లాభాల స్వీకరణ!
వారంలో ఎగసి పడిన పసిడి
న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర ఆగస్టు 4వ తేదీతో ముగిసిన వారంలో వారం వారీగా 11 డాలర్లు తగ్గి, 1,258 డాలర్లకు చేరింది. అమెరికా ఆర్థిక బలహీనతలు, రాజకీయ సమస్యలు, తక్షణం ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 1–1.25%) పెరగబోదన్న అంచనాలతో వారంలో దాదాపు 1,274 గరిష్ట స్థాయికి చేరిన బంగారం ఫ్యూచర్స్ ధర అక్కడి నుంచి క్రమంగా లాభాల స్వీకరణ ప్రారంభమైనా, శుక్రవారం వరకూ 1,270 స్థాయిలోనే పటిష్టంగా ఉంది.
ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్ కూడా వారం అంతా క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. ఒక దశలో 92.58 స్థాయికి ఇండెక్స్ జారిపోయింది. అయితే శుక్రవారం వెలువడిన అమెరికా సానుకూల ఉపాధి కల్పనా గణాంకాలు డాలర్ ఇండెక్స్‌ను ఆ ఒక్కరోజే అనూహ్యంగా పెంచేశాయి. ఆ రోజు ఒక దశలో 93.55 స్థాయికి ఎగసిన డాలర్ ఇండెక్స్– చివరకు 93.37 వద్ద ముగిసింది.
ఇదే రోజు పసిడి కూడా భారీగా 1,253 డాలర్లకు పడిపోయి, చివరకు 1,258 డాలర్ల వద్ద ముగిసింది. అయితే పసిడిది బులిష్ ధోరణేననీ, తగ్గినప్పుడల్లా అది కొనుగోళ్లకు అవకాశమనీ నిపుణులు చెబుతున్నారు. పసిడికి 1,240 డాలర్ల వద్ద పటిష్ట మద్దతు ఉందనీ, అటు తర్వాత 1,204 వద్ద మరో మద్దతు లభిస్తుందని వివరిస్తున్నారు. పై దిశగా 1,275 డాలర్లు దాటితే తరువాత నిరోధం 1,300 డాలర్లని వారి విశ్లేషణ.
దేశంలో రూపాయి ఎఫెక్ట్...
అంతర్జాతీయంగా పసిడి 11 డాలర్లు బలహీనపడినప్పటికీ, దేశంలో ఆ ప్రభావం యథాతథంగా కనిపించలేదు. డాలర్ మారకంలో రూపాయి భారీ పెరుగుదల దీనికి కారణం. వారంలో పసిడి 64.13 స్థాయి నుంచి భారీగా 63.75 స్థాయికి లాభపడింది. ఈ నేపథ్యంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో పసిడి వారంలో కేవలం రూ.174 తగ్గి రూ.28,406 కి చేరింది. ఇక ముంబై ప్రధాన మార్కెట్‌లో మాత్రం వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర స్వల్పంగా రూ.100 ఎగసి రూ.28,690కి చేరింది.