
మనలో చాలా మంది రిటైర్మెంట్ గురించి వయసులో ఉన్నపుడు పెద్దగా ఆలోచించరు. అదంతా రిటైరయ్యాక చూసుకుందాంలే... అనుకుంటారు. కాకపోతే... రిటైర్మెంట్ గురించి రిటైరయ్యాక ఎలా ఆలోచిస్తామనే చిన్న లాజిక్ అప్పట్లో అర్థం కాదు. అది అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. అప్పుడు తీరిగ్గా విచారించినా చేసేదేమీ ఉండదు.
గణాంకాలను బట్టి చూసినా... ప్రభుత్వరంగంలోని వారు కాకుండా ప్రైవేటు ఉద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వారిలో రిటైర్మెంట్ గురించి ప్రణాళిక వేసుకునే వారు చాలా తక్కువ. తీరా రిటైర్మెంట్‌కు వచ్చిన తర్వాత... చేతిలో ఉన్న ఆ కాసింత డబ్బును నెలవారీ ఆదాయం కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న సందేహంలో పడిపోతారు. నిజానికి రిటైర్మెంట్ అనేది 35–40 ఏళ్ల ఉద్యోగ జీవితం తర్వాత వచ్చే దశ. ఉద్యోగం చేస్తున్నంత కాలం నెలనెలా వేతనం బ్యాంకు ఖాతాలో పడిపోతూ అన్ని అవసరాలనూ తీర్చేస్తుంది. తీరా ఉద్యోగ కాలం ముగిశాక ఆదాయం ఒక్కసారిగా ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి!!. ఏదో తెలియని ఆందోళన ఎదురవుతుంది. అందుకే తగినంత నిధిని ముందు నుంచే ఏర్పాటు చేసుకోవాలి. ఇది రిటైర్మెంట్ తరువాతి జీవనానికి తగినంత ఆదాయాన్నిచ్చేదిలా ఉండాలి. దానికోసం ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియజేసే కథనమే ఇది...
సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం : దాదాపు మనమంతా గమనించాల్సిందొకటుంది. అది... పొదుపు వేరు; ఇన్వెస్ట్‌మెంట్ వేరు. రిటైరయ్యాక ఆదాయం కావాలంటే ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. ఇన్వెస్ట్ చేయకుండా పొదుపు చేసిన దాన్నుంచి ఖర్చు చేస్తూ వెళితే ఉన్నదంతా కరిగిపోతుంది. పెద్ద వయసులో ఈ పరిస్థితి ఊహించజాలం. చిన్న వయసులో ఉన్న వారైతే రిస్క్ భయం లేకుండా ఇన్వెస్ట్ చేయగలరు. రిస్క్‌ను భరించే సామర్థ్యం వారికి ఎక్కువ.
అదే 30–40 ఏళ్ల వయసులో ఉన్న వారైతే కాస్తంత భద్రతతో కూడిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. రిటైరయ్యాక తమ దగ్గరున్న నిధి నుంచే ఆదాయం రాబట్టుకోవాలి కనుక వారు చేసే పెట్టుబడులు భిన్నంగా ఉండాలి. స్థిర ఆదాయాన్నిచ్చేలా ఉండాలి. ముఖ్యంగా రిటైర్మెంట్‌కు మూడేళ్ల ముందే కార్పస్ ఎంతుందన్నది సమీక్షించుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు చాలదనుకుంటే రిటైర్మెంట్‌ను వాయిదా వేసుకోవడం ఉత్తమం.
ఇన్వెస్ట్ చేయడం ఎలా?
రిటైరయ్యాక చాలా మందికి ఎదురయ్యే ప్రశ్నే ఇది. వేతన జీవులు తాము సర్వీసులో ఉన్నంత సేపూ కంపెనీకి సేవలందించి ఉంటారు. అందరికీ ఇన్వెస్ట్‌మెంట్‌పై అవగాహన ఉండదు. దీంతో ఇన్వెస్ట్‌మెంట్లో పొరపాట్లు జరిగే ప్రమాదం ఉంటుంది. రిటైరయ్యాక సంప్రదాయ సాధనాల్లో చేసే ఇన్వెస్ట్‌మెంట్‌పై రాబడులు 7 శాతాన్ని మించవు. అధిక రాబడులు రావాలంటే రిస్క్ అధికంగా ఉండే వాటిలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ దశలో అధిక రిస్క్ తీసుకోలేరు.
అందుకే ఇది డెట్, ఈక్విటీల కలబోతగా ఉండాలి. అధిక శాతం డెట్‌లో ఇన్వెస్ట్ చేసి, కొంత మేర ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే... రాబడులు 7 శాతం కంటే ఎక్కువే వస్తాయి. అలాగే, రిటైర్మెంట్ నిధిని ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా ఆదాయం తీసుకునేలా ఉండకూడదు. ఏడాది అవసరాలకు సరిపడేలా రిడెంప్షన్ ఉండాలి. ప్రతి నెలా ఎంతో కొంత వెనక్కి తీసుకోవడం వల్ల కార్పస్ తగ్గిపోతుంది. తక్కువ రిస్క్, స్థిరమైన ఆదాయం, కార్పస్ వృద్ధి చెందేలా ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలి.
నెలవారీ బడ్జెట్ తప్పనిసరి...
