కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర మంత్రి పార్థ చటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణలో ఆయనకు సంబంధించిన మరిన్ని అక్రమాస్తులు బయటపడుతున్నాయి. కోల్‌కతాలో ఖరీదైన డైమండ్ సిటీలో మంత్రిగారికి మూడు ఫ్లాట్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో ఒకటి కేవలం కుక్కల కోసమే కేటాయించినట్లు తెలుస్తోంది. ఆ ఫ్లాట్‌కు ఏసీ కూడా ఉందట. పార్థ చటర్జీకి జంతుప్రేమికుడని గుర్తింపు ఉంది. అందుకే శునకాల కోసం ప్రత్యేకంగా ఫ్లాట్‌ను కొనుగోలు చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
పార్థ చటర్జీని ఈడీ అధికారులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ నివాసంలో రూ.21కోట్ల నగదు, రూ.కోటి కోటి విలువ చేసే బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అర్పితకు పార్థ చటర్జీ మూడు ఫ్లాట్స్‌ను కానుకగా ఇచ్చారని, వాటిలో ఒక నివాసంలోనే డబ్బు, బంగారం సీజ్ చేసినట్లు ఈడీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతేకాదు వీరిద్దరి పేరు మీద బోల్పుర్‌లోని శాంతినికేతన్‌లో ఓ అపార్ట్‌మెంట్ కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి. దీంతో శాంతినికేతన్‌లోని ఏడు ఇళ్లతో పాటు అపార్ట్‌మెంట్లపై అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
మమతకు ఫోన్
అరెస్టయిన రోజు మంత్రి పార్థ చటర్జీ సీఎం మమతా బెనర్జీకి నాలుగు సార్లు ఫోన్ కాల్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఉదయం 1:55 గంటలకు, 2:33 గంటలకు ఫోన్ చేస్తే మమత ఎత్తలేదని పేర్కొన్నాయి. ఆ తర్వాత తిరిగి 3:37 గంటలకు, 9:35 గంటలకు ఫోన్ చేసినా మమత నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పాయి. అరెస్టు విషయాన్ని కుటుంబసభ్యులు, బంధువులకు తెలియజేయమని అడిగినప్పుడు సీఎంకే ఆయన ఫోన్ చేసినట్లు వివరించాయి. అయితే టీఎంసీ మాత్రం దీన్ని ఖండించింది. సీఎం మమతకు పార్థ చటర్జీ ఫోన్ నుంచి ఎలాంటి కాల్స్ రాలేదని పేర్కొంది.
చదవండి: రాజ్యసభ సీటు కావాలా? గవర్నర్ పదవి కావాలా? రూ.100 కోట్లివ్వు పని అయిపోద్ది..!
Comments
Please login to add a commentAdd a comment