ఆర్థిక బంధం మరింత బలపడాలి...
నేపిడా (మయన్మార్): భారత్-ఆసియాన్ దేశాలు గొప్ప భాగస్వాములుగా ఉండడానికి తగిన అన్ని అవకాశాలూ ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం పేర్కొన్నారు. మయన్మార్ రాజధాని నేపిడాలో జరిగిన 12వ భారత్-ఆసియాన్ సదస్సులో ఆయన బుధవారం హిందీలో ప్రసంగించారు. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి, వాణిజ్య రంగాలకు సంబంధించి భారత్‌లో కొత్త శకం ప్రారంభమైందని ఆసియాన్ దేశాధినేతలకు వివరించారు.
ఆయా రంగాల అభివృద్ధిలో పరస్పర సహకారానికి భారత్‌తో భాగస్వాములుగా 10 దేశాల ఆగ్నేయాసియా దేశాల సంఘం- ఆసియాన్ ఉండవచ్చని పేర్కొన్నారు. ఆసియాన్ దేశాలతో భారత్ తన సంబంధాలను పటిష్ట పరచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ‘వాణిజ్యం, సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి మన మధ్య ప్రాచీనకాలం నుంచీ సంబంధాలు ఉన్నాయి’ అన్నారు. ఈ సంబంధాలు ఆధునిక సంబంధాలకు పటిష్ట పునాదులుగా నిలుస్తున్నాయని వివరించారు.
భారత్ ‘లుక్ ఈస్ట్ పాలసీ’లో ఆసియాన్‌కు ముఖ్య ప్రాధాన్యత ఉంటుందన్నారు. ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’గా దీనిని మోదీ పేర్కొన్నారు. సముద్ర జలాలు, సరిహద్దులకు సంబంధించి అన్ని దేశాలు అంతర్జాతీయ నియమ, నిబంధలను పాటించాలని, ఈ బాధ్యత అన్ని దేశాలపై ఉంటుందని అన్నారు. ఆయా అంశాలకు సంబంధించి కొన్ని ఆగ్నేయాసియా దేశాలు-చైనా మధ్య ఇటీవల వివాదాలు తలెత్తిన నేపథ్యంలో మోదీ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
మలేషియా కంపెనీలకు ఆహ్వానం...
భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని మలేషియా కంపెనీలను మోదీ ఆహ్వానించారు. భారత్‌లో వాణిజ్యానికి ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. అంతకుముందు ఆయన భారత్-ఆసియాన్ సదస్సులో భాగంగా మయన్మార్ ప్రధాని నజీబ్ రజాక్‌తో ఇంటర్నేషనల్ కన్వెక్షన్ సెంటర్‌లో సమావేశమయ్యారు. వాణిజ్య, ఆర్థిక సంబంధాల పటిష్టతకు సంబంధించి తమతమ దేశాల్లో పర్యటించాలని పరస్పరం ఇరువురు ప్రధానులూ ఈ సందర్భంగా ఆహ్వానించుకున్నారు.
‘మేక్ ఇన్ ఇండియా’ బాగుంది: థాయ్
థాయ్ ప్రధాని ప్రయూత్ ఛోన్-ఓ-ఛాతో కూడా ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ఈ ఆలోచన తమ దేశానికీ ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగిస్తోందన్నారు. కాగా మోడీ తన పర్యటనలో భాగంగా మయన్మార్ ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమ నాయకురాలు అంగ్ సాన్ సూకియాతో కూడా సమావేశమయ్యారు.
ఆసియాన్ సదస్సు అనంతరం మోదీ 13న జరగనున్న తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. తరువాత ఈ నెల 15-16 తేదీల్లో ఆస్ట్రేలియాలోని బ్రిస్సేన్‌లో నిర్వహించనున్న జీ-20 దేశాల సదస్సులో పాల్గొంటారు. ఈ మూడు సదస్సుల సందర్బంగా ఆయన దాదాపు 40 మందికి పైగా అంతర్జాతీయ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారు. కాగా జీ-20 సదస్సు సందర్భంగా ఆర్థిక, వాణిజ్య అభివృద్ధికి సంబంధించి మోదీ అత్యద్భుతమైన సూచనలు, సలహాలు అందించగలరన్న విశ్వాసాన్ని ఆస్ట్రేలియా హై కమిషనర్ ప్యాట్రిక్ సుక్లింగ్ న్యూఢిల్లీలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.