రిటైర్మెంట్ నిధిని పెట్టుబడులకు మళ్లించే ముందే నెలవారీ బడ్జెట్‌ను ఖరారు చేసుకోవాలి. రోజువారీ అవసరాల కోసం ప్రతినెలా ఎంత కావాలో తేల్చుకోవాలి. కిరాణా, యుటిలిటీ బిల్లులు, ఈఎంఐలు, వినోదం, ఆహారం, వైద్యం ఇలా అన్ని అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటిని రెండు భాగాలు చేయాలి. అవసరమైనవి, అవసరం లేనివి.
నిధి రెండు భాగాలు చేయాలి...
మొత్తం రిటైర్మెంట్ నిధిని రెండు భాగాలు చేయాలి. ఒక భాగాన్ని స్థిరాదాయ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. దీనిపై వచ్చే ఆదాయం మీ నెలవారీ అవసరాలను తీర్చే స్థాయిలో ఉండాలి. స్థిరాదాయాన్నిచ్చే పథకాలైన పెన్షన్ స్కీమ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ మ్యూచువల్ ఫండ్స్, పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం దీనికి అనువైనవని చెప్పొచ్చు. రెండో భాగాన్ని రిస్క్ ఉన్నప్పటికీ అధిక రాబడులను ఇచ్చే ఫండ్స్, ఈక్విటీ వంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి.
పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో
రిటైరయిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ 100 శాతం నిధుల్ని తీసుకెళ్లి ఈక్విటీలో పెట్టకూడదు. అధిక భాగం డెట్‌లోనే ఉంచాలి. ఈక్విటీలకు కేటాయించేది స్వల్పంగానే ఉండాలి. సగటున ఈక్విటీ ఫండ్స్‌లో 30 శాతం మించి పెట్టుబడులు పెట్టకపోవటమే మంచిది. డబ్బు ఎంతున్నా దాని విలువను ద్రవ్యోల్బణం కొద్ది కొద్దిగా హరించేస్తుంది. అందుకే ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులను ఇచ్చే సాధనాలను ఎంపిక చేసుకోవాలి. అలాగని అధిక రాబడుల కోసం దీర్ఘకాలం పాటు లాకిన్‌లో ఉండే సాధనాలు రిటైర్ అయిన వారికి సూచనీయం కావు. ఎందుకంటే వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ డబ్బుల్ని వెనక్కి తీసుకునేలా (లిక్విడిటీ) ఉండాలి. అందుకే ఎందులో ఇన్వెస్ట్ చేసినా ఓ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి.
ఇలా చేయవచ్చు...
ఉదాహరణకు ఓ రిటైర్ అయిన వ్యక్తి దగ్గర రూ.50 లక్షలు ఉన్నాయనుకోండి. నెలవారీ బడ్జెట్ రూ.28,000–32,000. సదరు వ్యక్తి ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే... ముందు ఈ నిధి నుంచి కొంత మేర పక్కన పెట్టాలి.
♦ అత్యవసర నిధి = నెలకు రూ.32,000 చొప్పున ఆరు నెలల కోసం = రూ.1,92,000
♦ ఏడాది అవసరాలకు అయ్యే వ్యయాలు = రూ.32,000 చొప్పున 12 నెలలకు = రూ.3,84,000
♦ ఈ రెండూ కలిపి మొత్తం రూ.5,76,000.
ఇప్పుడు అత్యవసర నిధి రూ.1,92,000ను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేయాలి. ఏడాది అవసరాల కోసం ఉద్దేశించిన రూ.3,84,000ను తీసుకెళ్లి అధిక వడ్డీరేటునిచ్చే బ్యాంకు ఖాతాలో ఉంచాలి. ప్రైవేటు రంగ బ్యాంకులు కొన్ని 6% వడ్డీని ఇస్తున్నాయి. ఈ రెండూ మినహాయించగా రిటైర్మెంట్ కార్పస్ రూ.44,24,000 ఉంటుంది. దీన్ని రెండు భాగాలు చేయాలి.
♦ 70 శాతం డెట్ విభాగంలో పెట్టుబడులకు = రూ.31,00,000
♦ 30 శాతం ఈక్విటీలో పెట్టుబడుల కోసం = రూ.13,24,000
♦ 70 శాతం నిధుల్ని (రూ.31,00,000) మ్యూచువల్ ఫండ్స్ అందించే మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్లలో (ఎంఐపీ) ఇన్వెస్ట్ చేయాలి. వీటి రాబడులు వార్షికంగా 11 శాతం స్థాయిలో ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్లు 80 శాతం నిధుల్ని డెట్‌లోనూ, 15 శాతం నిధుల్ని ఈక్విటీలోనూ, 5 శాతం నిధుల్ని ఇతర విభాగాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. రూ.31,00,000పైన సగటున 11 శాతం రాబడి అంచనా వేసి చూస్తే నెలవారీగా వచ్చే ఆదాయం రూ.28,416 అవుతుంది.
దీంతో నెలవారీ అవసరాలు తీరిపోతాయి. 30 శాతం నిధుల్ని డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఐదేళ్ల కాలం కోసం ఇన్వెస్ట్ చేయాలి. ఇవి వార్షికంగా సగటున 16 శాతం రాబడులను ఇవ్వగలవు. ఆ విధంగా చూస్తే ఇది అదనపు ఆదాయం తెచ్చిపెడుతుంది. ద్రవ్యోల్బణ ప్రభావం రిటైర్మెంట్ కార్పస్‌పై పడకుండా ఈ పోర్ట్‌ఫోలియో సాయపడుతుంది. ఐదారేళ్లకు పెట్టుబడులు రెట్టింపవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment