరియర్ డిజైన్లతో అద్భుతంగా కనిపిస్తుంది. కిచెన్, టీవీలు, ఇంట్లో వేడి, చలి నియంత్రణ వ్యవస్థలు, మూడ్‌కు తగ్గట్టు కాంతి రంగులను మార్చుకునే వెసులుబాటు ఉంది. షిప్లో మొత్తం 20 బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో ఎప్పుడైనా ఆర్డర్ చేసుకునేలా 24 గంటల హోమ్ డెలివరీ వెసులుబాటు ఉంది. వినోదం కోసం ఓ సినిమా హాలు, బీర్లు అమ్మే చిన్న మైక్రో బ్రూవరీ, 3 స్విమ్మింగ్ పూల్స్, 10 వేల పుస్తకాలున్న లైబ్రరీ, స్పా, వెల్నెస్ సెంటర్, యోగా స్టూడియో కూడా ఉన్నాయి. అలాగే గోల్ఫ్ సిములేటర్, డ్యాన్స్ ఫ్లోర్ కూడా ఉన్నాయి. షిప్లో ఉండే వాళ్లు చెస్, ఫొటోగ్రఫీలాంటి క్లబ్‌లుగా ఏర్పడి ఆడుకోవచ్చు. ఈ షిప్ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా అక్కడి పోర్టుల్లో దాదాపు 5 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి అక్కడి ప్రదేశాలను తిరిగి రావొచ్చు. షిప్ ఎక్కడికెళ్లాలి, ఎక్కడ ఆగాలో షిప్‌లోని వాళ్లు ముందే నిర్ణయించుకోవచ్చు కూడా. (చదవండి: వారిని విడుదల చేయండి!) -
ఊపందుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం
సాక్షి, ముంబై: కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ వల్ల చిన్నా చితకా వ్యాపారులతో పాటు బడా వ్యాపారులు కూడా ఆర్థికంగా నష్టపోయారు. అయితే, కరోనా గడ్డు కాలంలో సైతం రియల్ ఇస్టేట్ రంగం ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ముంబైలో గడచిన ఆరు నెలల కాలంలో లగ్జరీ ఫ్లాట్ల విక్రయం గణనీయంగా పెరిగింది. నగరంలో రూ. 15 నుంచి రూ. 100 కోట్లు విలువ చేసే లగ్జరీ ఫాట్ల విక్రయం వల్ల ఏకంగా రూ. 4 వేల కోట్లకుపైగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు స్క్వేర్ యార్డ్స్ నివేదిక వెలుగులోకి తెచ్చింది. ఈ నివేదికలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఎన్ని లగ్జరీ ఫ్లాట్లు అమ్ముడుపోయాయనే దానిపై అధ్యయనం చేసి ఆ వివరాలను పొందుపరిచారు. కరోనా కాలంలో స్తంభించిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మళ్లీ ఊపందుకునేలా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే స్టాంప్ డ్యూటీలో రాయితీ ప్రకటించింది. మార్చి 31 వరకు కొనుగోలుదారులు కేవలం రెండు శాతం స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీన్ని అదనుగా చేసుకున్న అనేక మంది లగ్జరీ ఫ్లాట్లను కొనుగోలు చేశారు. మొత్తం 60 శాతం ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు మార్చి 31కి ముందే జరిగాయి. ముఖ్యంగా సాధారణ ఫ్లాట్లతో పోలిస్తే లగ్జరీ ఫ్లాట్లకే ఎక్కువ ఆసక్తి కనబర్చినట్లు రిజిస్ట్రేషన్ల సరళిని బట్టి తెలిసింది. ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో అత్యధిక శాతం లగ్జరీ ఫ్లాట్ల విక్రయాలు జరిగాయి. మొత్తం లావాదేవీల్లో 60 శాతం లోయర్ పరేల్‌లోనే జరిగినట్లు స్క్వేర్ యార్డ్స్ నివేదికలో పేర్కొంది. -
సొంతిల్లు సులక్షణం
⇒ శరవేగంగా రూపుదిద్దుకుంటోన్న టీఎన్ఆర్ సులక్షణ ⇒ ఆరున్నర ఎకరాల్లో 490 లగ్జరీ ఫ్లాట్లు ⇒ జూన్ నుంచి గృహప్రవేశాలు షురూ భాగ్యనగరంలో సొంతిల్లు కొనాలంటే అందుబాటు ధరల్లో స్థలాలు దొరకవు! పోనీ దొరికినా లేదా ధర తక్కువున్న ప్రాంతాలకు వెళితేనేమో రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉండవు!! మరి, సొంతింటి కల తీరేదెలా? ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్న ఎల్బీనగర్ ప్రాంతంలో.. మెట్రో రైలుకు కూతవేటు దూరంలో.. విద్య, వైద్యం, వినోదం ఇలా అన్ని రంగాల్లోనూ శరవేగంగా వృద్ధి చెందుతున్న ప్రాంతంలో అది కూడా అందుబాటు ధరల్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది టీఎన్ఆర్ గ్రూప్. శరవేగంగా రూపుదిద్దుకుంటోన్న టీఎన్ఆర్ సులక్షణ ప్రాజెక్ట్ విశేషాలను సంస్థ సీఎండీ నర్సింహారావు ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు. సాక్షి, హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి 1.5 కి.మీ. దూరంలో ఉన్న హస్తినాపురంలో ఆరున్నర ఎకరాల్లో టీఎన్ఆర్ సులక్షణ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజñ క్ట్ను నిర్మిస్తున్నాం. ఇందులో మొత్తం 490 ప్రీమియం ఫ్లాట్లుంటాయి. 40 శాతం 2 బీహెచ్‌కే, 60 శాతం 3 బీహెచ్‌కే ఫ్లాట్లు. 1,074–1,754 చ.అ.ల్లో ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. 5 బ్లాకుల్లో.. ఒక్కో బ్లాక్ ఏడంతస్తుల్లో ఉంటుంది. ⇒ ఆదిభట్లకు 10 నిమిషాల ప్రయాణ వ్యవధి దూరంలోనే ఈ ప్రాజెక్ట్ ఉండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలతో పాటూ టీసీఎస్, డీఆర్డీఎల్, మిథానీ, ఆర్సీఐ, ఏరోస్పేస్ వంటి సంస్థల ఉద్యోగులూ కొనుగోలు చేశారు. దీంతో ఇప్పటికే ఇందులో 70 శాతం అమ్మకాలు పూర్తయ్యాయి. జూన్ నుంచి సీ, డీ బ్లాకుల్లో 200 ఫ్లాట్లు కొనుగోలుదారులకు అప్పగిస్తాం. ఇప్పటికే వీటిల్లో 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మిగిలిన బ్లాకుల్లోనూ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. మొత్తం ప్రాజెక్ట్‌ను 2018 ముగింపు నాటికి పూర్తి చేస్తాం. ⇒ నిర్మాణంలో నాణ్యత అనేది టీఎన్ఆర్ లక్ష్యం. అందుకే కాబోలు 18 ఏళ్లలో 30 ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన టీఎన్ఆర్.. 70 శాతం ప్రాజెక్ట్‌లు ఈస్ట్ జోన్ కేంద్రంగా నిర్మించినవే. ఇవి చాలవూ టీఎన్ఆర్ ప్రాజెక్ట్‌ల నాణ్యత విషయంలో కస్టమర్లకు ఎంత నమ్మకమో చెప్పేందుకు. సులక్షణ నిర్మాణం గురించి ‘సాక్షి రియల్టీ’ ప్రత్యక్షంగా పరిశీలిం చింది. భూకంపాలను తట్టుకునే శక్తిగల ఆర్సీసీ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్, టీఎన్ఆర్ రెడిమిక్స్ కాంక్రీట్‌తో నిర్మాణం జరుగుతుంది. వెలుపలి గోడలు 8 ఇంచులు, లోపలి గోడలు 4 ఇంచులతో ఉన్నాయి. ప్రధాన ద్వారం టేక్‌వుడ్ ఫ్రేమ్‌తో, లోపలి తలుపులు, కిటికీలు టీఎన్ఆర్ యూపీవీసీతో ఉన్నాయి. లివింగ్, డైనింగ్, కిచెన్, బెడ్ రూముల్లో వెర్టిఫైడ్ టైల్స్, కారిడార్, బాల్కనీల్లో యాంటి స్కిడ్ సెరామిక్ టైల్స్, బాత్ రూముల్లో యాసిడ్ రెసిస్టెన్స్ సెరామిక్ టైల్స్, గ్రానైట్ కిచెన్ ఫ్లాట్‌ఫాం, స్టీల్ సింక్ వంటివి ఉన్నాయి. ఎలక్ట్రిక్ వైర్లు, స్విచ్చులు, ఫ్రేం వర్క్స్ వంటి అన్ని ఉత్పత్తులూ బ్రాండెడ్ కంపెనీలవే వినియోగించారు. ⇒ ఆధునిక వసతులనేవి సామాన్య, మధ్యతరగతి వారు కూడా అనుభవించాలనే ఉద్దేశంతో సులక్షణలో వసతులకు ప్రాధాన్యమిచ్చాం. దీంతో ఈస్ట్ జోన్లో అత్యధిక వసతులందిస్తున్న ప్రాజెక్ట్‌లో ఇది నిలిచింది. ప్రాజెక్ట్‌లో ప్రత్యేక ఆకర్షణ ఓపెన్ ఎయిర్ థియేటరే. అలాగే 2 క్లబ్ హౌజ్‌లు.. ఒక్కోటి మూడంతస్తుల్లో ఉంటాయి కూడా. ల్యాండ్ స్కేపింగ్, స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్, జాగింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మల్టిపర్పస్ హాల్, ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్, యోగా, మెడిటేషన్ హాల్, లైబ్రరీ, క్రచ్, ఇన్ఫినిటీ పూల్ వంటి రకరకాల సదుపాయాలను కల్పిస్తున్నాం. రెండు లెవల్స్ పార్కింగ్, వాటర్ హార్వెస్టింగ్, సౌర వీధి దీపాలతో పాటూ నివాసితులు నిత్యావసరాల కోసం బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రాజెక్ట్‌లోనే సూపర్ మార్కెట్, ఐటీఎం, స్పా, కెఫెటేరియా వంటి ఏర్పాట్లూ ఉంటాయి. -
రూ.300 కోట్లతో సుమధుర అక్రోపొలిస్
31 అంతస్తుల్లో.. 564 లగ్జరీ ఫ్లాట్లు సాక్షి, హైదరాబాద్ : బెంగళూరుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ సుమధుర గ్రూప్ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. రూ.300 కోట్ల పెట్టుబడితో గచ్చిబౌలిలో 4 ఎకరాల 5 గుంటల స్థలంలో అక్రోపొలిస్ పేరిట లగ్జరీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. వాసవీ హోమ్స్ సంస్థతో కలిసి 28:72 నిష్పత్తితో జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను చేస్తున్నామని సంస్థ చైర్మన్ మధుసూదన్ శుక్రవారమిక్కడ విలేకరులతో చెప్పారు. జూలై 2019 నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుందని.. ఆ తర్వాత సుమారు 10 లక్షల చ.అ. స్థలం అమ్మకానికి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. 31 అంతస్తుల్లో రానున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 564 ఫ్లాట్లుంటాయి. 1,245-2,615 చ.అ. మధ్య 2, 3 పడక గదులుంటాయి. ప్రారంభ ధర రూ.58 లక్షలు. ఇందులో క్లబ్ హౌజ్‌తో పాటు స్విమ్మింగ్ పూల్, జిమ్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ప్లే ఏరియా వంటి అన్ని రకాల వసతులుంటాయి. ఇప్పటికే బెంగళూరులో 18కి పైగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేశామని.. వచ్చే రెండేళ్లలో పుణే, చెన్నైల్లోనూ నిర్మాణాలను ప్రారంభిస్తామని మధుసూదన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ వైస్ చైర్మన్ రామారావు, డెరైక్టర్ (కన్స్ట్రక్షన్స్) భరత్ పాల్గొన్నారు. -
సొంతింటికి దగ్గరిదారి!
పదేళ్ల క్రితం వరకూ షేరు ఆటోలు కూడా సరిగా తిరగని ఆ ప్రాంతంలో.. నేడు లగ్జరీ కార్లు చక్కర్లు కొడుతున్నాయి! గతంలో గజం స్థలం రూ.2 వేలు కూడా పలకని ఆ ప్రాంతంలో.. నేడు రూ.10 వేలు పెట్టినా దొరకని పరిస్థితి!! ఒకప్పుడు విద్యా, వైద్యం, వినోదం.. అన్నింటికీ సిటీలోకి వచ్చే అక్కడి ప్రజలు.. ఇప్పుడు అన్నింటినీ ఒకే చోట పొందేస్తున్నారు!!! .. ఇదివరకది గ్రామం.. కానీ, నేడది గ్రామంలోనే రూపుదిద్దుకున్న మహా నగరం! అభివృద్ధికి, అందుబాటు ధరలకీ కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతమే కిస్మత్పూర్. పేరులోనే కాదు.. ఊరులోనూ అదృష్టాన్ని దాచుకుందీ ప్రాంతం. ► అభివృద్ధికి.. అందుబాటు ధరలకూ కిస్మత్పూర్ సరైన ప్రాంతం ► లగ్జరీ ఫ్లాట్లు.. విల్లా ప్రాజెక్ట్‌లకు కేరాఫ్ అడ్రస్ ► ఐటీ హబ్, ఎయిర్‌పోర్ట్‌లకు దగ్గర్లో ఉండటం కలిసొచ్చే అంశం ► స్థిరాస్తి కొనుగోలుకు ఇదే సరైన ప్రాంతమంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ పరిధిలో అప్పా జంక్షన్, బండ్లగూడ, హైదర్షాకోట, కిస్మత్పూర్, బుద్వేల్, అత్తాపూర్, పీరంచెరువు, మంచిరేవుల ప్రాంతాలు ప్రధానమైనవి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ప్రాంతం కిస్మత్పూర్. ఎందుకంటే ఈ ప్రాంతం సెక్రటేరియట్, లక్డికపూల్ వంటి సిటీ సెంటర్ ప్రాంతాలకు 15 కి.మీ. దూరంలో, ఐటీ హబ్, శంషాబాద్ విమానాశ్రయానికి 20 కి.మీ.ల దూరంలో ఉండటం. నేటికీ సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండటమేనని గిరిధారి కన్స్ట్రక్షన్స్ సీఎండీ ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. ఈ ప్రాంతం అటు మెట్రో రైలుకు, ఇటు ఔటర్ రింగ్ రోడ్డులకూ సులువుగా చేరుకునేంత దూరంలో ఉంది. షాద్‌నగర్, కొత్తూరులోని పలు మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులూ కిస్మత్పూర్లోనే ఉంటున్నారు. ఎందుకంటే మెట్రో రైలుతో సిటీలో ప్రయాణించే వీలు.. కూతవేటు దూరంలో ఉన్న ఓఆర్ఆర్ మీదుగా ఆదిభట్ల, మహేశ్వరంలోని ఐటీ, హార్డ్‌వేర్ పార్క్, ఏరో స్పేస్ కంపెనీలకే కాదు.. 40 కి.మీ. దూరంలో పీఅండ్‌జీ, జాన్సన్ వంటి మల్టీనేషనల్ కంపెనీలకు, ఫార్మా సిటీ, లాజిస్టిక్ పార్కులకూ సులువుగా చేరుకునే వీలుంది. రూ.30 లక్షల నుంచి ప్రారంభం.. కిస్మత్పూర్లో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటుగా విదేశీ సంస్థల ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ప్రెస్టిజ్, జైన్, మంత్రి, పీబీఈఎల్, వసతి ఆనంది, శాంతాశ్రీరాం, ఆర్వీ నిర్మాణ్, కీర్తి, గిరిధారి, ఎస్ఎంఆర్ వంటి సంస్థలు నిర్మాణాలు చేపడుతున్నాయి. ఈ ప్రాంతంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి 10 శాతం నిర్మాణాలుండగా.. 9 నెలల్లో పూర్తయ్యేవి 40 శాతం వరకున్నాయి. ధర విషయానికొస్తే చ.అ. ధర రూ.3-4 వేల వరకున్నాయి. రూ. 30-60 లక్షల మధ్య 2, 3 బీహెచ్‌కే ఫ్లాట్లు దొరుకుతున్నాయి. 300-400 గజాల స్థలాల్లో ఉండే విల్లాలు రూ. 2-3 కోట్ల మధ్య చెబుతున్నారు. ఐటీ, ఎన్నారైల దృష్టి ఇక్కడే.. రూ. 25-40 వేల మధ్య వేతనాలుండే ప్రతి ఉద్యోగికి ఇది అనువైన ప్రాంతం. ఐటీ ఉద్యోగులకైతే మరీను. అందరు ఐటీ ఉద్యోగులూ గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకోలేరు. అందుబాటు ధరల్లో.. తక్కువ దూరంలో ఉండే ప్రాంతం కిస్మత్పూర్ కావటంతో ఈ వైపు దృష్టి పెడుతున్నారు. కొత్తగా ప్రారంభమైన రేతిబౌలి ఫ్లై ఓవర్ మీదుగా రాయదుర్గం జంక్షన్ నుంచి ఐటీ హబ్‌కు త్వరగా చేరుకోవచ్చు. 20 నిమిషాల వ్యవధిలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే వీలుండటంతో ఎన్నారైలు, విదేశీయులూ ఈ ప్రాంతంపై మక్కువ చూపుతున్నారు. విద్యా, వైద్యం, వినోదాలు కూడా.. వాస్తు ప్రకారం ఏ నది అయితే దక్షిణం వైపు నుంచి ఉత్తరానికి ప్రవహిస్తుందో అక్కడ అభివృద్ధి, ఆయురారోగ్యాలూ ఉంటాయని పండితుల మాట. కిస్మత్‌పూర్‌లోని ఈసా నది అలా ప్రవహిస్తున్నదే మరి. ఇన్నర్, ఔటర్లను అనుసంధానం చేసేందుకు ఈసా నదిపై బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు కూడా. మరో విషయమేంటంటే.. కిస్మత్పూర్, బండ్లగూడ గ్రామాలను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ దత్తత తీసుకున్నారు. దీంతో ఇక్కడి రహదారులకు, మౌలిక వసతులకు మహర్దశ పట్టుకుంది. ఈ ప్రాంతంలోకి ఐటీ పార్క్‌ను తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని సమాచారం. రాజేంద్రనగర్‌లో ఎన్ఐఆర్డీ, ఎన్జీరంగా వర్సిటీలతో పాటుగా. అప్పా జంక్షన్లో సుమారు 70కి పైగా విద్యా సంస్థలు, ప్రముఖ ఆసుపత్రులెన్నో ఉన్నాయి. అప్పా జంక్షన్ చుట్టూ మిలటరీ ఏరియా ఉండటంతో శాంతి భద్రతల సమస్య లేదు. ఈ ప్రాంతం హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాలకు అతి దగ్గర్లో ఉండటంతో జల వనరులకూ కొదవేలేదు. హిమాయత్‌సాగర్‌కు ఆనుకొని ఎకో పార్క్, సైన్స్ పార్క్, కిద్వాయి గార్డెన్లతో నిత్యం కిటకిటలాడుతుంది. ఓవైపు నిజాం నిర్మించిన హిమాయత్‌సాగర్, ఇంకోవైపు గోల్కొండ, కుతుబ్‌షాహీ టూం బ్స్.. మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సిటీకి కలుపుతున్న ఓఆర్ఆర్.. ఇలా అభివృద్ధికి, చరిత్రాత్మక కట్టడాలకు నెలవాలంగా నిలుస్తోంది కిస్మత్పూర్. 600 ఫ్లాట్లు.. 120 విల్లాలు.. కిస్మత్పూర్ అభివృద్ధి, ఇక్కడి గిరాకీని దృష్టిలో పెట్టుకొని సమీప భవిష్యత్తులో ఇక్కడి స్థిరాస్తి ధరలు రెండితలు పెరిగే అవకాశముంది. అందుకే సామాన్య, మధ్య తరగతి ప్రజలకే కాదు కాస్త ముందు చూపున్న ఉద్యోగులు, వ్యాపారులు, ఎన్నారైలూ కిస్మత్పూర్లో స్థిర నివాసం ఏర్పరుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు ప్రాజెక్ట్‌లతో పాటుగా మరో రెండు ప్రాజెక్ట్‌లను ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని గిరిధారి సంస్థ సీఎండీ ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. 