జ్యూరిచ్/న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిపెట్టిన డిపాజిట్ల విలువ 2017లో 50 శాతం పెరిగి రూ.7,000 కోట్లకు చేరుకుంది. కేంద్రం చేపట్టిన నల్లధనం నియంత్రణ చర్యలతో మూడేళ్ల క్షీణత తర్వాత మళ్లీ డిపాజిట్లు పెరగడం ఆశ్చర్యకరమే. స్విస్ నేషనల్ బ్యాంకు (స్విట్జర్లాండ్‌లో కేంద్ర బ్యాంకు) గురువారం విడుదల చేసిన వార్షిక గణాంకాల ప్రకారం... ఆ దేశంలోని బ్యాంకుల్లో విదేశీ క్లయింట్ల డిపాజిట్ల విలువ 3 శాతం పెరిగి 1.46 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంక్‌లకు చేరింది.
అంటే మన కరెన్సీలో రూ.100 లక్షల కోట్లు. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2014లో 10 శాతం... 2015లో 50 శాతం... 2016లో 45 శాతం చొప్పున క్షీణించాయి. 2016లో డిపాజిట్లు రూ.4,500 కోట్లకు పరిమితమయ్యాయి. అయితే 2017లో ఇవి 999 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు చేరాయి. అంటే మన కరెన్సీలో రూ.6,891 కోట్లు. ఇక ట్రస్టీలు, వెల్త్ మేనేజర్ల ద్వారా కలిగి ఉన్న నిధులు రూ.112 కోట్లు. ఈ లెక్కన 2017లో డిపాజిట్లు 50 శాతం పెరిగినట్లు లెక్క. భారతీయులు ఇతర దేశాల్లోని సంస్థల ద్వారా స్విస్ బ్యాంకుల్లో కలిగి ఉన్న డిపాజిట్ల గణాంకాలు ఇందులో కలవలేదు.
2006లో గరిష్టంగా నిధులు
ఇక భారతీయుల నిధులు అధికంగా ఉన్న సంవత్సరం 2006. అప్పట్లో రూ.23,000 కోట్ల మేర భారతీయుల డిపాజిట్లు స్విస్ బ్యాంకుల్లో ఉన్నాయి. అప్పటి నుంచి చూస్తే మూడుసార్లే భారతీయుల డిపాజిట్లు పెరిగాయి. 2011లో 12 శాతం, 2013లో 43 శాతం, 2017లో 50 శాతం. నల్లధనం నియంత్రణకు గాను సమాచార పరస్పర మార్పిడికి భారత్, స్విట్జర్లాండ్ మధ్య నూతన మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తర్వాత విడుదలైన తొలి గణంకాలివి.
భారత్, ఇతర దేశాలతో సమాచార మార్పిడిని స్విట్జర్లాండ్ ఇప్పటికే ప్రారంభించింది కూడా. నల్లధనంపై భారత్ చేపడుతున్న చర్యల నేపథ్యంలో మరింత సహకారానికి కూడా అంగీకరించింది. అయితే, 2017కు ముందు మూడు సంవత్సరాల్లో భారతీయుల డిపాజిట్లు తగ్గడానికి కారణం, నల్లధనంపై అంతర్జాతీయంగా కఠిన చర్యల కారణంగా ఇతర దేశాలకు మళ్లించడమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
స్విస్ బ్యాంకులకు లాభాలే లాభాలు
స్విట్జర్లాండ్ బ్యాంకుల లాభాలు గతేడాది 25% పెరిగి 9.8 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు చేరాయి. 2016లో లాభాలు సగం తగ్గి 7.9 బిలియన్ డాలర్లకు పడిపోయాక తిరిగి పుంజుకున్నాయి. మొత్తం డిపాజిట్లు 1% పెరిగి 1.8 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంక్‌లుగా ఉన్నాయి.
ఇందులో 1.46 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంక్‌లు విదేశీయులవే. ముఖ్యంగా స్థానికుల డిపాజిట్లు 57.6 బిలియన్ ఫ్రాంక్‌ల మేర పెరిగాయి. మొత్తం 253 బ్యాంకుల్లో 229 లాభాల్లో నిలవగా, మిగిలినవి నష్టాలను ప్రకటించాయి. పెద్ద బ్యాంకులు తమ విదేశీ లావాదేవీలను స్విట్జర్లాండ్‌కు మళ్లించడం వృద్ధికి దోహదపడింది.
Comments
Please login to add a commentAdd a comment