
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : వేతన జీవులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే తుది గడువును పొడిగించింది. ఆగస్టు 31 వరకు ఈ తుది గడువును పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ‘ఈ విషయాన్ని పరిశీలించిన మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే తుది గడువును 2018 జూలై 31 నుంచి 2018 ఆగస్టు 31కు పొడిగించడం జరిగింది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. కాగ, గత అసెస్‌మెంట్ ఇయర్ చివరి వరకు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడంలో జాప్యం చేస్తే ఎలాంటి జరిమానా ఉండేది కాదు. కానీ 2018-19 అసెస్‌మెంట్ ఇయర్‌లో జరిమానాలు విధించడం ప్రారంభించారు.
ఆదాయపు పన్ను చట్టంలో కొత్త సెక్షన్ 234ఎఫ్ ను జత చేర్చారు. దీంతో సెక్షన్ 139(1)లో నిర్దేశించిన తుది గడువుల అనంతరం ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేస్తే రూ.10వేల జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటోంది. అయితే 2017-18 ఆర్థిక సంవత్సరపు పన్ను రిటర్నులను 2018 జూలై 31 తర్వాత, 2018 డిసెంబర్ 31కు ముందు దాఖలు చేస్తే పన్ను చెల్లింపుదారులు కేవలం 5000 రూపాయల జరిమానా మాత్రమే ఎదుర్కోవాల్సి వస్తుందని, ఒకవేళ 2019 జనవరి 1 తర్వాత దాఖలు చేస్తే, ఈ జరిమానా రూ.10వేలకు పెరుగుతుందని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉండే, ఈ జరిమానా మొత్తం వెయ్యి రూపాయలను మించదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment