మౌలికానికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అండ
న్యూఢిల్లీ: దేశీ మౌలిక రంగానికి అవసరమైన నిధులను అందించేందుకు వీలుగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఇన్‌ఫ్రా డెట్ ఫండ్(ఐఐడీఎఫ్) ఐదు సాధారణ బీమా ప్రభుత్వ రంగ సంస్థలతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. దీనిలో భాగంగా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఐడీఎఫ్‌తో కలసి దేశీయంగా మౌలిక రంగ అభివృద్ధికి కృషి చేస్తాయని ఆర్థిక శాఖ పేర్కొంది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ సమక్షంలో ఎంవోయూపై ఆయా కంపెనీల సీఈవోలు సంతకాలు చేశారు.
ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లకు అవసరమయ్యే నిధులను చౌకగా సమీకరించేందుకు ఈ కొత్తతరహా విధానం ఉపయోగపడుతుందని మాయారామ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎంవోయూ కుదుర్చుకున్న ప్రతీ సంస్థా 20% వరకూ నిధులను(కార్పస్) సమకూర్చనున్నట్లు తెలిపారు. ఇకపై ఇన్‌ఫ్రా నిధుల సమీకరణలో బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ కీలకంగా నిలిచే అవకాశమున్నదని తెలిపారు. ఇప్పటికే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో ప్రభుత్వ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ రూ. 125 కోట్లను ఇన్వెస్ట్ చేసింది.