4 ఎకరాల్లో విల్లా ఓనిక్స్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో 43 విల్లాలు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. ఇటీవల విల్లా ఓనిక్స్ క్లబ్ హౌజ్‌ను ప్రారంభించాం. ఎకరం విస్తీర్ణంలో ఈస్టా ప్రాజెక్ట్‌నూ నిర్మిస్తున్నాం. ఇందులో 90 ఫ్లాట్లొచ్చాయి. త్వరలో ఈ ప్రాంతంలో 6 ఎకరాల్లో మూడు ప్రాజెక్ట్‌లు కలిపి మొత్తం 600 ఫ్లాట్లు, 12 ఎకరాల్లో దాదాపు 120 విల్లా ప్రాజెక్ట్‌నూ నిర్మించనున్నాం. -
రూ.కోటి ఫ్లాటైనా...రెడీ
‘‘ఒకరికి మోదం- ఇంకొకరికి ఖేదం’’ అంటే ఇదేనేమో. రాజకీయ అనిశ్చితితో ఏడాది కాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న హైదరాబాద్ స్థిరాస్తి వ్యాపారంలో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు మాత్రం జోరుగానే ఉన్నాయి. కోటికి పైగా విలువ చేసే ఫ్లాట్లు, విల్లాలకు ఏమాత్రం ఆదరణ తగ్గ లేదని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి ఇతర మెట్రో నగరాల కంటే రాజధానిలో స్థిరాస్తి ధరలు తక్కువగా ఉండటం ఒక కారణమైతే, డాలర్ పెరుగుదల మరో కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భాగ్యనగరంలో జోరందుకున్న ప్రీమియం ఫ్లాట్లు, విల్లా ప్రాజెక్ట్ నిర్మాణాలపై ఈవారం ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనమిది.. సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో కోటికి పైగా విలువ చేసే లగ్జరీ ఫ్లాట్లు, విల్లాలకు గిరాకీ పెరుగుతోంది. రెండు, మూడేళ్లుగా పది శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాయని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. రాజధానిలో ఏటా రూ.70 లక్షలకు పైగా విలువ చేసే ఫ్లాట్లు, విల్లాలు 2-3 వేల వరకు విక్రయిస్తున్నట్లు నిపుణుల అంచనా. మరీ ఎక్కువగా స్థిరాస్తి వ్యాపారం మందగించిన సమయంలో లగ్జరీ మార్కెట్ అమ్మకాలు 50 శాతంగా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. రాజకీయ అనిశ్చితి, స్థిరాస్తి ధరలు స్థిరంగా ఉండటం, డాలర్ విలువ పెరగటం వంటి అంశాలు ఐటీ, ఎన్నారైలకు కలిసొస్తున్నాయని పేర్కొన్నారు. బ్యాంకులు లగ్జరీ ఫ్లాట్లు, విల్లాల కొనుగోళ్లకు ఎక్కువ శాతం రుణాల్ని ఇస్తుండటమూ అమ్మకాలకు ఊపునిస్తోందంటున్నారు. విల్లాల భూమి ఖరీదు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని ఓ స్థిరాస్తి వ్యాపారి తెలిపారు. అయితే ఈ లగ్జరీ మార్కెట్ రాష్ట్రంలోని ఏ ఇతర నగరాల్లో పెద్దగా ఉండదు. ఎందుకంటే భాగ్యనగరంలో కోటికి పైగా జనాభా ఉంటుంది. ఇందులో సింహభాగం వ్యాపారులు, పెట్టుబడిదారులే ఉంటారు. వీరు మార్కెట్ బలహీనంగా ఉన్న సమయంలో పెట్టుబడి పెట్టి లాభాలని ఆర్జిస్తుంటారని విశ్లేషించారు. మెట్రో రైల్, ఔటర్ రింగ్‌రోడ్, ఐటీఐఆర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు అదనపు అంశాలు. ఐటీ, ఎన్నారైలే టార్గెట్.. లగ్జరీ ఫ్లాట్లు, విల్లాల అమ్మకాల్లో ఐటీ ఉద్యోగులు, ఎన్నారైలే అధికంగా ఉంటారని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. మా కంపెనీ నుంచి నెలకు 30-40 విల్లాలను విక్రయిస్తుంటే.. ఇందులో 90 శాతం అమ్మకాలు ఐటీ నిపుణులు చేస్తున్నారన్నారు. రియల్ ఎస్టేట్‌లో ఎన్నారైల వాటా 12 శాతంగా ఉందని ప్రాపర్టీ అడ్వైజర్ జేఎల్ఎల్ రిపోర్ట్ చెబుతోంది. గతేడాది దేశంలో ఎన్నారైలు రూ.2 బిలియన్ డాలర ్ల పెట్టుబడులు పెట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవి ఈ ఏడాది రూ.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. నగరంలో ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి లక్షల్లోనే ఉద్యోగులున్నారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ వీరి వేతనాలు మెరుగ్గానే ఉన్నాయి. కొత్తగా వెబ్ డిజైనింగ్ ఉద్యోగులూ తోడయ్యారు. రెండేళ్ల క్రితం ఏడాదికి రూ. లక్ష ఆర్జించే వెబ్ డిజైనర్ ఆదాయం ఇప్పుడు దాదాపు పదిరెట్లు పెరిగింది. ఇది ఎంతో నైపుణ్యం గలిగినవారికే. వీరందరూ ఖరీదైన ఇళ్లవైపే మొగ్గుచూపుతున్నారు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 16 ఎకరాల్లో 58 ప్రీమియం విల్లాలను నిర్మిస్తోంది. ఒక్కో విల్లా ధర రూ.6 కోట్లకు పైగానే పలుకుతోందంటే వీటి గిరాకీని అర్థం చేసుకోవచ్చు. రూ.80 లక్షలకు పైనే.. లగ్జరీ ఫ్లాట్లు, విల్లాల ధర సుమారుగా రూ.80 లక్షలకు పైగానే ఉంటాయి. నగరంలో రూ. నాలుగున్నర కోట్లుండే విల్లా.. శివార్లల్లో రూ.80 లక్షలకే లభిస్తోంది. అయితే వాటి విస్తీర్ణాలు, సదుపాయాల్లో వ్యత్యాసాలుంటాయి మరి. లగ్జరీ ఫ్లాటు విస్తీర్ణం తక్కువలో తక్కువగా 2 వేల చ.అ. ఉంటుంది. ఇరవై నాలుగు గంటలు విద్యుత్, నీటి సరఫరా ఉంటుంది. విశాలమైన విస్తీర్ణంలో చెట్లు, పచ్చిక బయళ్లుంటాయి. భద్రతకు ముప్పు ఉండదు. క్లబ్‌హౌస్, ఈతకొలను, వ్యాయామశాల, థియేటర్ వంటి ఆధునిక వసతులూ ఉంటాయి. అందమైన ఆకృతిలో భవంతులుంటాయి. అందులోని గృహోపకరణాలూ చాలా ఖరీదైనవి, విలాసవంతమైనవి కూడా. అందుకే లగ్జరీ ప్రాజెక్ట్‌ల మూల్యమెక్కువగా ఉంటుంది. ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్, గచ్చిబౌలి, మియాపూర్, కొండాపూర్, బాచుపల్లి, నిజాంపేట, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లగ్జరీ ఫ్లాట్లు, విల్లాల నిర్మాణాలు సాగుతున్నాయి. వీటిలో కొన్ని పూర్తికావస్తే, మరికొన్ని రెండేళ్లలో పూర్తికానున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల సుమారుగా పది వేలకు పైగానే లగ్జరీ యూనిట్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నట్లు విశ్లేషకుల అంచనా.