చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు అవే
జనవరి–మార్చి త్రైమాసికానికి పాత రేట్లే కొనసాగింపు
న్యూఢిల్లీ: బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్న తరుణంలోనూ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రస్తుత వడ్డీ రేట్లనే కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. జనవరి – మార్చి త్రైమాసికానికి అంతకుముందు అమల్లో ఉన్న వడ్డీ రేట్లే కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. పీపీఎఫ్, ఐదేళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై 8 శాతం వడ్డీ రేటు అమలవుతుంది. కిసాన్ వికాస పత్రపై రాబడులు 7.7 శాతంగా ఉంటాయని, 112 నెలలకు గడువు తీరతాయని ఆర్థిక శాఖ పేర్కొంది.
సుకన్య సమృద్ధి యోజన, ఐదేళ్ల సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌పైనా ఇదే రేటు వర్తిస్తుంది. సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై 4 శాతం, 1–5 ఏళ్ల వరకు కాల వ్యవధి గల టర్మ్ డిపాజిట్లపై 7 నుంచి 7.8 శాతం, రికరింగ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 7.3 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం మేరకు... ప్రతీ త్రైమాసిక కాలానికి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రకటించాల్సి ఉంటుంది. ప్రభుత్వరంగంలోని ఎస్‌బీఐ, పీఎన్‌బీ, యూని యన్ బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను 0.90 శాతం వరకూ తగ్గిస్తూ ఆదివారం నిర్ణయాలను ప్రకటించిన విషయం తెలిసిందే.