మధ్య తరగతి ‘టేకాఫ్‌’ | India's domestic air passenger traffic up 25% in January | Sakshi
Sakshi News home page

మధ్య తరగతి ‘టేకాఫ్‌’

Published Wed, Jan 31 2018 12:46 AM | Last Updated on Wed, Jan 31 2018 8:09 AM

India's domestic air passenger traffic up 25% in January - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సమయం కలిసొస్తుంది! అందుబాటు ధరలూ ఉన్నాయి! ఇవే ఇపుడు విమాన ప్రయాణానికి ఇంధనంలా పనిచేస్తున్నాయి. ఈ ఏడాది దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య ఏకంగా 25% పెరిగి... 13 కోట్లకు చేరుతుందని విమానయాన శాఖ అంచనా వేస్తుండటం పరిశ్రమ పరుగుకు నిదర్శనం. ఒక దేశంలో అమ్ముడవుతున్న టికెట్ల పరంగా చూసినపుడు భారత్‌ టాప్‌–3లో నిలవటమే కాదు.. వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా, వృద్ధిలో అమెరికా, చైనాలనూ తలదన్నిందని ‘ఆర్థిక సర్వే’నే వెల్లడించింది.

ఆంక్షలు లేకుంటే..
దేశీయంగా సరే!! అంతర్జాతీయ సర్వీసుల విషయంలో అమలు చేస్తున్న ద్వైపాక్షిక ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేస్తే ట్రాఫిక్‌ వృద్ధి వచ్చే 3–5 ఏళ్లు ఏటా 15 శాతం దాటేస్తుందనే అంచనాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ ప్రయాణికులు 12 శాతం వృద్ధితో 6.5 కోట్లకు చేరవచ్చని, 2018–19లో 7.5 కోట్లను తాకవచ్చని అంచనాలున్నాయి. అంతేకాదు! 2018లో కనీసం మూడు భారతీయ సంస్థలు అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభిస్తాయని తెలుస్తోంది.

‘‘మన ఏవియేషన్‌ పరిశ్రమలో సంస్కరణలకు డీజీసీఏనే ప్రధాన అడ్డంకి. ఎందుకంటే డీజీసీఏ వద్ద వనరులు, నైపుణ్యం లేవు. యూకే మాదిరి భారత్‌లో స్వయం ప్రతిపత్తి కలిగిన సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ ఉండాలి’’ అని విమానయాన రంగ రీసెర్చ్‌ దిగ్గజం ‘కాపా’ దక్షిణాసియా సీఈవో కపిల్‌ కౌల్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. విమాన ఇంధన ధరలతో వృద్ధి స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని బోయింగ్‌ కమర్షియల్‌ ఎయిర్‌ప్లేన్స్‌ ఆసియా పసిఫిక్, ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దినేశ్‌ కేస్కర్‌ తెలియజేశారు.

దేశీయంగా పథకాల తోడు...
దేశీయ ప్రయాణాల్లో వృద్ధికి కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలూ కలిసొస్తున్నాయి. చిన్న పట్టణాలకు విమాన సౌకర్యం కలిగించేందుకు ఉద్దేశించిన ‘ఉడాన్‌’ పథకంలో భాగంగా ఇపుడు 17 చిన్న నగరాలకు విమానాలు తిరుగుతున్నాయి. ట్రూజెట్, ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ డెక్కన్, స్పైస్‌జెట్‌ ఈ పథకం కింద సర్వీసులు నడుపుతుండగా... త్వరలో జెట్‌ ఎయిర్‌వేస్, ఇండిగో, ఎయిర్‌ ఒడిశా పోటీకి రానున్నాయి. 2018లో కొత్తగా 60 నగరాల్లోకి తొలిసారి విమానాలు ల్యాండ్‌ కానున్నాయి.

హైదరాబాద్‌కు చెందిన ట్రూజెట్‌... ఉడాన్‌ స్కీమ్‌ కింద నాలుగు నగరాల్లో సర్వీసులు నడుపుతోంది. ఈ ఏడాది మరో ఆరు నగరాల్లోకి అడుగు పెడతామని ట్రూజెట్‌ను ప్రమోట్‌ చేస్తున్న టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ కమర్షియల్‌ హెడ్‌ సెంథిల్‌ రాజా ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. ‘‘ఉడాన్‌ రెండో దశలో మాకు కొత్తగా 20 రూట్లు దక్కాయి. కాండ్లా, అహ్మదాబాద్, పోర్‌బందర్, జైసల్మేర్, నాసిక్, జల్గావ్, గువాహటి, కూచ్‌బిహార్, తేజు, రూప్సి నగరాల మధ్య ఈ సర్వీసులుంటాయి’’ అని తెలియజేశారు.

ఇదే పథకం కింద నిరుపయోగంగా, పరిమిత సర్వీసులు నడుస్తున్న 50 విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్స్‌ పునరుద్ధరణకు కేంద్రం రూ.4,500 కోట్లు ఖర్చు చేస్తోంది. పునరుద్ధరణ పనులు ఈ ఏడాది డిసెంబరు చివరినాటికి పూర్తి కానున్నాయి. ఉడాన్‌ రెండో దశలో 17 విమాన సంస్థల నుంచి 502 కొత్త రూట్లలో సర్వీసులు నడిపేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇది కార్యరూపంలోకి వస్తే 126 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్‌ అనుసంధానమవుతాయి. మరోవంక ‘దిశ’ కార్యక్రమం కింద విమానాశ్రయాల్లో మెరుగైన సేవలకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా రూ.17,500 కోట్లతో ప్రణాళిక సైతం సిద్ధం చేసింది.

జతకూడనున్న విమానాలు..
విమానయాన అభివృద్ధి నేపథ్యంలో... దేశీయంగా కొత్త నగరాల్లో అడుగు పెట్టడం, సర్వీసుల పెంపు, విదేశాలకు విస్తరించటం వంటివి జోరందుకున్నాయి. దీన్లో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్‌లోకి 124 నుంచి 130 కొత్త విమానాలు రావచ్చని సమాచారం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 25 శాతం అధికం. వీటిలో 25 విమానాలు అంతర్జాతీయ కార్యకలాపాలకు ఉద్దేశించినవి. అలాగే ఉడాన్‌ స్కీమ్‌ కోసం 22 దాకా విమానాలుంటాయని తెలిసింది. వచ్చే 20 ఏళ్లలో భారత్‌కు 290 బిలియన్‌ డాలర్ల విలువైన 2,100 విమానాలు కొత్తగా వచ్చి చేరతాయని బోయింగ్‌ కంపెనీ చెబుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement