
బ్యాంకింగ్‌లో వృత్తినైపుణ్యం పెంచుతున్నాం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల యాజమాన్యాన్ని వృత్తినైపుణ్యం కలిగినవిగా తీర్చిదిద్దే చర్యలు చేపడుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో ఇండియన్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఓ సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘కొన్ని బ్యాంకుల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి నుంచి గుణపాఠం నేర్చుకున్నాం. ఇవి పునరావృతం కావు. బ్యాంకుల్లో పటిష్టమైన రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ ఉండాలి.
అందుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది...’ అని ఆయన చెప్పారు. కంపెనీల రుణపరిమితి పెంచేందుకు రూ.50 లక్షలు లంచం తీసుకుంటూ సిండికేట్ బ్యాంక్ సీఎండీ ఎస్.కె.జైన్ ఇటీవలే అరెస్టైన సంగతి తెలిసింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, దేనా బ్యాంక్‌లకు చెందిన కొందరు అధికారులు రూ.436 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను దుర్వినియోగం చేసినట్లు బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతాల నేపథ్యంలో ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యాజమాన్యంలో వృత్తినైపుణ్యం పెంచితే బ్యాంకింగ్ వ్యవస్థ విశ్వసనీయత మెరుగుపడుతుందని జైట్లీ తెలిపారు.
28న జన ధన యోజన...
మారుమూల పల్లెలకు సైతం బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడాన్ని (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) ప్రస్తావిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 28 జన ధన యోజనను ప్రారంభిస్తారని జైట్లీ చెప్పారు. ముఖ్యమంత్రులు, పార్లమెంటు సభ్యులు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ‘ప్రధానమంత్రి జన ధన యోజన’లో భాగంగా ఖాతాదారులకు డెబిట్ కార్డు, లక్ష రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తారనీ, ఇప్పటివరకు బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందనీ తెలిపారు.