
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ స్టార్టప్స్ ఐపీఓ బాట పట్టాయి. బెంగళూరు, పుణె, ముంబై, హైదరాబాద్ తదితర నగరాలకు చెందిన 200కు పైగా స్టార్టప్‌లు ప్రస్తుతం ఐపీఓకి ముస్తాబయ్యాయి. దాదాపు రూ.1,000 కోట్ల నిధుల సమీకరించాలన్నది వీటి లక్ష్యం. వీటిలో భాగంగా అన్ని అనుమతులతో సోమవారం పుణెకు చెందిన టెక్నాలజీ కన్సల్టింగ్ సర్వీసెస్ అండ్ సపోర్ట్ సంస్థ ‘ఆల్ఫాలాజిక్ టెక్‌సైస్ లిమిటెడ్’... ఇష్యూకు వస్తోంది.
ముంబైకి చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ ట్రాన్స్‌పాక్ట్ ఎంటర్‌ప్రైసెస్ లిమిటెడ్ ఐపీఓకు కూడా అనుమతి వచ్చింది. వీటి దరఖాస్తులు అనుమతి పొందాయని బీఎస్‌ఈ ఇండియా ప్రతినిధి ముఖేష్ షా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. ఒక్కో స్టార్టప్స్ తొలి దశలో రూ.5 కోట్ల నిధులను సమీకరిస్తాయని తెలియజేశారు. లిస్టింగ్‌కు దరఖాస్తు చేసిన స్టార్టప్స్ కార్యకలాపాలు, లావాదేవీలు, మేనేజ్‌మెంట్ ఇతరత్రా అంశాలను పరిశీలించిన తర్వాత ఐపీఓకి అనుమతి వస్తుంది కనక... దీనికి దాదాపు 3 నెలల సమయం పడుతుందని చెప్పారాయన.
పరిశ్రమలో కొత్త ట్రెండ్..
దేశీ స్టార్టప్స్ పరిశ్రమలో ఐపీవో అనేది కొత్త ట్రెండే. ఎందుకంటే స్టార్టప్స్‌కు కార్యకలాపాల విస్తరణకు నిధులు కావాలంటే ఇప్పటిదాకా వెంచర్ క్యాపలిస్ట్ (వీసీ), సంస్థాగత పెట్టుబడిదారుల వైపు చూడాల్సి వస్తోంది. దీంతో స్టార్టప్‌లలో మెజారిటీ వాటా వారి చేతుల్లోకి వెళ్లటం, వారి నియంత్రణలో కార్యకలాపాలు సాగించాల్సి రావటం జరుగుతోంది. బీఎస్‌ఈ లిస్టింగ్‌తో ఈ ఇబ్బందులు తప్పుతాయని స్టార్టప్ వర్గాలు చెబుతున్నాయి.
ఐపీఓకి అర్హతలివే..
► ఐటీ, ఐటీఈఎస్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బిగ్ డేటా, ఈ–కామర్స్, వర్చువల్ రియాలిటీ , బయోటెక్నాలజీ అండ్ లైఫ్ సైన్సెస్, త్రీడీ ప్రింటింగ్, స్పేస్ టెక్నాలజీ, హైటెక్ డిఫెన్స్, నానో టెక్నాలజీ వంటి విభాగాల్లోని స్టార్టప్స్‌కు లిస్టయ్యే అవకాశముంది.
► ఎంఎస్‌ఎంఈ లేదా డిఐపీపీలో నమోదైన స్టార్టప్స్‌కు మాత్రమే బీఎస్‌ఈలో లిస్టయ్యే అర్హత ఉంటుంది. వీటిల్లో నమోదు కాని వాటికి రూ.కోటి చెల్లించిన మూలధనం ఉండాలి.
► కంపెనీల చట్టం కింద రిజిస్టరయి... కనీసం రెండేళ్ల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి ఉండాలి. వెబ్‌సైట్‌తో పాటు షేర్లు డీమ్యాట్ రూపంలో ఉండాలి.
► ఏడాది కాలంలో స్టార్టప్స్ ప్రమోటర్లలో ఎలాంటి మార్పులూ ఉండకూడదు. డైరెక్టర్లపై నిషేధం ఉండకూడదు కూడా.
Comments
Please login to add a commentAdd a comment