జపాన్‌ను అధిగమించనున్న ఇండియా
2023 నాటికి ఇన్‌ఫ్రా మార్కెట్‌పై అంచనా
న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ పరంగా చూస్తే భారత్ వచ్చే ఐదేళ్లలో జపాన్‌ను అధిగమిస్తుందని బీఎంఐ రీసెర్చ్ తన నివేదికలో అంచనా వేసింది. దీనికి పెద్ద పెద్ద రెసిడెన్షియల్, నాన్–రెసిడెన్షియల్ ప్రాజెక్టులు దోహదపడతాయని పేర్కొంది. భారత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ ప్రస్తుతం ఆసియాలోనే మూడో అతిపెద్దదని పేర్కొంది. 2023 నాటికి స్వల్ప తేడాతో జపాన్‌ను అధిగమించొచ్చని తెలిపింది. నిర్మాణ రంగంపై డీమోనిటైజేషన్ గతేడాది ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ మళ్లీ 2017లో బలమైన వృద్ధి నమోదుకానుందని వివరించింది.
భారతీయ ఇన్‌ఫ్రా రంగం అధిక వ్యయాలు, ప్రాజెక్టుల ఆలస్యం వంటి పలు సమస్యలతో సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొంది. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వల్ల భారత్‌లో మౌలిక సదుపాయాల లోటు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. ఇక రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, పవర్ ట్రాన్స్‌మిషన్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్‌మెంట్లకు డిమాండ్ పెరిగిందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పలు సంస్కరణలు ఇన్‌ఫ్రా రంగ వృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపింది.