రూ.15.2 లక్షల కోట్లు..! | Image for the news result PM Modi's 'Make In India' Racks Up $222 Billion in Pledges | Sakshi
Sakshi News home page

రూ.15.2 లక్షల కోట్లు..!

Published Fri, Feb 19 2016 12:47 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

రూ.15.2 లక్షల కోట్లు..! - Sakshi

రూ.15.2 లక్షల కోట్లు..!

మేక్ ఇన్ ఇండియా వీక్‌లో పెట్టుబడి ప్రతిపాదనలు ఇవి...
విజయవంతంగా ముగిసిన కార్యక్రమం ఇందులో అత్యధికంగా
మహారాష్ట్రకు రూ. 8 లక్షల కోట్లు...
డీఐపీపీ కార్యదర్శి అమితాబ్ కాంత్ వెల్లడి

ముంబై: తయారీ రంగంలో భారత్‌ను ప్రపంచ హబ్‌గా తయారు చేయాలన్న సంకల్పంతో ప్రధాన మంత్రి మోదీ తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా వీక్ దిగ్విజయంగా ముగిసింది. వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి రూ.15.2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వెల్లువెత్తాయని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) కార్యదర్శి అమితాబ్ కాంత్ గురువారం చెప్పారు. ‘వివిధ రంగాల కంపెనీలు పాల్గొన్న తొలి మేక్ ఇన్ ఇండియా వీక్ విజయవంతమైంది. ఈ సదస్సు ద్వారా భారత్‌లో పెట్టుబడులకు అత్యంత అనువైన వాతావరణం ఉందన్న నమ్మకాన్ని అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో కలిగించాం.

మొత్తం రూ.15.2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు హామీ లభించగా... ఇందులో ఆతిథ్య రాష్ట్రమైన మహారాష్ట్రకే రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో భారత్‌కు మహారాష్ట్ర ఒక గేట్‌వేగా మారనుంది. ఇక మొత్తం పెట్టుబడి హామీల్లో 30 శాతం విదేశీ కంపెనీలకు చెందినవి. ఇప్పటికే దేశంలోని వివిధ పారిశ్రామిక, వ్యాపార రంగాల్లోకి విదేశీ పెట్టుబడులకు వీలుగా ద్వారాలు తెరిచాం. ఇప్పుడు తయారీ రంగాన్ని ఆయా రంగాలతో అనుసంధానం చేయడంపై దృషి ్టపెట్టాం. ఈ సదస్సు ఒక్క తయారీ రంగానికే పరిమితం కాదు. నవకల్పనలు, ఇన్వెస్టర్లను ఆకర్షించడం లక్ష్యంగా దీన్ని నిర్వహించాం’ అని కాంత్ వివరించారు.

 ప్రచారానికే రూ.100 కోట్లు!
ఈ నెల 13న ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ మేక్ ఇన్ ఇండియా వీక్ ప్రచారం, మార్కెటింగ్ కోసం ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు అంచనా. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 16-17 శాతంగా ఉన్న తయారీ రంగం వాటాను రానున్న దశాబ్ద కాలంలో 25 శాతానికి చేర్చడమే లక్ష్యంగా మేక్ ఇన్ ఇండియాకు మోదీ శ్రీకారం చుట్టారు. తద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. జీడీపీలో 60 శాతం వాటా ఉన్న సేవల రంగంపైనే దేశ ఆర్థిక వ్యవస్థ చాన్నాళ్లుగా ఆధారపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా, కార్పొరేట్ ఇండియాతో పాటు అంతర్జాతీయ కంపెనీలు దీన్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నప్పటికీ... నిర్వహణలో అక్కడక్కడా కొన్ని లోటుపాట్లు దొర్లాయని కాంత్ చెప్పారు. ముఖ్యంగా డీఐపీపీ, పీఐబీతో పాటు భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) మధ్య సరిగ్గా సమన్వయం కుదరలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈశాన్య రాష్ట్రాల ప్రాతినిధ్యం కూడా స్వల్పంగానే ఉందని కాంత్ వెల్లడించారు.

 2,500 విదేశీ, 8,000 దేశీ కంపెనీలు...
తొలి మేక్ ఇన్ ఇండియా వీక్‌లో 2,500కు పైగా విదేశీ, 8,000 దేశీయ కంపెనీలు పాల్గొన్నాయి. అంతేకాకుండా 68 దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధి బృందాలు, 72 దేశాలకు చెందిన వ్యాపార బృందాలు హాజరయ్యాయి. ప్రధాని మోదీ పాల్గొన్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్వీడన్, ఫిన్లాండ్‌ల ప్రధాన మంత్రులతో పాటు పోలండ్ డిప్యూటీ ప్రధాని, ఇతరత్రా విదేశాంగ మంత్రులు కూడా హాజరయ్యారు. మొత్తం 17 రాష్ట్రాలు(అత్యధికంగా బీజేపీ పాలిత రాష్ట్రాలే) పాలుపంచుకున్నాయి. వారం మొత్తంలో 50కి పైగా సెమినార్లు జరిగాయి.

క్యూప్రైజ్ గెలుచుకున్న ‘ఆర్క్ రోబో’ క్వాల్‌క్వామ్ నుంచి రూ. 2 కోట్ల నిధులు
ముంబై: మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీలో వేర్‌హౌస్ ఆటోమేషన్ స్టార్టప్ సంస్థ ఆర్క్ రోబో... క్యూప్రైజ్‌ను గెలుచుకుంది. డీఐపీపీ, చిప్ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్ ఇంక్‌లు సంయుక్తంగా ఆర్క్ రోబోను గురువారం విజేతగా ప్రకటించాయి. దీంతో క్వాల్‌కామ్ నుంచి 3,50,000 డాలర్ల(దాదాపు రూ.2 కోట్లు) ఈక్విటీ పెట్టుబడులను ఆర్క్‌రోబో అందుకోనుంది. గతేడాది ప్రధాని మోదీ సిలికాన్ వ్యాలీ పర్యటన సందర్భంగా తాము భారత్‌లో 15 కోట్ల డాలర్ల పెట్టుబడులకు హామీనిచ్చామని.. ఇందుభాగంగానే ఈ పోటీ విజేతకు నిధులను అందిస్తున్నట్లు క్వాల్‌కామ్ వెంచర్స్ వైస్ ప్రెసిడెంట్ కార్తీ మాదసామి పేర్కొన్నారు. ఇండియా ఫండ్ ద్వారా ఇప్పటికి తాము మూడు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టామని.. ఆర్క్‌రోబో నాలుగోదని ఆయన వివరించారు. ఈ పోటీ రేసులో దాదాపు 500 స్టార్టప్స్ తలపడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement