న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన, శక్తిమంతమైన 2,000 కంపెనీల జాబితాలో భారత్‌కి చెందిన 56 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. 2015 సంవత్సరానికి గాను ‘గ్లోబల్ 2000’ పేరిట ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ లిస్టును విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా, చైనా కంపెనీల ఆధిపత్యాన్ని ప్రతిబింబించే విధంగా ఇది ఉంది. ఈ రెండు దేశాలకే చెందిన సంస్థలు వరుసగా రెండో ఏడాదీ టాప్ టెన్‌లో నిల్చాయి. మొత్తం 579 కంపెనీలతో అమెరికా, 232 భారీ సంస్థలతో చైనా వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నాయి.
జపాన్‌ను చైనా అధిగమించడం ఇదే తొలిసారి. 218 కంపెనీలతో జపాన్ మూడో స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే భారత్ లిస్టులో మరో రెండు కంపెనీలు కొత్తగా జతయ్యాయి. 42.9 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ గల రిలయన్స్ ఇండస్ట్రీస్ గతేడాది 135వ స్థానంలో ఉండగా ఈసారి 142వ స్థానానికి తగ్గింది. 33 బిలియన్ డాలర్ల మార్కెట్ వేల్యూతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ 152వ స్థానంలో ఉంది. ఓఎన్‌జీసీ (183), టాటా మోటార్స్ (263), ఐసీఐసీఐ బ్యాంక్ (283), ఇండియన్ ఆయిల్ (349) మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి.
ఫోర్బ్స్ జాబితాలో మనవి 56 కంపెనీలు
Published Fri, May 8 2015 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement
Advertisement