వాషింగ్టన్: ప్రపంచంలోనే భారత్ వేగవంతమైన వృద్ధిని నమోదుచేసుకుంటోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. అయితే వేగవంతమైన వృద్ధే అయినప్పటికీ, అంత భారీగా ఏమీ లేదని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తన తాజా అవుట్‌లుక్‌లో పేర్కొంది. 2019–2020 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలను 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది. ఊహించినదానికన్నా బలహీనమైన ఆర్థిక పరిస్థితులు దీనికి కారణంగా పేర్కొంది. భారత్ ఆర్థిక వ్యవస్థ గురించి ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గ్యారీ రైస్ వివరించిన అంశాలను, ఫిచ్ తాజా అవుట్‌లుక్‌ను క్లుప్తంగా చూస్తే...
మరిన్ని సంస్కరణలు అవసరం: ఐఎంఎఫ్
►గడచిన ఐదు సంవత్సరాలుగా భారత్ పలు ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చింది. మరిన్ని సంస్కరణలనూ తీసుకురావాల్సి ఉంది. అధిక వృద్ధిరేటు పటిష్టతకు ఇది అవసరం.
► ఐదు సంవత్సరాలుగా సగటున భారత్ వృద్ధి రేటు 7 శాతంగా ఉంది.
► భారత్‌లో యువత ఎక్కువగా ఉండడం దేశానికి కలిసివస్తున్న మరో అంశం. దీనిని మరింత వ్యూహాత్మకంగా వినియోగించుకోవాల్సి ఉంది.
► విధానపరమైన అంశాల్లో కొన్నింటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకుల మొండిబకాయిల సమస్య పరిష్కారం, కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ పరిస్థితుల మెరుగునకు చర్యలు, కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ద్రవ్యోల్బణం కట్టుతప్పకుండా చూడ్డం, అలాగే కార్మిక, భూ సంస్కరణల చర్యలు, వ్యాపార నిర్వహణా అంశాలను మరింత సులభతరం చేయడం ఇందులో ఉన్నాయి.
► వచ్చే నెల్లో ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ స్ప్రింగ్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈఓ) సర్వే నివేదిక విడుదలకానుంది. ఈ నివేదికలో భారత్ ఆర్థిక వ్యవస్థ గురించి మరిన్ని అంశాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్‌గా ఉన్న ఇండియన్ అమెరికన్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ నేతృత్వంలో ఈ నివేదిక రూపొందుతుండడం గమనార్హం.
వృద్ధి అంచనాల కోత: ఫిచ్
► మందగమన ఆర్థిక పరిస్థితులు నెలకొన్నాయని రేటింగ్ దిగ్గజం ఫిచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో వృద్ధి అంచనాలకు కోత పెడుతున్నట్లూ తన అవుట్‌లుక్‌లో తెలిపింది. ముఖ్యాంశాలు చూస్తే...
► మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.2 శాతంగా తొలుత అంచనావేయడం జరిగింది. దీనిని 6.9 శాతానికి తగ్గిస్తున్నాం. కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనాలకన్నా (7 శాతం) ఈ రేటు తక్కువగా ఉండడం గమనార్హం.
►అలాగే 2019–2020 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 7 శాతంనుంచి 6.8 శాతానికి కోత. అయితే 2020–21ల్లో ఈ రేటు 7.1 శాతానికి పెరిగే వీలుంది. (2017–18లో భారత్ వృద్ధి రేటు 7.2 శాతం)
► తక్షణం వృద్ధి తగ్గిపోవడానికి తయారీ రంగంలో క్రియాశీలత లేకపోవడం కారణం. వ్యవసాయ రంగమూ పేలవంగానే ఉంది. దేశీయ అంశాలే దీనికి ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు.
► రుణ లభ్యత దేశంలో తగ్గింది. రుణం కోసం బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటోలు, ద్విచక్ర వాహనరంగాలు తీవ్ర ప్రతికూలతలను
ఎదుర్కొంటున్నాయి.
► ఇక ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం రైతుల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపింది.
► డాలర్ మారకంలో రూపాయిది బలహీన బాటే. 2018 డిసెంబర్‌లో ఇది 69.82గా ఉండవచ్చు. 2019 డిసెంబర్ నాటికి 72, 2020 డిసెంబర్‌కు 73ను తాకే అవకాశం ఉంది.
► ద్రవ్య, పరపతి విధానాలు వృద్ధికి స్నేహపూర్వకమైనవిగా ఉన్నాయి. వడ్డీరేట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరళతర విధానాలను అనుసరించే వీలుంది. 2019లో మరో పావుశాతం రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.50 శాతం) తగ్గే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడం, అంతర్జాతీయంగా సరళతర ద్రవ్య పరిస్థితులు ఈ అంచనాలకు కారణం.
► 2019లో చమురు ధరలు బ్యారల్‌కు సగటున 65 డాలర్లుగా ఉంటాయి. 2020లో 62.5 డాలర్లుగా ఉండే వీలుంది. 2018లో ఈ ధర 71.6 డాలర్లు.
ప్రపంచ వృద్ధి అంచనాలకూ కోత...
2018, 2019లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.3 శాతం, 3.1 శాతంగా ఉండే అవకాశం ఉందన్న తొలి అంచనాలను వరుసగా 3.2 శాతం, 2.8 శాతానికి ఫిచ్ తగ్గించింది. చైనా వృద్ధి రేట్లు 2018, 2019ల్లో 6.6 శాతం, 6.1 శాతంగా ఉంటాయి.
వృద్ధి వేగం... అయినా 6.8 శాతమే!
Published Sat, Mar 23 2019 12:01 AM | Last Updated on Sat, Mar 23 2019 5:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment