ఏటా వెయ్యి మంది కొత్త సంపన్నులు
⇒ భారత్‌లో పెరుగుతున్న మిలియనీర్ల సంఖ్య
⇒ దేశీయంగా నాలుగో స్థానంలో హైదరాబాద్
⇒ నైట్ ఫ్రాంక్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయంగా మిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాబోయే దశాబ్దంలో ఏటా వెయ్యి మంది సంపన్నులు కొత్తగా మిలియనీర్ల జాబితాలో చేరనున్నారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ రూపొందించిన వెల్త్ రిపోర్ట్‌లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1.36 కోట్ల మంది మిలియనీర్లు ఉండగా.. అందులో రెండు శాతం మంది భారత్‌లో ఉన్నారు. అలాగే, 2,024 మంది బిలియనీర్లలో 5 శాతం మంది భారత్‌లో ఉన్నారు. గడిచిన రెండేళ్లలో (2015, 2016) అత్యంత సంపన్నుల సంఖ్య (యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) 12 శాతం పెరిగింది. వచ్చే దశాబ్ద కాలంలో ఇది 150 శాతం మేర పెరగనుందని నివేదిక వెల్లడించింది.
గడిచిన పదేళ్లలో దేశీయంగా అత్యంత సంపన్నుల జాబితాలో ఏటా కొత్తగా 500 మంది చేరారని నైట్ ఫ్రాంక్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ శమంతక్ దాస్ తెలిపారు. వచ్చే దశాబ్దంలో ఈ సంఖ్య రెట్టింపై 1,000కి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లోని 125 నగరాల్లో పెరుగుతున్న కుబేరుల సంఖ్యపై అధ్యయనం ఆధారంగా దీన్ని రూపొందించారు. అంతర్జాతీయంగా 900 మంది ప్రముఖ ప్రైవేట్ బ్యాంకర్లు, వెల్త్ అడ్వైజర్ల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్నారు. నివేదిక ప్రకారం గడిచిన దశాబ్ద కాలంలో భారత్‌లో కుబేరుల సంఖ్య ఏకంగా 290% ఎగిసింది. సంఖ్యాపరంగా యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐల వృద్ధి రేటు పరంగా భారత్ గతేడాది ఆరో స్థానంలో నిల్చింది. ఇదే వేగం కొనసాగితే వచ్చే దశాబ్దకాలంలో మూడో స్థానానికి చేరుతుందని సర్వే పేర్కొంది. నికరంగా 30 మిలియన్ డాలర్లు పైగా సంపద ఉన్న వారిని యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐలుగా నైట్ ఫ్రాంక్ వర్గీకరించింది.
దేశీయంగా టాప్ 4 నగరాలు..
నివేదిక ప్రకారం సంఖ్యాపరంగా అత్యధిక సంపన్నులతో దేశీయంగా ముంబై టాప్‌లో ఉంది. ముంబైలో మొత్తం 1,340 మంది యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐలు ఉన్నారు. తర్వాత స్థానాల్లో ఢిల్లీ (680), కోల్‌కతా (280), హైదరాబాద్ (260 మంది) ఉన్నాయి. నగర సంపద సూచీలో టొరంటో, వాషింగ్టన్ డీసీ, మాస్కోలను అధిగమించి ముంబై 21వ స్థానం దక్కించుకుంది. బ్యాంకాక్, సియాటిల్, జకార్తాల కన్నా ముందువరుసలో ఢిల్లీ 35వ స్థానంలో ఉంది.
’భవిష్యత్ సంపద’ విభాగంలో అంతర్జాతీయంగా టాప్ 40 నగరాల జాబితాలో ముంబై 11వ స్థానంలో ఉంది. షికాగో, సిడ్నీ, పారిస్, సియోల్, దుబాయ్‌లను అధిగమించింది. సంపన్న భారతీయులు రియల్టీలో పెట్టుబడులకు సంబంధించి ఆఫీస్ సెగ్మెంట్‌కి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం దేశీయంగా రెసిడెన్షియల్ మార్కెట్‌పై కొంత ఒత్తిడి నెలకొన్నప్పటికీ.. సంపన్న భారతీయుల్లో 40 శాతం మంది వచ్చే రెండేళ్లలో ఈ విభాగంలో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని శమంతక్ దాస్ తెలిపారు.