ఆరోగ్య బీమాపై అవగాహన పెరుగుతోంది
* రూ. 50 లక్షల హెల్త్ పాలసీలు కూడా తీసుకుంటున్నారు
* సగటు సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షల స్థాయిలో ఉంటోంది
ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి అవగాహన పెరుగుతోందని, దీంతో పాలసీదారులు ఎంచుకునే కవరేజీ సగటున రూ.4-5 లక్షల స్థాయికి చేరిందని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ అండర్‌రైటింగ్ విభాగం అధిపతి అమిత్ భండారీ చెప్పారు. మెట్రో నగరాల్లో రూ. 50 లక్షల పాలసీలూ తీసుకుంటున్న వారు కూడా ఉన్నారని చెప్పారాయన. పాలసీదారులకు ప్రయోజనకరంగా ఉండేలా మరిన్ని సేవలు ప్రవేశపెడుతున్నామని ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇంటర్వ్యూలో ఏమన్నారంటే...
అధిక కవరేజీపై పెరుగుతున్న ఆసక్తి..
దేశీయంగా ప్రైవేట్ బీమా పాలసీలు తీసుకునేవారు 5 శాతమే ఉంటున్నారు. ఆరోగ్యశ్రీ.. బీమా సురక్ష యోజన మొదలైన ప్రభుత్వపరమైన పథకాలతో కలిపితే ఇది సుమారు 20 శాతం మేర ఉంటుంది. అయితే, ఆరోగ్య బీమాపై ప్రస్తుతం అవగాహన పెరుగుతోంది. గడిచిన ఐదారేళ్లలో గణనీయమైన మార్పులొచ్చాయి. అప్పట్లో సగటున సమ్ అష్యూర్డ్ సుమారు రూ.3 లక్షలుంటే ఇపుడది రూ. 4- 5 లక్షలుంటోంది.
మెట్రో నగరాల్లోనైతే కొందరు రూ. 50 లక్షల కవరేజీ కూడా తీసుకుంటున్నారు. అలాగే వినూత్నమైన పాలసీలూ కోరుకుంటున్నారు. ప్రివెంటివ్, ఓపీడీ కవరేజీ లాంటి వాటి గురించి అడుగుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు పాలసీ ప్రీమియాల్లో డిస్కౌంట్లు అడుగుతున్నారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో పాలసీదారులు తీసుకునే కవరేజి మొత్తం కాస్త తక్కువగా ఉంటోంది. బహుశా దక్షిణాదిలో చికిత్స ఖర్చు కొంత తక్కువగా ఉండటం కారణం కావొచ్చు.
వినూత్న పాలసీలు..: పాలసీదార్ల డిమాండ్లకు అనుగుణంగా మేం వినూత్న ఆప్షన్లూ ఇస్తున్నాం. పూర్తి స్థాయి హెల్త్ ఇన్సూరెన్స్ పథకంతో పాటు ఇటీవలే హెల్త్ బూస్టర్‌ను కూడా ప్రవేశపెట్టాం. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించే వారికి నిర్దిష్ట రివార్డ్ పాయింట్లు ఇచ్చి, ఆ మేరకు డిస్కౌంట్లు లేదా అధిక కవరేజీని అందిస్తున్నాం. వివిధ అంశాలను బట్టి మొత్తం 8,000-10,000 దాకా పాయింట్లు కేటాయించాం.
ఉదాహరణకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మారథాన్‌లలో పాల్గొనడం మొదలైన వాటికి నిర్దిష్ట పాయింట్లుంటాయి. ఒకో పాయింటు విలువ సుమారు పావలా. ఎనిమిది వేల పాయింట్లూ లభిస్తే సుమారు రూ.2,000 మేర డిస్కౌంటు ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటించే వారికిది ప్రోత్సాహమే.
పాలసీదారులకు ప్రయోజనకరంగా మరిన్ని సేవలు ..
మా నెట్‌వర్క్‌లో సుమారు 2,500 పైగా ఆస్పత్రులున్నాయి. పాలసీదారులు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ వారికి మరిన్ని ఆప్షన్లుండేలా చూడాలన్నది మా ఉద్దేశం. ఇక బేస్ పాలసీతో పాటు క్రిటికల్ ఇల్‌నెస్ మొదలైన వాటన్నింటితో కలిపి చూస్తే సుమారు 10 వరకూ పాలసీలు అందిస్తున్నాం. అధిక చికిత్సా వ్యయాలపై ఆస్పత్రులతో బీమా సంస్థలు చర్చించిన మీదట... నగదు చెల్లించేవారితో పోలిస్తే పాలసీదార్లకు సుమారు 10- 15 శాతం దాకా ఆస్పత్రి వ్యయాలు తగ్గుతున్నాయి. చిన్న ఆస్పత్రులైతే ఈ తగ్గుదల 25 శాతం దాకా కూడా ఉండొచ్చు.
మా సంస్థపరంగా స్థానికంగా అందుబాటులో ఉండే వివిధ ఆస్పత్రుల్లో చికిత్స వ్యయాలు, మౌలిక సదుపాయాలు, చికిత్స నాణ్యత తదితర అంశాలను పోల్చి చూసుకునేందుకు ప్రత్యేకంగా హెల్త్ అడ్వైజర్ ప్లాట్‌ఫాంను కూడా అందుబాటులోకి తెచ్చాం. హైదరాబాద్‌లో దాదాపు 140 పైగా ఆస్పత్రులను, 30 పైగా కీలక చికిత్సలను ఇందులో చేర్చాం. మా పాలసీదారులే కాకుండా మిగతావారు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
ఈ-కామర్స్ సైట్లలో హెల్త్ పాలసీలు..
ఈ-కామర్స్ సైట్లలో బీమా పాలసీల విక్రయమనేది తక్షణమే రాకపోవచ్చు. ఎందుకంటే మిగతా రకాల పాలసీలతో పోలిస్తే హెల్త్ పాలసీ అండర్‌రైటింగ్ చేయాలంటే సదరు వ్యక్తి ఆరోగ్య సమస్యలు (డయాబెటిస్ వంటివి) తెలిస్తేనే సాధ్యం. వాహనాల పాలసీల్లాగా వీటిని ఆన్‌లైన్‌లో ఆషామాషీగా జారీచేయడం కుదరదు. బహుశా మిగతా రకాల పథకాలు వచ్చిన కొన్నాళ్లకు హెల్త్ పాలసీలూ ఈ-కామర్స్ సైట్లలోకి రావొచ్చు. అది కూడా స్టాండర్డ్ పథకంగా పలు పరిమితులతో ఉండొచ్చు.
- అమిత్ భండారీ
ఐసీఐసీఐ లాంబార్డ్ హెల్త్ అండర్‌రైటింగ్ విభాగం హెడ్