రేట్ల కోత ఆశలతో..
రికార్డ్ స్థాయికి క్షీణించిన టోకు ద్రవ్యోల్బణం
- అంచనాలను మించిన పారిశ్రామికోత్పత్తి
- రెండు వారాల గరిష్టానికి స్టాక్ సూచీలు
- 246 పాయింట్ల లాభంతో 25,857కు సెన్సెక్స్
- 83 పాయింట్ల లాభంతో 7,872కు నిఫ్టీ
రేట్ల కోత ఆశలతో వారం ప్రారంభ రోజైన సోమవారం స్టాక్ మార్కెట్ శుభారంభం చేసింది. ఆగస్టులో టోకు ధరల ద్రవ్యోల్బణం మరింత తగ్గడం, జూలై పారిశ్రామికోత్పత్తి గణాంకాలు అంచనాలను మించిడంతో ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందనే అంచనాలతో రెండు వరుస ట్రేడింగ్ సెషన్‌ల నష్టాలకు బ్రేక్ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 246 పాయింట్లు లాభంతో 25,857 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 7,872 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు, నిఫ్టీకి కూడా ఇది రెండు వారాల గరిష్ట స్థాయి. బ్యాంక్, లోహ, విద్యుత్తు, , పీఎస్‌యూ, రియల్టీ షేర్లు పెరిగాయి. వినియోగవస్తువుల సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి.
బ్యాంక్ షేర్ల ర్యాలీ: కీలక రేట్ల కోత ఆశలతో బ్యాంక్ షేర్లు పెరిగాయి. కాగా సోమవారం ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల అధిపతులతో జరిగే సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ విద్యుత్ రంగ రుణ సమస్యపై ఒక ప్యాకేజీని ప్రకటించే అవకాశముందన్న వార్త కూడా బ్యాంక్ షేర్ల పెరుగుదలకు ఒక కారణమైంది. విద్యుత్ రంగ సంస్థలకు బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.53,000 కోట్లుగా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1-3 శాతం రేంజ్‌లో పెరిగాయి. దిగుమతయ్యే ఉక్కు ఉత్పత్తులపై 20 శాతం సుంకం విధించడానికి ప్రభుత్వం యోచిస్తుందన్న వార్తల కారణంగా లోహ షేర్లు-టాటా స్టీల్, వేదాంత, హిందాల్కో 3.5-4 శాతం రేంజ్‌లో పెరిగాయి. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ వార్తలను ప్రభుత్వం ద్రువీకరించింది. 30 సెన్సెక్స్ షేర్లలో 28 షేర్లూ లాభాల్లోనే ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.1,978 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈలో రూ.12,444 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,57,528 కోట్లుగా నమోదైంది.
దివీస్ ల్యాబరేటరీస్
బోనస్ షేర్లకు రికార్డు తేదీని సెప్టెంబర్ 26గా నిర్ణయించింది.