![Mumbai Report: Booming Real Estate Business Increased Luxury Flats Sale - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/23/real.jpg.webp?itok=pKO4Liqn)
సాక్షి, ముంబై: కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన లాక్‌డౌన్ వల్ల చిన్నా చితకా వ్యాపారులతో పాటు బడా వ్యాపారులు కూడా ఆర్థికంగా నష్టపోయారు. అయితే, కరోనా గడ్డు కాలంలో సైతం రియల్ ఇస్టేట్ రంగం ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ముంబైలో గడచిన ఆరు నెలల కాలంలో లగ్జరీ ఫ్లాట్ల విక్రయం గణనీయంగా పెరిగింది. నగరంలో రూ. 15 నుంచి రూ. 100 కోట్లు విలువ చేసే లగ్జరీ ఫాట్ల విక్రయం వల్ల ఏకంగా రూ. 4 వేల కోట్లకుపైగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు స్క్వేర్ యార్డ్స్ నివేదిక వెలుగులోకి తెచ్చింది. ఈ నివేదికలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఎన్ని లగ్జరీ ఫ్లాట్లు అమ్ముడుపోయాయనే దానిపై అధ్యయనం చేసి ఆ వివరాలను పొందుపరిచారు. కరోనా కాలంలో స్తంభించిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మళ్లీ ఊపందుకునేలా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
అందులో భాగంగానే స్టాంప్ డ్యూటీలో రాయితీ ప్రకటించింది. మార్చి 31 వరకు కొనుగోలుదారులు కేవలం రెండు శాతం స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీన్ని అదనుగా చేసుకున్న అనేక మంది లగ్జరీ ఫ్లాట్లను కొనుగోలు చేశారు. మొత్తం 60 శాతం ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు మార్చి 31కి ముందే జరిగాయి. ముఖ్యంగా సాధారణ ఫ్లాట్లతో పోలిస్తే లగ్జరీ ఫ్లాట్లకే ఎక్కువ ఆసక్తి కనబర్చినట్లు రిజిస్ట్రేషన్ల సరళిని బట్టి తెలిసింది. ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో అత్యధిక శాతం లగ్జరీ ఫ్లాట్ల విక్రయాలు జరిగాయి. మొత్తం లావాదేవీల్లో 60 శాతం లోయర్ పరేల్‌లోనే జరిగినట్లు స్క్వేర్ యార్డ్స్ నివేదికలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment