సులువుగా ఆన్‌లైన్ రిటర్నులు
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ (జూలై 31) దగ్గరపడుతోంది. సాధారణంగా పన్ను చెల్లింపుదారులు చాలా మంది.. రిటర్నులు దాఖలు చేసే సమయం దగ్గరపడే వరకు దానిపై పెద్దగా దృష్టి పెట్టరు. తీరా చివరి నిమిషంలో ఆదరాబాదరాగా పరిగెడతారు. సీఏల చుట్టూ తిరుగుతారు. ఇలా పరుగెత్తాల్సిన అవసరం లేకుండా ఇంటి దగ్గర్నుంచే ఆన్‌లైన్లో దాఖలు చేసే సౌకర్యాన్ని కల్పిస్తూ పలు వెబ్‌సైట్లు అందుబాటులోకి వచ్చాయి. అలాంటివాటిలో కొన్ని ఇవి..
క్లియర్ ట్యాక్స్: ఈ వెబ్‌సైటు చూడటానికి ఇంపుగా ఉండటంతో పాటు ఫైలింగ్ ప్రక్రియ సులభతరంగా ఉంటుంది. మ్యాన్యువల్‌గా ఫైల్ చేయాలనుకుంటే నారింజ రంగు బటన్ ఎంచుకోవాలి. అదే ఫారం16ని స్కాన్‌చే సి, ఆటోమేటిక్‌గా వివరాలను పొందుపర్చాలంటే ఆకుపచ్చ రంగు బటన్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ సైట్లో ముందుగా మన పేరు, పాన్ నంబరు, చిరునామా తదితర వివరాలతో అకౌంటు తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఉచితమే. ఒకవేళ చార్టర్డ్ అకౌంట్ సాయం కావాలనుకుంటే ఈ సర్వీసు చార్జీలు రూ. 499 నుంచి ఉంటాయి.
హెచ్ అండ్ ఆర్ బ్లాక్: క్లియర్‌ట్యాక్స్ లాగా ఇది కూడా ఉచితమైనదే. ఫ్రీ సర్వీసులో కూడా కావాలంటే సహకారం అందించేందుకు ఏజెంట్లు ఉంటారు. రిటర్న్ ఫారంలను సీఏలు పరిశీలించాలంటే రూ. 499, సీఏలే రిటర్నులను రూపొందించాలంటే రూ. 999 మేర చార్జీలు ఉంటాయి.
ట్యాక్స్‌స్మైల్: వెబ్‌సైట్లో వివిధ విభాగాలు ఒకదాని పక్కన మరొకటి పేర్చేసినట్లు ఉన్నా.. గందరగోళం మాత్రం ఉండదు. రూ. 5 లక్షల దాకా ఆదాయ ఉన్న వారు ఈ సైటు నుంచి ఉచితంగా రిటర్నులు దాఖలు చేయొచ్చు. పెద్దగా ఇతరత్రా సహాయం లేకుండా వివరాలన్నీ మీరే నింపాల్సి వస్తుంది. మిగతా వాటితో పోలిస్తే ఇదే ఈ సైటులో కాస్తంత ఇబ్బందికరమైన విషయం. అదే రూ. 500 కట్టి, ఫారం 16ని అప్‌లోడ్ చేస్తే.. ఫైలింగ్ పనిని ట్యాక్స్‌స్మైలే చూసుకుంటుంది.
ట్యాక్స్‌స్పానర్: మిగతా మూడు వెబ్‌సైట్లలో ఉచిత సర్వీసులు ఉండగా.. ఇందులో మాత్రం అంతా పెయిడ్ సర్వీసులే. ఒకవేళ మీ ఫారం 16 వివరాలు మీ అంతట మీరే నింపి, రిటర్నులు దాఖలు చేసినా కూడా రూ. 449 కట్టాల్సి ఉంటుంది. మిగతా వాటితో పోలిస్తే ఇందులో ప్రతికూల అంశం ఇదే. అయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాలు ఉన్న వారికి దాదాపు 50% డిస్కౌంటు లభిస్తుంది. వెబ్‌సైటులో ఫైలింగ్ ప్రక్రియ మాత్రం సులువుగా ఉంటుంది. ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, వ్యాపార సంస్థలకు వార్షిక సబ్‌స్క్రిప్షన్ చార్జీలు రూ. 1,499 నుంచి ఉన్నాయి.