రెమిటెన్సుల్లో మనమే టాప్
2015లో 69 బిలియన్ డాలర్లు
వాషింగ్టన్: విదేశాల నుంచి వస్తున్న రెమిటెన్స్‌ల స్వీకరణలో భారత్.. ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. రెమిటెన్స్‌ల రూపంలో భారత్‌కు గతేడాది 69 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ మొత్తం 2014తో (70 బిలియన్ డాలర్లు) పోలిస్తే 1 బిలియన్ డాలర్లమేర తక్కువ (2.1 శాతం క్షీణత). రెమిటెన్స్‌లు తగ్గడం 2009 నుంచి చూస్తే ఇదే తొలిసారి. ఈ విషయాలను వరల్డ్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇక భారత్ తర్వాతి స్థానాల్లో చైనా (64 బిలియన్ డాలర్లు), ఫిలిప్పీన్స్ (28 బిలియన్ డాలర్లు), మెక్సికో (25 బిలియన్ డాలర్లు), నైజీరియా (21 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. విదేశాల్లో వృత్తి,ఉద్యోగాలు చేస్తున్న వారు అక్కడ సంపాదించిన డబ్బును స్వదేశానికి పంపే నగదును రెమిటెన్స్‌లుగా వ్యవహరిస్తారు. వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం.. మొత్తంగా చూస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలకు రెమిటెన్స్‌లు పెరిగాయి. 2014లో 430 బిలియన్ డాలర్లుగా రెమిటెన్స్‌లు గతేడాది 0.4 శాతం వృద్ధితో 431.6 బిలియన్ డాలర్లకు ఎగశాయి.